రిటైల్ ధరలు పైపైకి...
♦ డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.61 శాతంగా నమోదు
♦ వరుసగా ఐదో నెలా పెరుగుదల...
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో 5.61 శాతం పెరిగింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో రిటైల్ ధరల బాస్కెట్ మొత్తం 5.61 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలలుగా ఈ రేటు పెరుగుతూ వస్తోంది. నవంబర్‌లో ఈ రేటు 5.41 శాతంగా ఉంది.
కూరగాయలు, పప్పు దినుసుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఫిబ్రవరి 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో... ఈ తరహా గణాంకాలు వెలువడ్డం... తదుపరి రెపో రేటు కోత ఆశలను నీరుకారుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జనవరి 2016 నాటికి ఆర్‌బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటు లక్ష్యం 6 శాతం.
సూచీలో విభాగాలను చూస్తే...
ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతం
పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ధరలు 9.27 శాతం ఎగశాయి
దుస్తులు, పాదరక్షల విభాగం రేటు 5.74 శాతం ఎగసింది.
హౌసింగ్ విభాగం రేటు 5.06 శాతం పెరిగింది.
ఒక్క ఆహార ధరలను చూస్తే...
పప్పులు, సంబంధిత ఉత్పత్తుల ధరలు తీవ్రంగా 46% పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 10.83% ఎగశాయి. వంటనూనెల ధరలు 7.06%, కూరగాయల ధరలు 4.63% ఎగశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4% పెరిగాయి. పెరిగిన జాబితాలో మాంసం-చేపలు(6.57%), తృణ ధాన్యాలు (2. 12%) ఆల్కాహాలేతర పానీయాలు(4.45%) ఉన్నుుా. చక్కెర ధరలు మాత్రం 6.16% తగ్గాయి.