మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు వానాకాలం సాగు పనుల్లో బిజీగా కనిపిస్తారు. కానీ.. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తొలకరి కోసం నేటికీ రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఆలస్యమవుతుండగా అదునుదాటుతుందని ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించకపోతాడా.. అని పలువురు రైతులు ఎప్పటిలాగే మృగశిరకార్తె (మిరుగుకార్తె) నుంచి పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేస్తున్నారు. ఇంకా వానలు కురియ క పోవడంతో వేసిన విత్తనాలు దుక్కుల్లోనే మాడి పోతుండగా, మరోసారి విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దిగులు చెందుతున్నారు.
ఈ సమయానికే జిల్లాను రుతుపవనాలు తాకాల్సి ఉంది. కానీ ఇంకా ఎండలు తగ్గక రైతన్నను వానాకాలం కలవరం పెడుతోంది. వానాకాలం ఆరంభమై పక్షం రోజులు గడిచినా వర్షాలు పడలేదు. దీంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. కాగా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి భూమిలో తేమ శాతం పెరిగితేనే విత్తనాలు వేయాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అడుగంటుతున్న జలాశయాలు
జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం ఈదురుగాలులు, మబ్బులు పడుతున్నా వర్షాలు మాత్రం కురవడం లేదు. మృగశిర కార్తె బుధవారంతో ముగుస్తుండగా గురువారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం కానుంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. ఇందుకు భిన్నంగా ఇంకా ఎండలు మండుతుండగా జలాశయాలు అడుగంటిపోతున్నాయి.
94శాతం లోటు వర్షపాతం
ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. కానీ.. ఇప్పటివరకు 7వేల ఎకరాల వరకు పత్తి విత్తుకున్నట్లు తెలుస్తోంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 50వేల ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవాల్సి ంది. గతేడాది ఇదే సమయానికి 45 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతుండగా ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటున 119 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, ఈ ఏడాది 07 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ నెల 20వరకు సాధారణ వర్షపాతం 101.7 మిల్లిమీ టర్లు కురవాల్సి ఉండగా 6.2 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. 94 శాతం లోటు వర్షపాతం నెలకొంది. మృగశిర కార్తె ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత చినుకు పడక విత్తనం మొలకెత్తక ఆదిలోనే నష్టాలు చవి చూశారు.
తేమ లేకుంటే ప్రమాదమే..
నేలలో తేమ లేనిదే విత్తనం వేసుకోవద్దని వ్యవసాయశాఖ ఓ వైపు హెచ్చరిస్తున్నా రైతులు విత్తనాలు వేస్తూనే ఉన్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిసి 60–70శాతం తేమ నేలలో ఉంటేనే విత్తుకోవాలంటున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు విత్తుకునేందుకు వచ్చే నెల వరకు సమయం ఉందని చెబుతున్నారు. దుక్కి వేడి తగ్గకుండానే విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. విత్తిన ఐదురోజుల వరకు వాన పడకుంటే విత్తనం చెడిపోతుందని చెబుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా మొలక దశలోనే మాడిపోతాయని పేర్కొన్నారు. ఇలా.. మొలక ఎండిపోయిన స్థానంలో రెండుమూడుసార్లు విత్తుకుంటే అదనపు ఖర్చుతో పాటు మొక్కల ఎదుగుదలలో వ్యత్యాసమేర్పడి కలుపు తీయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వానలు పడుతయనుకున్న
నిరుడు మిరుగుకార్తెలోనే ప త్తి విత్తనం వేసిన. ఈసారి నాలుగురోజులు ఆలస్యంగా ఎనిమిదెకరాల్లో విత్తనాలేసి న. వారంరోజులైనా వర్షాలు పడుతలేవు. విత్తనాలు మొలకెత్తలేదు. ఎండలకు దుక్కిలోనే మాడిపోతున్నయ్. ఈ రెండుమూడ్రోజు ల్లో వాన పడకుంటే నేను పెట్టిన పెట్టుబడి రూ.35 వేల దాకా నష్టపోవుడే.
– ముదరకోల సదయ్య, రైతు, నెన్నెల
తొందరపడి విత్తనాలు వేయొద్దు
తుఫాన్ కారణంగా రుతుపవనాల రాక కొంత ఆలస్యమైంది. ఈనెల 25నుంచి ఉ మ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రైతులు ఒకట్రెండు భారీ వర్షాలు కురిసి 60–70 శాతం తేమ ఉన్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి. పత్తి విత్తేందుకు సమయం ఉంది. తొందరపడి విత్తుకుంటే మొలక రాదు.
– శ్రీధర్‌చౌహాన్, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment