Cotton seed
-
వానాకాలం సాగుపై రైతుల కలవరం
విత్తనాలు వేసేందుకు సిద్ధం రోహిణి కార్తె ఆరంభంతో చేను చదును చేసి దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న. మృగశిర కార్తె నుంచి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు పత్తి విత్తనం వేద్దామని ఎదురుచూస్తున్న. మృగశిర కార్తె వెళ్లి వారం గడుస్తున్నా చినుకు రాలడం లేదు. పొద్దంతా విపరీతమైన ఎండ కొడుతోంది. సాయంత్రం ఈదురుగాలులు పెడుతున్నయి తప్ప చినుకు పడం లేదు. పోయినేడాది భారీ వర్షాలకు వరదల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వానాకాలం ఆలస్యమయ్యేటట్లు ఉంది. ఎల్‌నినో ప్రభావం ఏమాత్రం..? నైరుతి రుతుపవానాల రాక ఆలస్యమైన రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా లేక.. ఆశించిన వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత జూన్ సాధారణ వర్షపాతం కురువగా జూలైలో భారీ వర్షాలతో రెట్టింపు వర్షపాతం నమోదైంది. వాగులు, ఒర్రెలు వరదలతో ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటి మునిగి నష్టపోయారు. మంచిర్యాలఅగ్రికల్చర్: తొలకరి వర్షాలు పలుకరించకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. జూన్ నెల ప్రారంభమై 15రోజులు.. మృగశిర కార్తె ఆరంభమై వారం గడుస్తోంది. ఇప్పటికే చేన్లు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు వేసేందుకు రైతాంగం సిద్ధమైంది. సకాలంలో తొలకరి వర్షాలు కురిస్తే ఇప్పటికే విత్తనాలు వేయాల్సింది. సాగు ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో కొందరు పొడిలోనే విత్తనాలు వేస్తున్నారు. గత ఏడాది ఈ సమయానికే వర్షాలు కురిసి విత్తనాలు వేసుకోగా.. ఈ ఏడాది వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. ఈ సమయానికే రుతు పవనాలు జిల్లాను తాకి జోరు వర్షాలు కురువాల్సి ఉండగా.. మేఘాలు సాయంత్రం అక్కడక్కడ కమ్ముకున్నట్టే కమ్ముకుని అట్టే కనుమరుగై చినుకు రాలడం లేదు. గత వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్య, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మండిపోతుండగా.. వర్షం ఎప్పుడు పడుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. సారవంతం చేసుకుని మృగశిర కార్తె ఆగమనంతో అన్నదాతలు వ్యవసా య పనులు వేగవంతం చేశారు. సమయానికి బ్యాంకు రుణాలు అందకపోయినా అప్పు చేసి విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం చేసుకున్నారు. తొలకరి వర్షాలు పడితే ఈ సమయానికి 25శాతం మంది రైతులు పంటలు విత్తకోవాల్సి ఉండేది. గత ఏడాది జూన్ రెండో వారం నుంచే నైరుతి రుతు పవనాలు విస్తరించి వర్షాలు కురవడంతో పత్తి, కంది పంటలు విత్తుకున్నారు. కానీ ఈ ఏడాది వర్షాలేక రైతుల్లో చింత కనిపిస్తోంది. అదును దాటుతోందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆందోళన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, రుతుపవనాల రాక ఆలస్యమైనా గాబరా పడాల్సిన అవరసం లేదని చెబుతున్నారు. ఈ వానాకాలం సాగు రైతులకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3.60లక్షల ఎకరాల్లో.. జిల్లాలో ఈ ఏడాది 3.60 లక్షల ఎకరాల వరకు పంటలు సాగవుతాయని, అధికారులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు. జిల్లాలో పత్తి, వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది 1.80 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం సేంద్రియ కర్బనంగా వాడే పచ్చిరొట్టె విత్తనాలు మాత్రమే అందిస్తోంది. ఇప్పటికే మండలాల్లో వ్యవసాయ అధికారులు 5500 క్వింటాళ్ల జీలుగ, జనుము రాయితీ విత్తనాలు అందజేస్తున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న తదితర విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. 3.60 లక్షల పత్తి విత్తనాలు ప్యాకెట్లు రైతులకు అవసరమని ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ తదితర ఎరువులు ఉన్నాయి. జిల్లాలో పంటల సాగు కోసం ఇప్పటికే 24 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. -
పత్తి విత్తనంపై అధికారుల పెత్తనం
