విత్తనాలు వేసేందుకు సిద్ధం
రోహిణి కార్తె ఆరంభంతో చేను చదును చేసి దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న. మృగశిర కార్తె నుంచి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు పత్తి విత్తనం వేద్దామని ఎదురుచూస్తున్న. మృగశిర కార్తె వెళ్లి వారం గడుస్తున్నా చినుకు రాలడం లేదు. పొద్దంతా విపరీతమైన ఎండ కొడుతోంది. సాయంత్రం ఈదురుగాలులు పెడుతున్నయి తప్ప చినుకు పడం లేదు. పోయినేడాది భారీ వర్షాలకు వరదల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వానాకాలం ఆలస్యమయ్యేటట్లు ఉంది.
ఎల్‌నినో ప్రభావం ఏమాత్రం..?
నైరుతి రుతుపవానాల రాక ఆలస్యమైన రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా లేక.. ఆశించిన వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత జూన్ సాధారణ వర్షపాతం కురువగా జూలైలో భారీ వర్షాలతో రెట్టింపు వర్షపాతం నమోదైంది. వాగులు, ఒర్రెలు వరదలతో ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటి మునిగి నష్టపోయారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: తొలకరి వర్షాలు పలుకరించకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. జూన్ నెల ప్రారంభమై 15రోజులు.. మృగశిర కార్తె ఆరంభమై వారం గడుస్తోంది. ఇప్పటికే చేన్లు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు వేసేందుకు రైతాంగం సిద్ధమైంది. సకాలంలో తొలకరి వర్షాలు కురిస్తే ఇప్పటికే విత్తనాలు వేయాల్సింది. సాగు ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో కొందరు పొడిలోనే విత్తనాలు వేస్తున్నారు. గత ఏడాది ఈ సమయానికే వర్షాలు కురిసి విత్తనాలు వేసుకోగా.. ఈ ఏడాది వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది.
ఈ సమయానికే రుతు పవనాలు జిల్లాను తాకి జోరు వర్షాలు కురువాల్సి ఉండగా.. మేఘాలు సాయంత్రం అక్కడక్కడ కమ్ముకున్నట్టే కమ్ముకుని అట్టే కనుమరుగై చినుకు రాలడం లేదు. గత వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్య, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మండిపోతుండగా.. వర్షం ఎప్పుడు పడుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
సారవంతం చేసుకుని
మృగశిర కార్తె ఆగమనంతో అన్నదాతలు వ్యవసా య పనులు వేగవంతం చేశారు. సమయానికి బ్యాంకు రుణాలు అందకపోయినా అప్పు చేసి విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం చేసుకున్నారు. తొలకరి వర్షాలు పడితే ఈ సమయానికి 25శాతం మంది రైతులు పంటలు విత్తకోవాల్సి ఉండేది. గత ఏడాది జూన్ రెండో వారం నుంచే నైరుతి రుతు పవనాలు విస్తరించి వర్షాలు కురవడంతో పత్తి, కంది పంటలు విత్తుకున్నారు.
కానీ ఈ ఏడాది వర్షాలేక రైతుల్లో చింత కనిపిస్తోంది. అదును దాటుతోందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆందోళన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, రుతుపవనాల రాక ఆలస్యమైనా గాబరా పడాల్సిన అవరసం లేదని చెబుతున్నారు. ఈ వానాకాలం సాగు రైతులకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
3.60లక్షల ఎకరాల్లో..
జిల్లాలో ఈ ఏడాది 3.60 లక్షల ఎకరాల వరకు పంటలు సాగవుతాయని, అధికారులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు. జిల్లాలో పత్తి, వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది 1.80 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం సేంద్రియ కర్బనంగా వాడే పచ్చిరొట్టె విత్తనాలు మాత్రమే అందిస్తోంది. ఇప్పటికే మండలాల్లో వ్యవసాయ అధికారులు 5500 క్వింటాళ్ల జీలుగ, జనుము రాయితీ విత్తనాలు అందజేస్తున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న తదితర విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు.
3.60 లక్షల పత్తి విత్తనాలు ప్యాకెట్లు రైతులకు అవసరమని ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ తదితర ఎరువులు ఉన్నాయి. జిల్లాలో పంటల సాగు కోసం ఇప్పటికే 24 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment