గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్లకు చెందిన కొండవీటి సీతయ్య సొంత భూమితోపాటు ఏటా పెద్ద ఎత్తున కౌలుకు సాగు చేస్తుంటారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో 230 ఎకరాలకుపైగా పంటలు సాగుచేయగా సరైన ధరలు లభించక రూ.30 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. సగటున ఎకరాకు రూ.13 వేలదాకా నష్టపోయారు. ఈ ఏడాది కౌలుకు భూములు తీసుకోవడం కష్టమేనని, రైతులు కౌలు ధర తగ్గించి ఇస్తే సాగు గురించి ఆలోచిస్తామని ఆయన అంటున్నారు.
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పల్లపాడు గ్రామ పరిధిలో 1,500 ఎకరాలవరకు సాగు భూమి ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం కౌలుకు సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభమై సాగు సమయం వచ్చినా 500 ఎకరాలకు మించి ఇంకా కౌలుకు తీసుకోలేదు. వర్షాలు పడి దుక్కులు దున్నాల్సి ఉన్నప్పటికీ కౌలుదారులు ఇంకా సంశయంలోనే ఉన్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు, యద్దన పూడి, ఇంకొల్లు, చీమకుర్తి తదితర మం డలాల పరిధిలోనూ సాగుకు కౌలుదారులు ఆసక్తి చూపట్లేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడంతో.. బ్యాంకుల్లో తిరిగి రుణం పుట్టకపోవడంతో రైతులు మరింతగా అప్పుల పాలయ్యారు. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో పడిపోయారు. దీనికితోడు విత్తనాల నుంచి ఎరువులు, పురుగుమందుల వరకు ధరలు పెరిగిపోయి సాగు వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోగా.. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలూ లభించక రైతులు అప్పుల పాలై ఉసురు తీసుకుంటున్న దైన్య స్థితి నెలకొని ఉంది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది.
ఎన్నో కష్టాలకోర్చి గతేడాది పంటలు సాగు చేసిన కౌలు రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. పెట్టిన పెట్టుబడి ఖర్చూ కూడా తిరిగి రాలేదు. కనీస మద్దతు ధర అమలు కాకపోగా.. ఇంకా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది సాగు చేసేందుకు కౌలుదారులు ముందుకు రావట్లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. చివరకు కృష్ణా, గుంటూరు, సాగర్, గోదావరి డెల్టాల కింద కూడా పంటల సాగుకు కౌలురైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. రెండు, మూడు పంటలు పండే పొలాల సాగుకూ కౌలుదారులు ధైర్యం చేయలేకపోతున్నారు. గతేడాది మిగిల్చిన చేదు అనుభవాలే వారిని సాగుకు ససేమిరా అనేలా చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కౌలు ధరలు 25 శాతం నుంచి 40 శాతం వరకు పడిపోయాయని భూయజమానులు ఆందోళన చెందుతున్నారు.
సాగు సమయం ఆసన్నమైనా...
జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. పలుచోట్ల దుక్కులు దున్నేందుకు అనువుగా పదునైనప్పటికీ కాడి కట్టలేదు, సాలు దున్నలేదు. సాధారణంగా ఉగాది ముగియగానే కౌలు ఒప్పందాలు జరుగుతాయి. తొలకరి జల్లులు కురిసేనాటికి పత్తి, మిరపలాంటి ఎండుకట్టె తొలగించి తొలి దుక్కులకు పొలాలను సిద్ధంగా ఉంచడం ఆనవాయితీ. వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్ సాగు ఆరంభమవుతుంది. కానీ, ఈ దఫా కృష్ణా, గోదావరి డెల్టాల్లో సైతం కౌలుకు భూములు తీసుకుని సాగు చేయడానికి రైతులు ముందుకు రావట్లేదు. కనీసం అడిగేవారు లేరు. దీంతో కౌలుధరలు అమాంతం పడిపోయాయి. సాధారణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి వసతి కలిగి వాణిజ్య పంటలైన పత్తి, మిరప పండే భూములకు ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.18 నుంచి రూ.37 వేల వరకు కౌలు ధరలు పలుకుతాయి. వరి తరువాత మినుము, సెనగ, పెసర, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగయ్యే భూములకు ఎకరానికి రూ.12 నుంచి రూ.18 వేల వరకు కౌలు ఉంటోంది. ఇప్పుడీ కౌలు ధరలు బాగా తగ్గిపోయాయి. గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో ఎకరం రూ.19 వేల నుంచి 20 వేల వరకు కౌలు ఉండేది.
