pulses
-
వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..?
సూర్యుడి భగభగలు నుంచి చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరయి, వైరస్‌లతో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. సెనగపప్పు..సెనగపప్పులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మసూర్ పప్పు లేదా ఎర్ర పప్పువాటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.మినపప్పు..ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.తినకూడని ఇతర ఆహారపదార్థాలు..వేయించిన ఆహారాలు..వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది. పచ్చి ఆకుకూరలు..సలాడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ కాలంలో వాటిని నివారించడం ఉత్తమం. ఆకుల్లో తరుచుగా వ్యాధికారక కీటకాలు ఉంటాయి. వాటిని తొలగించడం కష్టం. అందువల్ల వాటిని బాగా శుభ్రం చేసుకుని తినడం లేదా దూరంగా ఉండటం మంచిది. (చదవండి: -
వంట చేయాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్‌లలో మూడు అంకెలలో ఉంది.పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు. -
పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు!
రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ దేశీయ పప్పుల అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పప్పుల దిగుమతులు 2023-24లో గతంలోకంటే దాదాపు రెండింతలు పెరిగి 3.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల టన్నుల పప్పు దినుసులు ఎగుమతి చేసుకున్నట్లు అంచనా. ఇది అంతకుమందు ఏడాదిలో 24.5 లక్షల టన్నులుగా ఉంది. దేశీయంగా పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా పప్పు దినుసుల దిగుమతుల కోసం బ్రెజిల్, అర్జెంటీనాలతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిసింది. చర్చలు సఫలమైతే బ్రెజిల్ నుంచి మినుములు, అర్జెంటీనా నుంచి కందులను దిగుమతి చేసుకోనుంది. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఇప్పటికే మొజాంబిక్, టాంజానియా, మయన్మార్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం పసుపు బఠానీల దిగుమతిపై ఈ ఏడాది జూన్ వరకు సుంకాన్ని వసులు చేయకూడదని నిర్ణయించింది. ఇప్పటికే మినుములు, కందుల దిగుమతులకు ఈ నిబంధన వర్తిస్తోంది. మార్చి 31, 2025 వరకు వీటిని సుంకం లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది. ఎన్నికల సమయంలో ఆందోళన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పప్పుల ధరల ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విధంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం మార్చిలో 17 శాతం నమోదైంది. దాంతో గత కొంతకాలంగా పప్పు ధరలు పెరుగుతున్నాయి. వాటిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15న పప్పు నిల్వలపై పరిమితులను విధించింది. ఇదీ చదవండి: ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ ప్రభుత్వం గ్యారెంటీ కొనుగోలు, ఎంఎస్పీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ దేశీయంగా గత కొంతకాలంగా ఉత్పత్తి క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2023-24లో పప్పుధాన్యాల ఉత్పత్తి 234 లక్షల టన్నులుగా ఉంది. అంతకుమందు ఏడాది 261 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
పప్పు ధాన్యాల సేకరణ షురూ
సాక్షి, అమరావతి: రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చి న ప్రభుత్వం.. తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకూ అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ 2023–24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. 2.75 లక్షల టన్నుల సేకరణకు అనుమతి కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తున్నారు. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నాం. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్‌దాల్ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు. కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముందస్తు రబీకి సిద్ధమైన రైతులకు అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. మిగిలిన విత్తనాలను అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో 10.92 లక్షలు ఎకరాల్లో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు రబీ కోసం 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా 36,121 క్వింటాళ్ల వరి, 14,164 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 142 క్వింటాళ్ల కందులు, 833 క్వింటాళ్ల ఉలవలు, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 367 క్వింటాళ్ల నువ్వులు, 727 క్వింటాళ్ల వేరుశనగ, 1,697 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీకి సిద్ధం చేశారు. పకడ్బందీగా విత్తన పంపిణీ ముందస్తు రబీ సీజన్‌కు సిద్ధమైన రైతులకు శనగ విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టాం. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా.. ఈ సారి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వరితో సహా మిగిలిన విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనం గడిచిన సీజన్లో ఎంపిక చేసిన రైతు క్షేత్రాల్లో శనగ విత్తనాన్ని సేకరించారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించారు. 3.44 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎకరం లోపు రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేయనున్నారు. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేసిన శనగ విత్తనాలపై ఈ సారి 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్టతో పాటు చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుండగా.. వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం సబ్సిడీ, మినుము, పెసలు, కందులు, అలసందల విత్తనాలను 30 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వరి విత్తనాలను క్వింటాల్‌కు ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో రూ.1000, వర్తించని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 58 కోట్లు భరించగా, ఈసారి రూ.120 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. -
36 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదికను అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.99 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.86 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 49.15 శాతం పత్తి సాగైందని నివేదిక వెల్లడించింది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.39 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.80 శాతంలో వరి సాగైందని తెలిపింది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో (21.25%) సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.23 లక్షల ఎకరాల్లో (54.18%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 87,179 ఎకరాల్లో సాగైందని వెల్లడించింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 92 శాతం సాగు... రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాల్లో 92.05 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.86 శాతం విస్తీర్ణంలో, నారాయణపేట్‌లో 55.85 శాతం విస్తీర్ణంలో సాగ య్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 2.41 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5,474 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగ య్యాయి. కాగా, రాష్ట్రంలో 3 జిల్లాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాభావం నెలకొందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమో దైందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో మాత్రం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. కాగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు కలిపి చూస్తే సరాసరి 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, ఈ నెల లో ఐదు రోజుల్లో 29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో ఏకంగా 74 శాతం చొప్పు న లోటు వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మూసీ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోనిమూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి పెద్దగా ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్ట్‌లో నీటిమట్టాన్ని తగ్గించాలని మూసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 641.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.67 టీఎంసీల నీరు ఉంది. -
తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టి
న్యూఢిల్లీ: ఎక్కువ లాభదాయకత, తక్కువ నీటి వినియోగం వంటి సౌలభ్యతలున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు దృష్టిని మళ్లించేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డ్‌కు ఆరి్థకశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ఉపన్యాసం చేశారు. గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్థానికంగా సమర్ధత పెంపొందడానికి, చక్కటి ఫలితాలను అందించడానికి కృషి చేయాలని అగ్రి–ఫైనాన్స్ సంస్థకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ను పురస్కరించుకుని ’శ్రీ అన్న’ ఉత్పత్తి, మార్కెటింగ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే తృణధాన్యాల కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే తృణ ధాన్యాలను పండిస్తున్న రైతుల ఆరి్థక ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేడు చింతన్ శిబిర్... కాగా, కేంద్ర బడ్జెట్, అలాగే ఫ్లాగ్íÙప్ పథకాల నుండి నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, ఆయా అంశాల సమీక్షకు జూన్ 17న ’చింతన్ శిబిర్’ నిర్వహించినట్లు ఆరి్థక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. -
పప్పు.. నిప్పు!
