సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో 36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదికను అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.99 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి.
పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.86 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 49.15 శాతం పత్తి సాగైందని నివేదిక వెల్లడించింది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.39 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.80 శాతంలో వరి సాగైందని తెలిపింది.
ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో (21.25%) సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.23 లక్షల ఎకరాల్లో (54.18%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 87,179 ఎకరాల్లో సాగైందని వెల్లడించింది.
ఆదిలాబాద్‌లో అత్యధికంగా 92 శాతం సాగు...
రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాల్లో 92.05 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.86 శాతం విస్తీర్ణంలో, నారాయణపేట్‌లో 55.85 శాతం విస్తీర్ణంలో సాగ య్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 2.41 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5,474 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగ య్యాయి.
కాగా, రాష్ట్రంలో 3 జిల్లాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాభావం నెలకొందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమో దైందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో మాత్రం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది.
కాగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు కలిపి చూస్తే సరాసరి 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, ఈ నెల లో ఐదు రోజుల్లో 29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో ఏకంగా 74 శాతం చొప్పు న లోటు వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
మూసీ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోనిమూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి పెద్దగా ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్ట్‌లో నీటిమట్టాన్ని తగ్గించాలని మూసీ అధికారులు నిర్ణయించారు.
దీంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 641.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.67 టీఎంసీల నీరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment