రిటైల్ ధరలు కూల్..
⇒ ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.87 శాతం
⇒ నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గుదల..
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో 4.87 శాతంగా ఉంది. అంటే 2014 ఏప్రిల్ ధరలతో పోల్చితే ఆయా వినియోగ వస్తువుల బాస్కెట్ రిటైల్ ధరలు 2015 ఏప్రిల్‌లో 4.87 శాతం పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో ధరల వృద్ధిరేటు నమోదుకావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి.
మార్చిలో పోల్చితే ఏప్రిల్‌లో పళ్లు, కూరగాయలు, పాలు, సంబంధిత ఉత్పత్తుల ధరల పెరుగుదల స్పీడ్ తగ్గడం దీనికి కారణం. కాగా మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతం. ముఖ్యాంశాలు...
ఆహారం, పానీయాల ధరల పెరుగుదల రేటు ఏప్రిల్‌లో 5.36 శాతంగా ఉంది. ఒక్క ఆహార ఉత్పత్తులనే తీసుకుంటే ఈ రేటు మార్చిలో 6.14 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 5.11 శాతానికి తగ్గింది. ఈ విభాగాన్ని వేర్వేరుగా చూస్తే- వార్షికంగా చక్కెర (-5.99 శాతం), గుడ్లు (-1.46 శాతం) ధరలు తగ్గాయి. పప్పు దినుసుల ధరలు రెండంకెల స్థాయి (12.52 శాతం)లోనే పెరిగింది. అయితే తృణధాన్యాలు (2.15 శాతం), మాంసం, చేపలు (5.50 శాతం), పాలు-పాల ఉత్పత్తులు (8.21 శాతం), చమురు, వెన్న (1.77 శాతం), పండ్లు (5.08 శాతం), కూరగాయలు (6.63 శాతం), సుగంధ ద్రవ్యాలు (8.70 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4.68 శాతం) ప్రెపేర్డ్ మీల్స్ (7.68 శాతం) రెండంకెల కన్నా తక్కువ ధరల స్పీడ్‌ను నమోదుచేసుకున్నాయి.
⇒ పాన్, పొగాకు తదితర మత్తుప్రేరిత ఉత్పత్తుల ధరలు 9.22% ఎగశాయి.
⇒ దుస్తులు, పాదరక్షల ధరలు 6.15 శాతం పెరిగాయి.
⇒ హౌసింగ్‌కు సంబంధించి రేటు 4.65 శాతంగా ఉంది.
⇒ ఇంధనం, లైట్ ధరలు 5.60 శాతం ఎగశాయి.