సాక్షి, హైదరాబాద్: బీజీ–2 పత్తి విత్తనం విఫలమైంది. గులాబీ రంగు పురుగు సోకి పత్తి పంట నాశనమవుతోంది. దీంతో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం బీజీ–2 పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కోసం విత్తన ప్రణాళికను ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే జిల్లాల నుంచి ఇండెంట్లు తెప్పించుకుంది. ఆ ప్రకారం విత్తనాలను సరఫరా చేయాలని యోచిస్తోంది. వ్యవసాయశాఖ తాజా ప్రణాళిక ప్రకారం వచ్చే ఖరీఫ్‌కు ఏకంగా 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. విస్మయం కలిగించే విషయమేంటంటే, గతేడాది కేవలం కోటి ప్యాకెట్లు మాత్రమే సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి అదనంగా 29 లక్షల ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి విత్తన కంపెనీలకు బాసటగా నిలిచేలా అధికారుల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 90 పత్తి విత్తన కంపెనీలకు ఆర్డర్లు.. తెలంగాణలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 2018–19 ఖరీఫ్‌లో ఏకంగా 44.30 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే గులాబీ రంగు పురుగు కారణంగా ఉత్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయిందని నిర్ధారించారు. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావాలి. కానీ అనేకచోట్ల ఈసారి 6–7 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండగా, పత్తిని ప్రత్యేకంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం అంతుబట్టడంలేదు. ఈసారి 90 పత్తి విత్తన కంపెనీలకు విత్తన ప్యాకెట్లను సరఫరా చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. ఇదిలావుం టే అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కూడా కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. బీజీ–2, బీజీ–3 విత్తనాలు చూడడానికి ఒకేరకంగా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తు పట్టడం కష్టమైన వ్యవహారం. దీన్ని ఆసరాగా చేసుకొని కంపెనీలు బీజీ–3 విత్తనాలను కూడా మార్కెట్లోకి దించుతున్నాయి. వాటిపై దాడులు చేస్తున్నామని చెబుతు న్నా పరోక్షంగా ఆయా కంపెనీలకు కొందరు అధికారులు మద్దతుగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇతర విత్తనాలు 8 లక్షలు.. ఇదిలావుంటే వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రకటించింది. ఖరీఫ్‌కు ఏఏ విత్తనాలు అవసరమో జిల్లాల నుంచి ఇండెంట్ తెప్పించుకుంది. ఆ ప్రకారం ఖరీఫ్‌కు 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేస్తారు. మూడు లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు. అలాగే 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు, 20 వేల క్వింటాళ్ల కంది, లక్ష క్వింటాళ్ల జీలుగ, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను కూడా సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను కూడా ఖరీఫ్ కోసం అందజేస్తారు. -
వెయ్యి శాంపిళ్లలో 200 బీజీ–3 విత్తనాలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజీ–3 దందా జోరుపై కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అధికంగా ఈ రకం విత్తనం వెలుగుచూసినట్లు అంచనా వేసినట్లు తెలిసింది. బీజీ–3 పత్తి విత్తన సాగు రాష్ట్రంలో ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు నాలుగు నెలల క్రితం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం.. అనంతరం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. బీజీ–3 విత్తనంపై రెండ్రోజుల కిందట ఢిల్లీలో సమావేశమైన క్షేత్రస్థాయి తనిఖీ, మూల్యాంకన పరిశోధన కమిటీ(ఎఫ్ఐసీఐసీ)లో ఈ అంశం చర్చకు వచ్చింది. దేశవ్యాప్తంగా 15 శాతం బీజీ–3 విత్తనాలుంటే.. రాష్ట్రంలో 20% వరకు ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిసింది. వెయ్యి పత్తి విత్తన శాంపిళ్లను తీసుకెళ్లి పరీక్షిస్తే, అందులో 200 బీజీ–3 విత్తనాలున్నట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఉక్కుపాదం మోపేందుకు కమిటీ.. బీజీ–3 విత్తనాన్ని షరతులతో అనుమతించాలని తెలంగాణలోని కొన్ని పత్తి విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బీజీ–2లో పది శాతం మేరకు బీజీ–3 విత్తనాలు కలిపేందుకు అవ కాశం ఇవ్వాలని, ఆ మేరకు ఢిల్లీ సమావేశంలో ప్రస్తావించాలని కంపెనీలు కోరినట్లు ప్రచారం జరిగింది. బీజీ–3 పత్తి విత్తనం అడ్డాగా తెలంగాణ ఉందనే విషయంపై ‘సాక్షి’అనేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆ కథనాలను ఢిల్లీలోని వ్యవసాయ ఉన్నతాధికారులు అనువాదం చేయించుకుని పరిశీలించినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కంపెనీల ప్రతిపాదనను అధికారులు కేంద్రం దృష్టికి తీసుకురాలేదని తెలి సింది. దేశవ్యాప్తంగా బీజీ–3 ఉన్నట్లు నిర్ధారణ జరిగినందున దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం తెలంగాణలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి బీజీ–3పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. -
విత్తనం విఫలమైనా.. రాయల్టీ దగా!