సాక్షి, హైదరాబాద్: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్ దాల్) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే.. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. స్టాక్.. బ్లాక్ మార్కెట్‌కు? పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్‌లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్‌ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్‌కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్‌లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. శనగలు క్వింటాల్ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ (ఈ–హస్తాక్షర్) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. -
పప్పులు.. కుప్పలు తెప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తి ఏడాదికేడాది పెరుగుతోంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే 2020– 21లో 1.28 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి పెరిగింది. 2016 –17లో 5.36 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020–21లో 6.64 లక్షలకు చేరుకుంది. మొత్తంగా 2020–21లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. ఇటీవలి కేంద్రం నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా రాజస్తాన్ రాష్ట్రంలో 48.21 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్‌లో 43.64 లక్షల టన్నులు, మహారాష్ట్రలో 42.24 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 11.85 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో 2016–17లో 2.31 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కాగా 2020–21లో 2.55 కోట్లకు పెరిగాయి. ఉత్పత్తి పెంచే కార్యాచరణతో.. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక కార్యా చరణను అమలు చేస్తోంది. విత్తనాల పంపిణీ, అధిక దిగుబడినిచ్చే రకాలు, వ్యవసాయ యంత్రాలు, నీటి ఆదా పరికరాలు, మొక్కల రక్షణ రసాయనాలు, పోషకాల నిర్వహణ, నేల మెరుగుదల, రైతులకు శిక్షణ చేపట్టింది. దేశంలో ఆయా రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో 150 సీడ్ హబ్‌లు ఏర్పాటయ్యాయి. బీహార్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2018–19 నుంచి చెరకులో పప్పు ధాన్యాల అంతర పంట అనే కొత్త పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహిస్తుండటంతో మున్ముందు ఈ పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కంది, శనగ కొనుగోలుకు ఏర్పాట్లు రాష్ట్రంలో ఈ వానాకాలంలో 4.67 లక్షల మెట్రిక్ టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. మద్దతు ధరకు 80,142 మెట్రిక్ టన్నులు కొనేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు 103 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించిం ది. అందులో 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటా మద్దతు ధర రూ. 6,300 కాగా బహిరంగ మార్కెట్లోనూ ఇంతే ధర ఉందని, దీంతో కేంద్రాలకు రైతులు రావట్లే దని మార్క్ఫెడ్వర్గాలు అంటున్నాయి. కేంద్రం 58,485 మెట్రిక్ టన్నుల శనగ కొనాలని నిర్ణయించడంతో వాటి కోసం కూడా మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. 38 కేంద్రాలు గుర్తించి ఇప్పటికే 18 తెరిచామని మార్క్‌ఫెడ్ పంటల సేకరణ విభాగం ఇన్చార్జి చంద్రశేఖర్ తెలిపారు. మద్దతు ధర క్వింటాకు రూ. 5,230 ఉంది. -
పప్పు, నూనెగింజల సాగుపై రైతుల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అందుకు కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టాలి పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకంపై దృష్టి సారించామని మం త్రి చెప్పారు. వచ్చే వానాకాలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొ క్కలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. పత్తి మద్దతు ధర రూ. 6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7 వేలకు పైగా పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు భారీగా పత్తి సాగు చేయాలని సూచించారు. -
15.18 లక్షల హెక్టార్లలో మూషిక నిర్మూలన
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగులో అన్నదాతను కలవరపెడుతున్న మూషికాల ఆటకట్టించేందుకు సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. గత రెండేళ్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదాతకు అండగా నిలిచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఏడాది పొడవునా వరి, వేసవిలో పప్పుధాన్యాలు సాగుచేస్తారు. ఏడాది పొడవునా పంటలు సాగుచేయడంతో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ ద్వారా వరిపంట నష్టాన్ని తగ్గించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించడం లక్ష్యంగా 2019–20 నుంచి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లలో 25.95 లక్షల మంది రైతులకు లబ్ధి ఖరీఫ్‌లో జూన్ నుంచి అక్టోబర్ వరకు, రబీలో నవంబర్ నుంచి మార్చి వరకు చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల గత రెండేళ్లలో హెక్టార్‌కు 5 నుంచి 7 క్వింటాళ్ల ధాన్యాన్ని సంరక్షించగలిగారు. 2019–20లో 13.05 లక్షల హెక్టార్లలో రూ.1.75 కోట్లతో చేపట్టగా 14.57 లక్షల మంది రైతులకు లబ్ధికలిగింది. 2020–21లో 12.03 లక్షల హెక్టార్లలో రూ.1.14 కోట్లతో చేపట్టగా 11.38 లక్షల మంది అన్నదాతలు లబ్ధిపొందారు. 2021–22 వ్యవసాయ సీజన్లో రూ.2.01 కోట్లతో 15.18 లక్షల హెక్టార్లలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించారు. దీనికి 14,376 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను వినియోగించనున్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణాలో 2.54 లక్షల హెక్టార్లు, గుంటూరులో 2.34 లక్షల హెక్టార్లు, తూర్పుగోదావరి 2.46 లక్షల హెక్టార్లు, పశ్చిమగోదావరిలో 2.02 లక్షల హెక్టార్లు చొప్పున మొత్తం 9.36 లక్షల హెక్టార్లలో రూ.1.25 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం 8,915 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుబాటులో ఉంచారు. 2021–22లో కార్యాచరణ ఇలా.. ఎంపికచేసిన గ్రామాల్లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సామూహిæకంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. వ్యవసాయ క్షేత్రాలతోపాటు సాధారణ స్థలాలు, రోడ్లు, కాలువలు, మురుగుకాలువల తిన్నెలు, బీడు, బంజరు, ప్రభుత్వభూముల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. ఆర్బీకేల వద్ద విషపు ఎరను తయారుచేసి సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు పంపిణీ చేస్తారు. విషపు ఎరలకు వ్యవసాయ క్షేత్రాల్లో అయ్యే ఖర్చును రైతులు, బంజరు, ప్రభుత్వ భూముల్లో అయ్యే ఖర్చును పంచాయతీలు భరించాల్సి ఉంటుంది. హెక్టార్‌కు 8 నుంచి 10 గ్రాముల బ్రోమోడయోలిన్ను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ మందులో నూకలు, వంటనూనె కలిపి ఎరను రైతులు పంట నష్టం జరిగే ప్రదేశాల్లో ఎలుకల బొరియల్లో ఉంచాలి. సామూహిక ఎలుకల నిర్మూలన కోసం ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం గడిచిన రెండు సీజన్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సామూహిక ఎలుకల నిర్మూలనకు ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం.ఎలుకల నివారణ మందును ఆర్బీకే ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
మార్కెట్లో మంచి ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు గతంలో సిండికేట్‌గా ఏర్పడి తమ ఇష్టమొచ్చిన ధరలకే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేసేవారు. దీనివల్ల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా రైతులకు లభించేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కనీస మద్దతు ధర లభించని పంటలను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఇతర పద్ధతుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది ఈ విధంగా పెద్దఎత్తున పంట ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు వ్యవసాయ ఉత్పత్తులు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ ఏడాది పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో పప్పు ధాన్యాలు, రాగులు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాల ధరలు పెరిగాయి. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుండటంతో రైతుల పంట పండింది. ఈ కారణంగా రైతులు ఈసారి మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. గతేడాది రూ.2,856.53 కోట్ల విలువైన పంటల కొనుగోలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం గతేడాది మాదిరిగానే కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా సుమారు 10 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ అధ్వర్యంలో మార్చి 1న తెరిచింది. అయితే, ఇప్పటివరకు రూ.796.81 కోట్ల విలువైన 4.05 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే రైతులు వాటిలో విక్రయించారు. గతేడాది రబీలో రూ.2,856.53 కోట్ల విలువైన 8,19,572 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అమ్ముడుపోయాయి. మొక్కజొన్న, జొన్న రైతుల్ని ఆదుకుంటున్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న, జొన్న రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,850 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.1,450 నుంచి రూ.1,550 మధ్య పలుకుతోంది. ఈ కారణంగా మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ ఏడాది 3.96 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఇప్పటివరకు రూ.553.01 కోట్ల విలువైన 2,98,924.50 టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆదుకుంది. జొన్నలు 1.10 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.195.33 కోట్ల విలువైన 96,332.85 టన్నులను కొనుగోలు చేశారు. ఈ విధంగా ఈ ఏడాది 60,953 మంది రైతుల నుంచి రూ.796.81 కోట్ల విలువైన 4,04,763.10 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయగలిగింది. ఇది శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చింది. మినుములు, కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే మిన్నగా ధరలు పలకడం వలన ఈ ఏడాది మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు పెద్దగా రాలేదు. ఇది నిజంగా శుభపరిణామం. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
