ఖరీఫ్‌కు 1.30 కోట్ల పత్తి విత్తనం
40 ప్రైవేటు కంపెనీల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.30 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. వాటిని 40 ప్రైవేటు విత్తన కంపెనీలు సరఫరా చేయనున్నాయి. పత్తి విత్తన ప్యాకెట్ల సరఫరాను వ్యవసాయశాఖ పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే విత్తన ప్యాకెట్లు జిల్లాలకు చేరాయి. 2016–17లో పత్తి సాగు లక్ష్యం 26.60 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 38.75 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే అదనంగా 12.15 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా 1.30 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది.
ఒక్కో ప్యాకెట్ ధర రూ. 800
2017–18 సంవత్సరానికి బోల్‌గార్డ్ (బీజీ)–1 పత్తి విత్తన ధరను ప్యాకెట్‌కు రూ. 635గా... బీజీ–2 విత్తన ధరను రూ. 800గా కేంద్రం నిర్ధారించింది. ఒక్కో ప్యాకెట్‌లో 450 గ్రాముల విత్తనాలుంటాయి. ప్యాకెట్‌తోపాటు 120 గ్రాముల నాన్ బీటీ విత్తనాల పౌచ్ ఉంటుంది. రైతులు బీజీ–2 విత్తనాన్నే అధికంగా వేస్తారు. కాబట్టి కంపెనీలన్నీ కూడా బీజీ–2 విత్తనాలనే అందుబాటులోకి తెచ్చాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు వివరించారు. ఇదిలావుండగా ప్రభుత్వం సబ్సిడీపై ఆహారధాన్యాల విత్తనాలను కూడా సరఫరా చేస్తోంది. ఈ ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని లక్ష్యంగా ప్రకటించగా, ఇప్పటివరకు లక్ష క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశామని అధికారులు వెల్లడించారు. అందులో వరి, పెసర, కంది తదితర విత్తనాలున్నాయి. మిగిలిన విత్తనాలను వర్షాలు ప్రారంభమయ్యే లోపుగానే జిల్లాలకు సరఫరా చేస్తామని తెలిపారు.