సాక్షి, హైదరాబాద్: ఆ విత్తనం విఫలమైందనీ తెలుసు.. దానికి పురుగులను తట్టుకునే శక్తి లేదనీ తెలుసు.. అసలు ఆ విత్తనంతో పంటంతా నాశనమైందనీ, రైతులు తీవ్రంగా నష్టపోయారనీ తెలుసు.. అయినా మళ్లీ అదే విత్తనం.. అడ్డగోలు రాయితీ వసూలు.. దేశవ్యాప్తంగా పత్తి రైతుల ఉసురుపోసుకుంటున్న ‘బీజీ–2’పత్తి విత్తనం వ్యవహారం ఇది.. దానిని అంటగట్టేందుకు మోన్శాంటో సంస్థ చేస్తున్న ప్రయత్నమిది. బీజీ–2 పత్తి విత్తనం విఫలమై, గులాబీరంగు పురుగు సోకడంతో గతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నాశనమైంది. అయినా వచ్చే ఖరీఫ్ సీజన్లో అదే విత్తనాన్ని రైతులకు అంటగట్టేందుకు మోన్శాంటో రంగం సిద్ధం చేసింది. రాయల్టీ కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. దేశంలో పత్తి విత్తన ధరలపై ఈ నెల 22న ఢిల్లీలో పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో బీజీ విత్తనాల ధర, రాయల్టీని ఖరారు చేయనున్నారు. అందులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవులు వెళుతున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో బీజీ–2 విత్తన వాడకం, రాయల్టీపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయాలు సృష్టించకుండా ఎలా? మోన్శాంటో 2002లో బీటీ–1 టెక్నాలజీని ప్రవేశపెట్టింది. పత్తిని పట్టిపీడించే గులాబీరంగు పురుగును తట్టుకునేలా అభివృద్ధి చేసిన జన్యుమార్పిడి విత్తనాలను బీజీ–1గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ 2006 నాటికి బీజీ–1 విత్తనం గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. దాంతో మోన్శాంటో మరోసారి జన్యుమార్పిడి చేసి బీజీ–2 పత్తి విత్తనాన్ని ప్రవేశపెట్టింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత ఆ సంస్థ పత్తి విత్తనంలో ప్రమాదకరమైన హెర్బిసైడ్ టోలరెంట్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువును ప్రవేశపెట్టి బీజీ–3 పత్తి విత్తనాన్ని రూపొందించింది. దానికితోడు పత్తి పంటలో కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసైట్ అనే పురుగు మందును తీసుకొచ్చింది. ఈ బీజీ–3, గ్లై్లఫోసైట్లతో పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తంకావడంతో కేంద్రం వాటిని దేశంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వలేదు. అయినా ఈ బీజీ–3ని రహస్యంగా రైతులకు అంటగడుతున్నారు. అయితే వచ్చే ఖరీఫ్‌లో రైతులు పత్తి వేయాలంటే అధికారికంగా ప్రస్తుతం బీజీ–2 విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఏ పత్తి విత్తనమూ రాలేదు. దాంతో ఏ విత్తనం వేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. పనిచేయని ‘విత్తు’కు రాయల్టీ కూడా.. ఇప్పటికే బీజీ–2 పత్తి విఫలమైనా.. దానికి రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మోన్శాంటో అభివృద్ధి చేసిన విత్తనాన్ని విక్రయించుకుంటున్నందుకుగాను.. ఇక్కడి కంపెనీలు ఆ సంస్థకు చెల్లించే సొమ్మే రాయల్టీ. గతేడాది బీజీ–2 విత్తన ప్యాకెట్ (450 గ్రా.) ధరను రూ.781గా నిర్ణయించారు. దానికి రాయల్టీ రూ.49 కలిపి రూ.830 గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)గా ఖరారు చేశారు. ఇలా వసూలు చేస్తున్న రాయల్టీ సొమ్ము మొత్తం మోన్శాంటోకు వెళుతుంది. అయితే బీజీ–2ను మోన్శాంటోయే అభివృద్ధి చేసినా.. ఇప్పుడది ప్రభావవంతంగా లేదు. దీంతో రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వ్యవసాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ నెల 22న ఢిల్లీలో జరిగే సమావేశంలో ఈ ఏడాది కూడా రాయల్టీ ఉండేలా మోన్శాంటో పావులు కదుపుతోంది. రాష్ట్రానికి కోటి విత్తన ప్యాకెట్లు ప్రపంచంలో పత్తి పండించే 80 దేశాల్లో మన దేశం 32వ స్థానంలో ఉంది. దేశంలో 2.92 కోట్ల ఎకరాల్లో పత్తి పండిస్తారు. గత ఖరీఫ్‌లో ఒక్క తెలంగాణలోనే ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఇందుకోసం దాదాపు కోటి పత్తి విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. అయితే గులాబీరంగు పురుగుసోకడంతో రాష్ట్రంలో పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. 