ఏపీలో 15 నుంచి పప్పుధాన్యాల సేకరణ
సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి రైతుల వద్ద పప్పుధాన్యాలను ప్రభుత్వం సేకరించనుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని 31 కొనుగోలు కేంద్రాల్లో అపరాల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ చర్యలు తీసుకుంది. వైఎస్ జగన్ సీఎం బాధ్యతలు స్వీకరించాక తొలుత శనగల కొనుగోలుకు రూ.333 కోట్లు విడుదల చేశారు. రెండో విడతగా కేంద్ర నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్థిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొనుగోలులో నిజమైన రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–క్రాపింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోతే ఈ నెల 15 లోపు వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. వ్యాపారుల పట్ల రైతు సంఘాల ఆందోళన శనగల కొనుగోలు సమయంలో కొందరు రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోవడంతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–క్రాపింగ్‌పై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ కార్యదర్శిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు అపరాలను అమ్ముకోవచ్చని తెలిపింది. గతేడాది రైతులు అమ్ముకున్న అపరాలను వ్యాపారులు రైతుల పేరున నిల్వ చేసుకున్నారు. వారంతా కొనుగోలు కేంద్రాలకు ఆ పంటను తీసుకొచ్చి రైతుకు లభించాల్సిన మద్దతు ధరను తన్నుకుపోయే ప్రమాదముందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.7,050, మినుములకు రూ.5,700లను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే.. మార్కెట్లో పెసలకు రూ.5,500, మినుములకు రూ.4,700లకు మించి ధర లభించడం లేదు. దీంతో రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రెండో దశలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తెనాలి, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, మైలవరం, పరిటాల, కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పెసల కొనుగోలు కేంద్రాలను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా నందిగామ, పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం, కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో ఏర్పాటు చేస్తారు. పెసలు, మినుములు 20 వేల టన్నులు, కందులు 40 వేల టన్నులు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. -
బరువును సులువుగా తగ్గించే చనాచాట్
కాలంతో పాటు మనిషి కూడా పరిగెత్తడంతో జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో పాటు, కంటి నిండ నిద్రకు దూరం అవుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపైన పడుతోంది. ఒత్తిడి కారణంగా అతిగా తినడం వల్ల కూడా అధిక బరువుకు దారి తీస్తోంది. ఈ రోజుల్లో చాలా మందిని కలవరపరుస్తున్న వాటిలో అధిక బరువు. అయితే అదనపు బరువు అనేది మనం రోజు తీసుకునే ఆహారం మీదే ముడిపడి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిన నేటి సమాజం అధిక కొవ్వు పదార్థాలు ఉండే ఫాస్ట్ ఫుడ్‌లైన పిజ్జా, బర్గర్లకు బాగా అలవాటైపోయారు. ఆ తర్వాత సరైన వ్యాయమం లేకపోవడం, ఎక్కువ గంటలు కూర్చోనే పని చేయడం కూడా బరువుకు కారణం అవుతోంది. తీరా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిమ్‌ల్లో చెమటలు పట్టేలా వ్యాయామాలు చేసినా ఫలితం మాత్రం అనుకున్నంతగా కనిపించడం లేదని వాపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే మన దేశంలో ప్రాచీన కాలం నుంచే అందుబాటులో ఉన్న పప్పు ధాన్యాలు, చిక్కుళ్లలో ప్రొటీన్ పాళ్లు పుష్కలంగా ఉండి బరువు సమస్యను తగ్గించేందుకు దోహదపడుతాయన్నవిషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా చిక్కుళ్లలో చిక్పీస్(శనగలు), బఠానీ, సోయాబీన్స్ వంటివి బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని సంవృద్ధిగా తీసుకుని వంటిపై ఉన్న బరువును తేలిగ్గా వదిలించుకోవచ్చు. ప్రొటీన్ల రారాజు చిక్పీస్ చిక్కుళ్లలో ఒక రకమైన శనగల్లో(చిక్పీస్) ప్రొటీన్, ఫైబర్లు మెండుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని ఇటీవలే అమెరికాకు చెందిన ఓ ఆహార,న్యూట్రిషన్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉదాహరణకు ఉడకబెట్టిన 100గ్రాముల చిక్‌పీస్‌లో 9గ్రా ప్రొటీన్స్,8గ్రా ఫైబర్, 2.6గ్రా ఫ్యాట్, ఐరన్లు ఉంటాయని నివేదికలో తెలిపింది. రోజు ఆహారంలో చనాచాట్ను తీసుకుంటే వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్ కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించడంతో పాటు, బ్లడ్ లెవల్, షుగర్ పాళ్లను కంట్రోల్లో ఉంచేందుకు దోహదపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మార్కెట్‌కు వెళ్లి చిక్‌పీస్‌ను కొనుగోలు చేయండి, అధిక బరువును తగ్గించుకోండి. -
ఒకటికి పది పంటలు!
