రివర్స్ : మళ్లీ ఎగిసిన ద్రవ్యోల్బణం
Published Mon, Aug 14 2017 7:19 PM | Last Updated on Tue, Sep 12 2017 12:04 AM
ముంబై : దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు మళ్లీ పైకి జంప్ కావడం ప్రారంభమయ్యాయి. ఆహార ధరలు తగ్గడం తగ్గుముఖం పట్టడంతో, రిటైల్ ద్రవ్యోల్బణం 2.36 శాతానికి పెరిగింది. జూన్‌లో 1.54 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, జూలైలో 2.36 శాతంగా నమోదైనట్టు సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటాలో తెలిసింది. గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన ధరలు, మళ్లీ పెరుగుదలను నమోదుచేశాయి. ఈ పెరుగుదల రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనావేసిన 1.87 శాతం కంటే కూడా ఇంకా ఎక్కువ. వినియోగదారుల ధరల ఇండెక్స్(సీపీఐ) ఆధారితంగా ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు.
షుగర్, మిఠాయి ఉత్పత్తుల ధరలు జూలై నెలలో 8.27 శాతం పైకి ఎగిశాయి. వీటితో పాటు పాన్, టుబాకో, మత్తుపదార్థాలు కూడా 6.39 శాతం ప్రియమయ్యాయి. గృహ వ్యయాలు 4.98 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షకుల ఉత్పత్తుల ధరలు కూడా 4.22 శాతం పెరిగినట్టు తెలిసింది. వీటితోపాటు కూరగాయలు ధరలు పెరగడం ప్రారంభం కావడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్టు ఫిలిప్‌క్యాపిటల్ ఇండియా ఆర్థికవేత్త అంజలి వెర్మ చెప్పారు. ఇదే ధోరణి డబ్ల్యూపీఐలో కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు నెలలో కూడా కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటాయని అంచనావేస్తున్నట్టు చెప్పారు. నేడు విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి రేటు కోత చేపట్టకపోవచ్చని తెలుస్తోంది.
Advertisement