3.2 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. తాజా అంచనాల మేరకు 2.3 కోట్ల క్వింటాళ్లే దిగుబడి వచ్చే అవకాశముందని తేలింది. బీజీ–2 పత్తి కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. రాయల్టీని రద్దు చేయాలి బీజీ–2 పత్తి గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. బీజీ–3 జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తుంది. పత్తిపై మోన్శాంటో రాయల్టీని రద్దు చేయాలి. ఇప్పుడు ఏ పత్తి విత్తనమూ రైతులకు శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈసారి పత్తికి ప్రత్యామ్నాయంగా ఆహార పంటల సాగును ప్రోత్సహించాలి.. – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు కేంద్ర నిర్ణయం మేరకే.. పత్తి విత్తనంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 15న ఖరీఫ్ ప్రాంతీయ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.. – జగన్మోహన్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు ఈ నెల 22న ఢిల్లీలో పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశం జరుగనుంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. బీటీ–2 పత్తికి రాయల్టీ ఉండాలా, వద్దా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కలసి నిర్ధారిస్తారు. ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి..’’ – పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి -
నాసిరకం విత్తు ఇకపై చిత్తు!
సాక్షి, హైదరాబాద్: పత్తి విత్తనంలో జన్యు స్వచ్ఛతకు నిర్వహించే గ్రో ఔట్ టెస్ట్ (జీవోటీ)లపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జీవోటీ పరీక్షల్లో నాసిరకం విత్తనాలని తేలుతున్నా మార్కెట్లో అవి విచ్చలవిడిగా లభిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జీవోటీ పరీక్షలు, నాసిరకపు విత్తనాలను కట్టడి చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇవే మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లకు లేఖ రాశారు. ప్రస్తుత నెలలో (జనవరి) పత్తి విత్తన జన్యు స్వచ్ఛత పరీక్షలు నిర్వహించి మార్చి, ఏప్రిల్ నెలల్లో వాటి ఫలితాలు విడుదల చేస్తారు. అందువల్ల ఈ సమయంలోనే మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 2 కోట్ల ప్యాకెట్ల విత్తనం! రాష్ట్రంలో పత్తి విత్తన తయారీ అధికంగా జరుగుతోంది. 10–12 ప్రముఖ కంపెనీలు దాదాపు 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులతో పంటను పండిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా, ఇతర ప్రాంతాల్లో మోస్తరు స్థాయిలో బీటీ పత్తి విత్తనోత్పత్తి జరుగుతోంది. దాదాపు రెండు కోట్ల ప్యాకెట్ల విత్తనం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందని అంచనా. దేశానికి అవసరమయ్యే విత్తనంలో దాదాపు పావు వంతు ఇక్కడ్నుంచే వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా విత్తనోత్పత్తిపై ఎలాంటి నియంత్రణ లేదు. విత్తనం ఉత్పత్తి అయ్యాక దాన్ని విక్రయించే సమయంలో సమస్యలు తలెత్తితే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటుంది. కానీ విత్తనోత్పత్తి సమయంలో జరిగే అవకతవకల నియంత్రణకు ఎలాంటి నిబంధనల్లేవు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలు తయారు చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది బీటీ–2లో నాసిరకం విత్తనాలతోపాటు బీటీ–3 విత్తనాలు కూడా ఇక్కడే తయారయ్యాయి. వీటిలో బీటీ–3 విత్తనాలకు ఎలాంటి అనుమతి లేదు. విత్తనోత్పత్తిలో ఇంత విచ్చలవిడిగా అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మార్కెట్లోకి వస్తున్నాయిలా.. పత్తి విత్తన కేలండర్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి జూలై 15 వరకు విత్తన సాగు చేస్తారు. సెప్టెంబర్ చివరి నుంచి నవంబర్ మధ్య కాలంలో పత్తి తీత ఉంటుంది. నవంబర్ తొలి వారం నుంచి జనవరి చివరి వరకు జిన్నింగ్ చేస్తారు. జనవరిలోనే నమూనాలు సేకరించి జీవోటీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్ మధ్య జీవోటీ ఫలితాలు ప్రకటిస్తారు. జీవోటీ పరీక్షల్లో విత్తన సామర్థ్యాన్ని గుర్తించి అది నాసిరకమా కాదా అని తేలుస్తారు. నాసిరకం అని తేలినా వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ మార్గదర్శకాలు ఖరారు చేశారు. మార్గదర్శకాలివీ.. - విత్తన ధ్రువీకరణ ప్రమాణాల ప్రకారం హైబ్రీడ్ పత్తి విత్తన జన్యు స్వచ్ఛత 90 శాతం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే వాటిని నాసిరకపు విత్తనంగా పరిగణిస్తారు. అలాంటి విత్తనాలను మార్కెట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. - జీవోటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయాలి. అవసరమైతే జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలి. నాసిరకపు విత్తనాలని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి. - జీవోటీ పరీక్షలు సరిగా జరగలేదని భావిస్తే మరోసారి నిర్వహించాలని కోరే హక్కు విత్తనోత్పత్తిదారులకు కల్పించారు. అందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. - జీవోటీ పరీక్షల్లో నాసిరకం అని తేలినా మార్కెట్లోకి వస్తే దాన్ని ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ వద్ద అరగంట పాటు కాల్చి వేయాలి. అప్పుడే అది మొలకెత్తే లక్షణాన్ని కోల్పోతుంది. - విత్తనోత్పత్తిదారులకు, వ్యాపారులకు మధ్య ఒప్పందం ఉండాలి. దీని ప్రకారం ఎవరు అక్రమాలకు పాల్పడినా అందుకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాలి. - విత్తనోత్పత్తి స్వచ్ఛందంగా ఉండాలి. ఎవరిపైనా ఒత్తిడి చేసి విత్తనోత్పత్తిలో పాల్గొనేలా చేయకూడదు. - దళారుల ప్రమేయం లేకుండా కంపెనీలే రైతులతో విత్తనోత్పత్తి చేయించాలి. - పత్తి విత్తనాన్ని జిన్నింగ్ చేసే సమయంలో విచక్షణారహితంగా రసాయనాలు కలుపుతున్నారు. ఇది పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. దీన్ని నిరోధించేందుకు జిన్నింగ్ మిల్లులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. -
బీజీ–3పై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: బీజీ–3 పత్తి విత్తనంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఈ విత్తనాన్ని నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనాలు దేశంలో విఫలమయ్యాయి. దీంతో మోన్శాంటో బీజీ–3 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే జీవవైవిధ్యానికి ఇది హానికరంగా మారడంతో దీనికి కేంద్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. అయినా అనేక అక్రమ మార్గాల్లో పత్తి విత్తన కంపెనీలు బీజీ–3 విత్తనాన్ని మార్కెట్లోకి తెచ్చి రైతులకు అంటగట్టాయి. రాష్ట్రంలో పత్తి 47.72 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే.. అందులో బీజీ–3 విత్తనమే 20 శాతం వరకు ఉండటం గమనార్హం. దీంతో వచ్చే ఏడాది ఈ విత్తనం రైతులకు చేరకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాలిచ్చింది. కాగా, బీజీ–3 పత్తి విత్తనాలు విక్రయించే వారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పీడీ యాక్టు కింద 5 క్రిమినల్ కేసులు పెట్టింది. ఏడు కంపెనీల లైసెన్సులు రద్దు చేసింది. జీవ వైవిధ్యానికి ముప్పు ఇలా.. మోన్శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మహికో కంపెనీ ఆర్ఆర్ఎఫ్ కారకం గల బీటీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపినట్లు సమాచారం. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇది ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసేలా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే ‘గ్లైసెల్’ పురుగుమందును తేయాకు తోటల్లో వేయడానికే దేశంలో అనుమతి ఉంది. ఇతర పంటలకు వాడకూడదు. కానీ బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఈ మందునే వాడాల్సి ఉంది. గ్లైసెల్ పురుగుమందును బీజీ–3 పత్తికి వేస్తే.. పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవి విషపూరితమవుతాయి. వాటిని తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. జీవవైవిధ్యానికి ముప్పుతోపాటు వాతావరణం కలుషితమవుతుందని నిపుణులు చెబుతున్నారు.బీజీ–3 పత్తి విత్తనాన్ని నిలుపుదల చేయాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని, జీవ వైవిధ్యానికి చేటుగా పరిణమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి బి.రాజేందర్ తెలిపారు. -
