కూరగాయలు, పప్పుల రేట్లు భారీగా తగ్గాయ్!
కూరగాయలు, పప్పుల రేట్లు భారీగా తగ్గాయ్!
Published Mon, Jun 12 2017 6:41 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో రికార్డు కనిష్టానికి పడిపోయింది. కూరగాయలు, పప్పుధాన్యాల రేట్లు భారీగా తగ్గిపోవడంతో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 2.18 శాతంగా నమోదైంది. పండ్ల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, కూరగాయలు ధరలు తగ్గుట దీనికి బాగా సహకరించింది. వస్త్రాలు, ఇంధనం, గృహాల రేట్లు కూడా తగ్గినట్టు ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. రాయిటర్స్ పోల్ లో ఈ ద్రవ్యోల్బణం 2.60 శాతంగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అయితే ఏప్రిల్ నెలలో వినియోగదారుల ధరల సూచీ 2.9 శాతానికి ఎగిసింది. ప్రస్తుతం ఈ ద్రవ్యోల్బణం 2012 కనిష్ట స్థాయిలకు దిగొచ్చింది. 2016 మే నెలలో ఇది 5.76 శాతం ఉంది.
ఈ నెలలో మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం నెగిటివ్ లో -1.05 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు 13.44 శాతం కిందకి పడిపోయాయి. పప్పులు, ఉత్పత్తులు కూడా 19.45 శాతం పడిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగే అంచనాలతో రిజర్వు బ్యాంకు ఇటీవల జరిగిన పాలసీ విధానంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం తగ్గిన ద్రవ్యోల్బణంతో ఆగస్టులో నిర్వహించబోయే మీటింగ్ లో కచ్చితంగా రేట్లను తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 25 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. రుతుపవనాలు మంచిగా ఉంటే, కనీస మద్దతు ధరల్లో ఎలాంటి పెంపు ఉండదని, దీంతో ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని ఎస్క్వైర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వయిజర్స్ సీఈవో సామ్రాట్ దాస్ గుప్తా చెప్పారు.
Advertisement
Advertisement