ప్రతాప్ వృత్తిరీత్యా న్యాయవాది. రసాయన ఎరువులతో పండించిన పంట తినడం వల్ల మానవాళి మనుగడకు ఏర్పడుతున్న ముప్పును గుర్తించారు. అందుకే సేంద్రియ సాగును తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ విషతుల్యమైన ఆహార పదార్థాల బారి నుంచి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. మంచిర్యాల జిల్లా కేంద్ర శివారులోని హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆయన క్షేత్రం ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలతోపాటు దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు, పప్పుదినుసులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతివ్యవసాయ సూత్రాలు, ‘సాక్షి సాగుబడి’ కథనాల స్ఫూర్తితో గత ఏడేళ్లుగా పంటల సాగు చేస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరన్నర విస్తీర్ణంలో మామిడి బత్తాయి (మొసంబి), సంత్ర, సపోట, ఆపిల్ బెర్, దానిమ్మ, అంజీర, సీతాఫలం, జామ, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటలు... ఎకరన్నరలో చిరుధాన్యాలు... ఎకరన్నరలో వరి... ఎకరన్నరలో పప్పుదినుసులు... రెండు ఎకరాల్లో కూరగాయల పందిళ్లు... రెండు ఎకరాల్లో వాణిజ్య పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో.. పది ఎకరాల నల్లరేగడి భూమిలో పూర్తి సొంత వనరులతో తయారు చేసుకునే సహజ ఎరువులు వాడుతూ ప్రతాప్ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదెను పెంచుతున్నారు. పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను ఇతర రైతులకు తెలియజెప్పేందుకు ప్రతి జూన్ నెలలో రైతులకు తన సేంద్రియ క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువులతో ఇటు మనుషులకు తినే తిండిలో, అటు పండించే పంట భూమికి నష్టాలు వాటిల్లుతాయని విడమరుస్తున్నారు. కూరగాయల సాగులో దిగుబడి రెట్టింపు భూమిని పైపైన దున్ని మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని మడులుగా విభిజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం కూరగాయ పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయాలు వాడుతున్నారు. పురుగును గుడ్డుదశలోనే నివారించేందుకు నీమాస్త్రం, వేప పిండి వాడుతున్నారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేస్తారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుండగా, రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తున్నారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రతాప్ చెబుతున్నారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పొల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగితే ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. పూర్తి సొంతంగా తయారు చేసుకున్న ఎరువులతో సాగుచేయడంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. సేంద్రియ పంటను మంచిర్యాలలో విక్రయిస్తున్నారు. కొంత మంది ఫోన్ ద్వారా సంప్రదించి సీజన్ల వారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం అధికం.. ప్రతాప్ సాగు చేస్తున్న ఎకరం మామిడి తోటలో 60 చెట్లున్నాయి. 15ఏళ్లపాటు రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 45 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదులీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ దున్నుతున్నారు. పూతదశలో బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందెదశలో, పురుగుదశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో కంటే ఎక్కువగానే దీని ద్వారా దిగుబడి వస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చువుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 5 వేల నుంచి 8 వేలకు మించి ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండురెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చని ప్రతాప్ తెలిపారు. పాడికి దిగుల్లేదు.. ఎరువులూ కొనక్కర్లేదు! మా వ్యవసాయానికి రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదె పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. వీటికి పొలం నుంచే గడ్డి అందుతుంది. పాడికి దిగుల్లేదు. వీటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. రసాయన ఎరువుల పంటలతో భూ సారం దెబ్బతినడమే కాకుండా, ఆ పంటలు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రకృతి సేద్యం చేస్తున్నా. నా క్షేత్రంలో జూన్‌లో రైతులకు శిక్షణ ఇస్తున్నా. జీవన ఎరువులు, పురుగుమందుల తయారీ లాబ్ పెట్టి రైతులకు స్వల్ప ధరకే ఇవ్వాలనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రసాయనాల్లేని పంటలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. – కే వీ ప్రతాప్ (98499 89117), గుడిపేట, హాజీపూర్ మం., మంచిర్యాల జిల్లా నువ్వు చేను, పందిరి బీర తోట, వ్యవసాయ క్షేత్రంలో..ఆవుతో ప్రతాప్ –ఆది వెంకట రమణారావు, సాక్షి, మంచిర్యాల ఫొటో జర్నలిస్టు: Vð ల్లు నర్సయ్య -
ఇదిగో ‘సిరి’ లోకం!
ఆరోగ్యం కోసం ఆహారం.. ఆహారం కోసం వ్యవసాయం.. వ్యవసాయం కోసం అడవి! ఇదీ అటవీ వ్యవసాయానికి మూలసూత్రం. రైతు తమకున్న వ్యవసాయ భూమిలో విధిగా (కనీసం 20%) కొద్ది భాగాన్నయినా అటవీ జాతి చెట్ల పెంపకానికి కేటాయించాలని అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి సూచిస్తున్నారు. పొలం అంతా ఒకే పంట వేయడం అనర్థదాయకం.. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలను ఒకే పొలంలో పక్కపక్కనే కలిపి సాగు చేయాలి.. జీవవైవిధ్యంతోనే సాగుకు జవజీవాలు చేకూరతాయని, చీడపీడల బెడద కూడా తగ్గిపోతుందన్నది సారాంశం. అటవీ కృషిపై డా. ఖాదర్ వలితో ఇటీవలి సంభాషణ నుంచి కొన్ని విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. ప్రకృతిలో ఏ జీవీ, ఏ వ్యవస్థా ఒంటరిగా మన జాలదు, పరస్పరాధారితంగానే విరాజిల్లుతుంటాయి. ప్రకృతితో, అడవితో వ్యవసాయానికి అంతటి విడదాయరాని అనుబంధం ఉందని అంటారు స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి. ఇందుకోసం ‘అటవీ వ్యవసాయ’ (కాడు కృషి) పద్ధతికి ఆయన రూపకల్పన చేశారు. మైసూరుకు సమీపంలోని కిబిని డ్యాం దగ్గరలోని తన పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో తాను అనుసరిస్తూ రైతులకూ శిక్షణ ఇస్తున్నారు (అటవీ వ్యవసాయంపై డా. ఖాదర్ వలి అభిప్రాయాలతో కూడిన కథనం ‘సిరిధాన్యాలే నిజమైన ఆహార పంటలు’ శీర్షికన 2017 సెప్టెంబర్ 19న, ‘మిక్సీ–సిరిధాన్యాల మిల్లు’ కథనం 2017 డిసెంబర్ 26న ‘సాగుబడి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే). మూడున్నర ఎకరాల్లో అడవిని పెంచుతూ, పక్కనే మిగతా భూమిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను పండిస్తున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రం విశేషాలను పరిశీలిద్దాం. వర్షపు నీటి సంరక్షణకు కందకాలు వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడానికి పొలంలో కందకాలు తవ్వుకోవడం ద్వారా వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఇంకింపజేసుకోవడం తెలివైన పని. డా. ఖాదర్ వలి క్షేత్రం కొండ ప్రాంతం కావడంతో (30%) ఏటవాలుగా ఉంటుంది. వాన నీటిని ఒడిసిపట్టుకోవడంతోపాటు భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవడం కోసం ప్రతి వంద మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వారు. కందకాలలో 10 మీటర్లకు ఒక చోట కట్ట వేశారు. కందకంలో పండ్ల చెట్లు నాటారు. గట్ల మీద 400 మునగ చెట్లు వేశారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలోకి పరిసర పొలాల నుంచి రసాయనిక అవశేషాలతో కూడిన వర్షపు నీరు రాకుండా చూసుకోవడం అవసరం. బయటి నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చే వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి సరిహద్దు చుట్టూ అడుగు లోతు, అడుగు వెడల్పున కందకం తవ్వారు. సరిహద్దులో అక్కడక్కడా పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. రసాయనిక అవశేషాలకు విరుగుడుగా ఆ గుంతల్లో ‘అటవీ చైతన్య ద్రావణం’ పోసి, వాన నీటిని భూమిలోకి ఇంకింపజేస్తారు. అక్కడి సాధారణ వార్షిక వర్షపాతం 800 ఎం.ఎం.–1000 ఎం.ఎం. మధ్య ఉంటుంది. తొలి పంట వర్షాధారంగానే సాగు చేస్తారు. భూమిలోకి ఇంకింపజేసిన నీటిలో మూడింట రెండొంతుల వరకు.. స్ప్రింక్లర్లతో రెండో పంటకు వాడుతున్నారు. సిరిధాన్యాల సాగు ఎలా? కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలను డా. ఖాదర్ వలి సిరిధాన్యాలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వీటిని ముఖ్య ఆహారంగా తింటూ ఉంటే కొద్దికాలంలో జబ్బులను తగ్గించుకోవడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాల వినియోగం బాగా పెరిగినందున రైతులు సైతం వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ సిరిధాన్యాల సాగుపై డా. ఖాదర్ వలి సూచనలేమిటో చూద్దాం. మిశ్రమ సాగే మేలు ప్రతి రైతు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో అడవిని పెంచాలి. మిగతా 80% భూమిలో పంటలు పండించుకోవాలి. సిరిధాన్యాలను ఏక పంట (మోనో క్రాప్)గా కాకుండా పప్పుధాన్యాలు (అపరాలు), నూనెగింజలతో కలిపి పండించడం ఉత్తమం. సాగుకు ఎంపిక చేసుకున్న పొలంలో 60% విస్తీర్ణంలో కొర్రలు లేదా సామలు లేదా అరికెలు లేదా అండుకొర్రలు లేదా ఊదలు, 30% విస్తీర్ణంలో కంది/ పెసర/ వేరుశనగ/ శనగ/ మినుము వంటి పప్పుధాన్యాలు, 10% విస్తీర్ణంలో నువ్వులు లేదా కుసుమలు లేదా వేరుశనగ వంటి నూనె నూనెగింజలు పక్కపక్కనే సాగు చేయాలి. పప్పుధాన్యం పంట పక్కన ఉన్న పంటలకు వాతావరణం నుంచి గ్రహించిన నత్రజనిని అందిస్తుంది. ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు విస్తీర్ణాన్ని ఒక గ్రిడ్‌గా భావించి మిశ్రమ పంటలను ఈ నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. ప్రతి గ్రిడ్‌లో ఈ మూడు రకాల పంటలను పక్కపక్కనే ఉండాలన్న మాట. ఎంత విస్తారమైన పొలంలోనైనా అలాగే గ్రిడ్లుగా విభజించుకొని సాగు చేయాలి. అప్పుడు ప్రతి గ్రిడ్‌లోనూ అన్ని రకాల పంటలూ సాగవుతూ ఉంటాయి. గ్రిడ్‌లో గత పంట కాలంలో వేసిన చోట వచ్చే పంట కాలంలో ఇతర పంటలు వేసేలా పంటల మార్పిడి పాటించాలి. ఉదా.. 20 ఎకరాల పొలం ఉంటే 4 ఎకరాల్లో అడవిని పెంచాలి. 16 ఎకరాల్లో రెండు ఎకరాలకో గ్రిడ్‌గా విభజించి పంటలు పండించాలి. కొన్ని గ్రిడ్లలో సిరిధాన్యాలు ప్రధాన పంటైతే, మరికొన్ని గ్రిడ్లలో కూరగాయలు కూడా ప్రధాన పంటలుగా వేసుకోవచ్చు. టర్పిన్లతో చీడపీడలకు విరుగుడు సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను కలిపి సాగు చేయడం ద్వారా చీడపీడల నుంచి తమను తాము రక్షించుకునే శక్తి పంటలకు కలుగుతుంది. ఏ మొక్కలైనా ఆకుల ద్వారా వైవిధ్య భరితమైన వాసనలను గాలిలోకి వదులుతూ ఉంటాయి. ఈ వాసనలను టర్పిన్స్ అంటారు. కొన్ని రకాల మొక్కలు విడుదల చేసే వాసనలు మనుషుల ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. కొన్నిటిని గ్రహించలేవు. మనుషులు గ్రహించలేని వాసనలను కూడా పిల్లులు, కుక్కలు, పందులు, పక్షులు గ్రహించగలుగుతాయి. ఈ వాసనలు పంటలపై చీడపీడలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అండుకొర్ర మొక్కల వాసనలను గ్రహించడం ద్వారా వేరుశనగ మొక్కలు అంతర్గతంగా చీడపీడలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. అందువల్లనే, కనీసం 3 నుంచి 5 రకాల పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఒకే పంటను వేయడం సమస్యలను ఆహ్వానించడమేనని, పాశ్చాత్య ఆలోచనా ధోరణితో వస్తున్న సమస్య ఇదేనని డా. ఖాదర్ అన్నారు. అండుకొర్రలు వర్సెస్ అడవి పందులు అండుకొర్ర పంట మొక్కలు విడుదల చేసే వాసనలు (టర్పిన్లు) అడవి పందులకు సుతరాము గిట్టదు. పొలానికి చుట్టూతా 4 వరుసలుగా అండుకొర్రలను సాగు చేస్తే ఆ పొలం వైపు అడవి పందులు రాకుండా దూరంగా ఉంటాయి. ∙డా. ఖాదర్ పొలంలో మిశ్రమ పంటల సాగు వరి, సిరిధాన్యాల సాగుకు కావాల్సిన నీరెంత? సిరిధాన్యాలుగా మనం పిలుచుకుంటున్న కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలను నాలుగు వర్షాలు పడితే చాలు.. అంతగా సారం లేని మెట్ట భూముల్లో కూడా పండించుకోవచ్చు. వరి ధాన్యం, చెరకు వంటి పంటలు పండించడానికి సాగు నీరు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. కిలో వరి బియ్యం పండించానికి 9,000 లీటర్ల నీరు, కిలో సిరిధాన్యాల (కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదల)ను సాగు చేయడానికి 300 లీటర్ల నీరు చాలు. అంటే, కిలో వరి బియ్యంతో ఐదుగురికి ఒకసారి భోజనం పెట్టవచ్చు. 30 కిలోల సిరిధాన్యాలతో 240 మందికి ఒకసారి భోజనం పెట్టవచ్చు (పట్టిక చూడండి). నీటి వనరులు నానాటికీ క్షీణిస్తున్న ఈ తరుణంలో ప్రధాన ఆహార పంటలుగా సిరిధాన్యాలను సాగు చేసుకోవడమే అన్ని విధాలా ఉత్తమ మార్గమని మనందరం గ్రహించాలని డా. ఖాదర్ చెబుతున్నారు. అటవీ చైతన్య ద్రావణంతో జవజీవాలు నిస్సారమైన భూములను సైతం మూడు నెలల్లో సారవంతం చేయడానికి భూసార వర్థిని అయిన ‘అటవీ చైతన్య’ ద్రావణం ఉపయోగపడుతుందని డా. ఖాదర్ అంటున్నారు. ఇది ఎరువు కాదు. భూమిలో సూక్ష్మజీవ రాశిని ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే తోడు (మైక్రోబియల్ కల్చర్) మాత్రమే. అటవీ చైతన్య ద్రావణం తయారు చేసే పద్ధతి: 20 లీటర్ల కుండలో 10 లీటర్ల నీరు పోసి, లీటరు అటవీ చైతన్యం కలిపి, పావు కిలో సిరిధాన్యాల పిండి, పావు కిలో పప్పుల పిండి, 50 గ్రాముల తాటి బెల్లం కలపాలి. దీన్ని రోజూ కలియదిప్పాలి. వారం రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. 21 రోజుల వరకు వాడుకోవచ్చు. ఏమిటి ప్రయోజనం? ఆమ్ల, క్షార గుణాలు సమసిపోయి భూమి సాధారణ స్థితికి చేరుకొని జవజీవాలను సంతరించుకోవడానికి అటవీ చైతన్య ద్రావణం దోహదం చేస్తుంది. లీటరు అటవీ చైతన్య ద్రావణానికి 20 లీటర్ల నీరు కలిపి నేలపై పిచికారీ చేయాలి. సాయంత్రం 5–6 గంటల మధ్య భూమిపై అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేస్తే మూడు–ఆరు నెలల్లో ఆ భూమి సాగుకు యోగ్యంగా జీవవంతం అవుతుందని డా. ఖాదర్ చెబుతారు. మొదటి నెలలో.. వారానికి 2 సార్లు, రెండో నెలలో.. వారానికోసారి, మూడో నెలలో.. 