బీజీ–3 పత్తి విత్తనంతో కొంప కొల్లేరు
సాక్షి, హైదరాబాద్: బహుళజాతి సంస్థల బాగోతాలను చూసీచూడనట్లుగా వ్యవహరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’చందాన ఇప్పుడు మేల్కొంది. మూడు నాలుగేళ్లుగా బీజీ–3 పత్తి విత్తనాన్ని అనుమతి లేకుండా రైతులకు అంటగడుతున్నా పట్టించుకోని ఆ శాఖ ఇప్పుడు భయంతో వణికిపోతుంది. జీవ వైవిధ్యానికి పూడ్చలేని నష్టం జరుగుతుందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు అంచనాలకు మించి ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అందులో దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి విత్తనం వేసినట్లు అంచనా. పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక పంపింది. ఆ నివేదికలోని వివరాలు... మోన్శాంటో చేసిన పాపమే... మోన్శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి అమెరికాలో వాణిజ్యపరం చేసి మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. అంతలోనే మహికో కంపెనీ ఆర్ఆర్ఎఫ్ కారకం గల బీజీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపిందని తెలిసింది. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో వ్యవసాయశాఖ వివరించింది. అనుమతి లేకుండా బీజీ–3 విక్రయాలు... బీజీ పత్తి విత్తనం ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. చాలా విత్తన కంపెనీలు బీజీ పత్తి విత్తనాలను విక్రయించాయి. దీనివల్ల పత్తి పండించే ప్రాంతాల్లో అనుమతిలేని చట్ట వ్యతిరేక జన్యుమార్పిడి కలిగిన కొన్ని రకాల బీజీ–3 పత్తి రకాలు విత్తనోత్పత్తి సమయంలో సహజంగా కలుషితమయ్యాయి. కలుపునాశిని, పురుగులను తట్టుకునే కారకాలు గల జన్యుమార్పిడి పత్తివిత్తనాలను అనుమతి లేకుండా అమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కేంద్రం అనుమతి లేకుండా అమ్ముతున్న విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. బీజీ–3 పత్తి రకాల వ్యాప్తిపై చర్చించి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు. అనుమతిలేని బీజీ–3 విత్తనాల క్రమబద్ధీకరణ, పేటెంట్ హక్కులు తదితర అంశాలపై అదనపు అడ్వకేట్ జనరల్ నుంచి చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కేంద్రానికి విన్నవించిన నివేదికలో పేర్కొంది. -
ఖరీఫ్‌కు 1.30 కోట్ల పత్తి విత్తనం
40 ప్రైవేటు కంపెనీల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.30 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. వాటిని 40 ప్రైవేటు విత్తన కంపెనీలు సరఫరా చేయనున్నాయి. పత్తి విత్తన ప్యాకెట్ల సరఫరాను వ్యవసాయశాఖ పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే విత్తన ప్యాకెట్లు జిల్లాలకు చేరాయి. 2016–17లో పత్తి సాగు లక్ష్యం 26.60 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 38.75 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే అదనంగా 12.15 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా 1.30 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 800 2017–18 సంవత్సరానికి బోల్‌గార్డ్ (బీజీ)–1 పత్తి విత్తన ధరను ప్యాకెట్‌కు రూ. 635గా... బీజీ–2 విత్తన ధరను రూ. 800గా కేంద్రం నిర్ధారించింది. ఒక్కో ప్యాకెట్లో 450 గ్రాముల విత్తనాలుంటాయి. ప్యాకెట్‌తోపాటు 120 గ్రాముల నాన్ బీటీ విత్తనాల పౌచ్ ఉంటుంది. రైతులు బీజీ–2 విత్తనాన్నే అధికంగా వేస్తారు. కాబట్టి కంపెనీలన్నీ కూడా బీజీ–2 విత్తనాలనే అందుబాటులోకి తెచ్చాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు వివరించారు. ఇదిలావుండగా ప్రభుత్వం సబ్సిడీపై ఆహారధాన్యాల విత్తనాలను కూడా సరఫరా చేస్తోంది. ఈ ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని లక్ష్యంగా ప్రకటించగా, ఇప్పటివరకు లక్ష క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశామని అధికారులు వెల్లడించారు. అందులో వరి, పెసర, కంది తదితర విత్తనాలున్నాయి. మిగిలిన విత్తనాలను వర్షాలు ప్రారంభమయ్యే లోపుగానే జిల్లాలకు సరఫరా చేస్తామని తెలిపారు. -
మాన్‌శాంటో లేటెస్ట్ పత్తి విత్తనాలు ఇక రానట్లేనా!
న్యూఢిల్లీ: తదుపరి తరం జన్యుమార్పిడి పత్తి విత్తనాలను భారత దేశంలో ప్రవేశపెట్టేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దాఖలు చేసుకున్న దరఖాస్తును అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీ మాన్‌శాంటో హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈ విషయంలో కంపెనీకి, భారత ప్రభుత్వానికి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లే. మాన్‌శాంటో తదుపరి తరం పత్తి విత్తనాలను దేశంలోకి అనుమతించాలంటే ఆ జన్యుమార్పిడి విత్తనానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక పత్తి విత్తన కంపెనీలతో పంచుకోవాలంటూ భారత ప్రభుత్వం షరతు విధించడం వల్ల ఇంతకాలం కంపెనీకి, భారత ప్రభుత్వానకి మధ్య వివాదం కొససాగింది. ఇప్పుడు ఊహించని విధంగా తాము అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నామని తెలియజేస్తూ మాన్‌శాంటో భారత భాగస్వామి అయిన మహారాష్ట్ర హైబ్రీడ్ సీడ్స్ కంపెనీ లిమిటెడ్ కేంద్రానికి లేఖ రాసింది. ‘బోల్‌గార్డ్-2 రౌండప్ రెడీ ఫ్లెక్స్’ టెక్నాలజీకి సంబంధించిన కొత్త విత్తనాలను ప్రవేశపెట్టేందుకు ఇంతకాలం చేసిన ప్రయత్నాలన్నీ ఈ దరఖాస్తు ఉపసంహరణతో మట్టిలో కలసినట్లే. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త విత్తనాల అభివృద్ధి కోసం పెట్టిన పెట్టుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున ఆకర్షించాలనుకుంటున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి కూడా ఇది నష్టం కలిగిస్తుందని, ఎలాంటి పరిస్థితులైన తట్టుకునే వీలున్న ఈ కొత్త విత్తనాలు రైతులకు అందుబాటులోకి రాకపోవడం వల్ల వారు కూడా నష్టపోయినట్లేనని మార్కెట్ శక్తులు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ఇది మేధో సంపన్న హక్కుల పరిరక్షణ ఉల్లంఘన అంశాన్ని కూడా లేవనెత్తవచ్చని ఆ శక్తులు అభిప్రాయపడుతున్నాయి. వ్యాపార రంగంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తాము దరఖాస్తును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందేతప్పా, ఇప్పటికే భారత్‌లో తాము కొనసాగిస్తున్న జన్యుమార్పిడి పత్తి విత్తనాల లావా దేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని మాన్‌శాంటో అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యావరణ శాఖ మంత్రి మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంలో మళ్లీ మాన్‌శాంటో ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? అన్న అంశంపై సమాధానం ఇచ్చేందుకు అధికారులు కూడా సిద్ధంగా లేరు. మాన్శాంటోకు చెందిన బోల్‌గార్డ్-1 టెక్నాలజీ జన్యు మార్పిడి పత్తి విత్తనాలను భారత ప్రభుత్వం 2002లో మొదటి సారి అనుమతించింది. ఆ తర్వాత బోల్‌గార్డ్-2 టెక్నాలజీకి చెందిన విత్తనాలను 2006లో అనుమతించింది. -