10 రోజులకోసారి, నాలుగో నెల నుంచి 15 రోజులకోసారి అటవీ చైతన్య ద్రావణం పిచికారీ చేస్తూ ఉంటే భూసారం పెరుగుతుంది. సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తాం కాబట్టి ఉదయం కల్లా నేల పీల్చుకొని నేల జవజీవాలను పొందుతుంది. ఆచ్ఛాదన వేయాల్సిన అవసరం లేదు. ఎండలు మండిపోయే మే నెలలో తప్ప ఏడాది పొడవునా దీన్ని పిచికారీ చేసుకోవచ్చని డా. ఖాదర్ తెలిపారు. అటవీ ప్రసాదం అటవి వ్యవసాయానికి మూలాధారమని డా. ఖాదర్ వలి చెబుతున్నారు. అందుకే పొలంలో 20% శాతంలో అటవీ జాతి చెట్లను పెంచాలని, ఆ చెట్లు రాల్చే ఆకులను పోగు చేసి, వేసవిలో పొలంలో చల్లి, ఆ ఆకులపై ‘అటవీ చైతన్య’ ద్రావణం పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. భూమి లోతుల నుంచి పోషకాలను గ్రహించే చెట్లు రాల్చిన ఆకులే ‘అటవీ ప్రసాదం’ వంటివని, భూమికి పోషకాహారమని అంటారు. అటవీ సహితం చీడపీడల బెడద నుంచి పంటల రక్షణకు ‘అటవీ సహితం’ ద్రావణాన్ని డా. ఖాదర్ వలి వాడుతున్నారు. వివిధ రకాల ఔ«షధ మొక్కల ఆకులతో దీన్ని తయారు చేస్తారు. పాలు కారే మొక్కల ఆకులు 2 రకాలు (జిల్లేడు, మర్రి, పలవర బొప్పాయి వంటివి), 2 చేదు రకాలు (వేప, కానుగ వంటివి), ఆకర్షణీయంగా ఉండే చెట్ల పూలు, ఆకులు (మందార, తంగేడు వంటివి) ఇవన్నీ 6 కేజీలు తీసుకొని.. దంచాలి. దీన్ని కుండలో వేసి లీటరు దేశీ ఆవు మూత్రం, 10 లీటర్ల నీరు కలిపి.. వారం మురగబెట్టాలి. తర్వాత వడకట్టుకొని లీటరుకు 20 లీటర్ల నీరు కలిపి పంటలపై పిచికారీ చేయాలి. అటవీ చైతన్య ద్రావణం ఔషధ మొక్కలు ఒకే పంట సాగు చేయడం మూర్ఖత్వం! పొలం అంతా ఒకే రకం పంటను పండించడం మూర్ఖత్వం. మోనోకల్చర్ నుంచి బయటకు రావాలి. మిశ్రమ పంటలు సాగు చేయాలి. అటవీ కృషి పద్ధతుల్లో 30 రకాల పంటలు పండించమని సూచిస్తున్నాం. కనీసం 5 రకాలైనా పొలంలో పెంచుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలి. సిరిధాన్య పంటలకు కూడా కొన్ని చోట్ల కత్తెర పురుగు సోకడానికి కారణం ఒకే పంటను సాగు చేయడమే. పొలంలోని విస్తీర్ణంలో 60% ఏక దళ పంటలు, 30% పప్పుధాన్యాలు, 10% నూనె గింజల పంటలు సాగు చేయాలి. సిరిధాన్య పంటలు, నువ్వులు, గోంగూర, వేరుశనగ వంటి పంటలను కలిపి పండించాలి. కత్తెర పురుగు నివారణకు సీతాఫలం ఆకులు, గింజల ద్రావణం చక్కగా పనిచేస్తుంది. ఒకే పంట పండిస్తూ ఉంటే ఒక పురుగు పోయినా మరొకటి వస్తుంది. మిశ్రమ పంటలే శ్రేయస్కరం. – డాక్టర్ ఖాదర్ వలి, అటవీ కృషి నిపుణులు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పంటలు మారితే బతుకు బంగారం
రైతమ్మలు, రైతన్నలు, వ్యవసాయ కార్మికులు.. అష్టకష్టాలు పడి ఆరుగాలం చెమట చిందిస్తే.. ఆ తడితో మొలిచి పండిన గింజలే మనందరి ఆకలి తీరుస్తున్నాయి.అందుకు అన్నదాతకు ప్రతి ముద్దకూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దొరికీ దొరకని సాయంతో.. నిండీ నిండని డొక్కలతో.. చిన్నా చితకా కమతాల్లో నేలతల్లినే నమ్ముకొని మొక్కవోని మనోబలంతో ముందడుగేసే మట్టి మనుషులందరికీ నిండు మనసుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతోంది ‘సాగుబడి’. ప్రకృతి మాత కనుసన్నల్లో సాగే వ్యవసాయంలో కష్టనష్టాలు.. ఒడిదొడుకులెన్నో. జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయిన 2018 మనకు అందించిన మార్గదర్శనం చేసే ఊసులను స్మరించుకుంటూ.. ప్రకృతికి ప్రణమిల్లుతూ.. సరికొత్త ఆశలతో ముందడుగు వేద్దాం! భారతీయుల్లో 30 శాతం మందికి రక్తహీనత ఉంది. భూతాపోన్నతి వల్ల చాలా ప్రాంతాల్లో సాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. వర్షపాతం తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ రైతులు వరి, గోధుమ పంటలను వదిలి... మొక్కజొన్న, చిరుధాన్య పంటలు సాగు చేయడం ప్రారంభిస్తే సాగు నీటి బాధలు 33% తీరిపోతాయని ఒక ముఖ్య అధ్యయనం(2018) తేల్చింది. అంతేకాదు, పౌష్టికాహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవచ్చని అమెరికాకు చెందిన ఎర్త్ ఇన్స్టిట్యూట్, కొలంబియా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా చేసిన అధ్యయనం తేల్చింది. 1996–2009 మధ్యకాలంలో ధాన్యం ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఎంత నీరు ఖర్చయిందో లెక్కగట్టారు. వరి సాగుకు అత్యధికంగా సాగు నీరు ఖర్చవుతోంది. వరికి బదులు మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాలు సాగు చేస్తే సాగు నీరు ఆదా కావడమే కాకుండా.. ఐరన్ (27%), జింక్ (13%) వంటి పోషకాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ‘సైన్స్ అడ్వాన్సెస్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం విశ్లేషించింది. అన్ని జిల్లాలకూ ఒకే పరిష్కారం కుదరదు. ప్రతి జిల్లా స్థితిగతులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించాలి అని కొలంబియా యూనివర్సిటీ ఎర్త్ ఇన్స్టిట్యూట్కి చెందిన కైలె డావిస్ అంటున్నారు. అధిక నీటిని వాడుకుంటూ అధిక ఉద్గారాలను వెలువరిస్తున్న వరికి బదులు.. అంతకన్నా పోషక విలువలున్న, కొద్దిపాటి నీటితో పండే మిల్లెట్స్‌ను పండించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలందరికీ అందించవచ్చు. వీటిని సేంద్రియంగానే పండించవచ్చు అని ఆయన అంటున్నారు. 2018ని భారత్ జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.