దేశం విడిచి వెళ్తాం!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బీటీ కాటన్ పత్తి విత్తనం రాయల్టీని గణనీయంగా తగ్గించడంపై బహుళజాతి కంపెనీ మోన్శాంటో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. దేశం విడిచి వెళ్తానని బెదిరిస్తోంది. దీంతో మోన్శాంటో అనుకూల, వ్యతిరేక వర్గాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోన్శాంటో వెళ్లిపోతే వచ్చే నష్టమేమీ లేదని, ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉందని ఆ కంపెనీని వ్యతిరేకిస్తున్న వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోన్శాంటో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ కేంద్రం బీటీ కాటన్ విత్తన ధరలను, రాయల్టీని తగ్గించిన సంగతి తెలిసిందే. బీటీ-1 పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.635, బీటీ-2 విత్తనాల ధర రూ.800గా నిర్ధారించింది. దీనివల్ల తెలంగాణలో బీటీ-1 పత్తి విత్తనాల ధర గతం కంటే రూ.195, బీటీ-2 విత్తనాల ధర రూ.130 మేర తగ్గనుంది. అలాగే బీటీ-1 పత్తి విత్తన రాయల్టీని కేంద్రం రద్దు చే సింది. బీటీ టెక్నాలజీ కలిగిన ఇతర కంపెనీలకూ పత్తి విత్తన వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాల ముసాయిదా, లెసైన్సింగ్ నమూనాను ఇప్పటికే వెల్లడించింది. ఈ చర్యలు మోన్శాంటోకు మింగుడు పడలేదు. ఈ నిర్ణయాలను మరోసారి పరిశీలించాలని, లేదంటే దేశం విడిచి వెళ్లిపోతానని బె దిరిస్తోంది. అయితే ఆ కంపెనీవి బెదిరింపులు మాత్రమేనని, భారత్‌లో మార్కెట్‌ను అది వదులుకోదని కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెళ్లిపోయినా నష్టమేమీ లేదని పేర్కొంటున్నాయి. దేశం వదిలి వెళ్తే మంచిదే.. మోన్శాంటో దేశం విడిచిపోతే పీడ పోయినట్లేనని ఇతర విత్తన కంపెనీలు, వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. బీటీ కాటన్ వల్ల దేశంలో రైతు లు పెద్ద ఎత్తున నష్టపోయారని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీటీ-2 పత్తి విత్తనం వేసిన చోట పంటకు గులాబీ రంగు పురుగు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక అయితే విత్తన కంపెనీ నుంచి రూ.2 వేల కోట్ల పరిహారం కోరుతోంది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరసనలు, ధరల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో అర్థంకాక మోన్శాంటో దేశం విడిచి వెళ్తానంటూ బెదిరిస్తోందని అంటున్నారు. ప్రత్యామ్నాయాలపై కసరత్తు మోన్శాంటోకు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు విత్తన కంపెనీలు బీటీ-3 పత్తి విత్తనాన్ని తీసుకు రావాలని నిర్ణయించాయి. నాగపూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ(సీఐసీఆర్) ప్రత్యామ్నాయ విత్తనంపై పరిశోధన చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్వర్ణభార త్ బయోటెక్నిక్స్ సంస్థ కూడా బీటీ పత్తి విత్తనంపై దృష్టిసారించింది. అయితే బీటీ కాటన్‌కు బదులు నాన్-బీటీ పత్తి విత్తనాన్ని ముందుకు తీసుకురావాలని మరికొందరు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశంలో పత్తి 70 శాతం వర్షాధార ప్రాంతాల్లోనే సాగవుతుందని, బీటీ విత్తనం ఆ నేలలకు సరిపోదని అంటున్నారు. అందుకు బీటీయేతర పత్తే సరైన ప్రత్యామ్నాయం అని స్పష్టంచేస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్ఏ) ఆధ్వర్యంలో రైతులను సహకార సంఘంగా ఏర్పాటు చేసి తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని యావత్మాల్, వార్దాల్లో 3 వేల ఎకరాల్లో నాన్-బీటీ పత్తిని సాగు చేయిస్తున్నారు. మోన్శాంటో బెదిరింపుల నేపథ్యంలో దేశంలో బీటీ విత్తనాన్ని కొనసాగించాలా? లేదంటే నాన్-బీటీ విత్తనాన్ని ప్రోత్సహించాలా? అన్న చర్చ జరుగుతోంది.