ఈ ఏడాది రూ.10 నుంచి రూ.12 వేలకు మించి తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. కౌలు ధర తరువాత నిర్ణయించుకుందామని, తొలుత సాగు చేయమని కోరుతున్నా కౌలుదారుల నుంచి ఆశించిన స్పందన రావట్లేదని భూయజమాని రామారావు ‘సాక్షి’కి చెప్పారు. రైతు, కౌలుదారు కూడా అయిన కె.సీతయ్య మాట్లాడుతూ గతేడాది రూ.18 వేలు చెల్లించానని, ఈ ఏడాది రూ.10 వేలకు కొన్ని ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కౌలు ఎలాఉన్నా ముందుగా సాగు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో ఈ ఏడాది మే, జూన్ రెండో వారం వరకు నీటి వసతి కలిగిన, ముంపునకు వీల్లేని మిరప పండే భూములను ఎంపిక చేసుకుని ఎకరానికి రూ.34 వేల నుంచి రూ.36 వేల వరకు కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నా అడిగేవారు కరువవుతున్నారని కొర్రపాటి రామకృష్ణ అనే యువరైతు చెప్పారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి తదితర మండలాల్లో గతంలో రూ.5,000 నుంచి పదివేల వరకు కౌలు ఉండేదని, ఇప్పుడు రెండు, మూడు వేలకు కూడా ఎవరూ అడగట్లేదని బండ్లమూడికి చెందిన ఎం.వెంకారెడ్డి చెప్పారు. గతేడాది ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతులు అసలు సాగు చేయకుండా అలాగే బీడుగా వదిలేశారని, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎవరూ భూమిని అడగట్లేదన్నారు. గోదావరి డెల్టాలో ఇంతకన్నా దారుణ పరిస్థితులున్నాయి. సార్వా, దాళ్వాలో ఎకరానికి 70 నుంచి 80 బస్తాల దిగుబడి వచ్చే భూములను తీసుకోవడానికీ కౌలుదారులు ముందుకు రావట్లేదు. సార్వాలో 15 బస్తాలను పది బస్తాలకు తగ్గించినా స్పందన రావట్లేదని రైతు నేత త్రినాథ్‌రెడ్డి చెప్పారు. ఎకరానికి అయిదారు బస్తాల మేర కౌలును రైతులు తగ్గిస్తున్నారన్నారు. నీటివసతి ఉండి, అరటి సాగయ్యే, ఆదాయంపై నమ్మకమున్న వైఎస్సార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కౌలుకు కాసింత డిమాండ్ కొనసాగుతోంది. కాగా, వాణిజ్య పంటలు అయిన పత్తి, మిరప దిగుబడి బాగా వచ్చే పొలాలను మాత్రం ఎంపిక చేసుకుని మరీ తక్కువ కౌలుకు ఇచ్చేట్లయితే సాగు చేస్తామని రాష్ట్రంలో అక్కడక్కడా ముందుకు వస్తున్నారని భూయజమానులు చెపుతున్నారు.
ఎకరానికి పాతిక వేలు నష్టం....
గతేడాది సెనగ జెజి–11 రకం క్వింటా రూ.8,000 పలికింది. ఇప్పుడు రూ.3,300 నుంచి రూ.3,400 వరకు ధర ఉంది. కాక్–2 రకం రూ.పదివేలు అమ్మింది. ఇప్పుడు రూ.4,000 పలుకుతోంది. ఎకరానికి సగటున ఏడు క్వింటాళ్ల దిగుబడి రాగా ధరల పతనంతో సుమారు రూ.25 వేల నష్టం వాటిల్లింది. దీంతో సెనగ పండే ప్రాంతాల్లో కౌలుదారులు సాగుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు తదితర మండలాల్లో గతేడాది ఎకరానికి రూ.25 నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించగా ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.17 వేలకు మించట్లేదు. పైగా సాగుకు ముందుకొచ్చేవారూ కరువయ్యారు. గతేడాది మొక్కజొన్న సాగుదారులకు ఎకరానికి రూ.5,000 నుంచి రూ.6,000 నష్టం వాటిల్లింది. మిరప సాగుదారులు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. పత్తి కూడా ముంచింది. ఎకరానికి సగటున రూ.15 వేలు నష్టం తప్పలేదు.
ఎందుకీ పరిస్థితి..
గతేడాది కౌలుదారులకు ఎదురైన చేదు అనుభవాలే ఈ ఏడాది వారు సాగుకు ముందుకు రాకపోవడానికి కారణం. సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కౌలుతో కలుపుకున్నట్లయితే సాగు వ్యయం కౌలుదారులకు ఎక్కువ. దీనికితోడు వారికి నేరుగా బ్యాంకుల్లో రుణం పుట్టేదారి లేకుండాపోయింది. ఇందుకోసం రుణ అర్హత పత్రాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా అది ఆచరణలో పూర్తిగా అమలు కావట్లేదు. భూయజమానులే బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందుతున్నందున కౌలుదారులకు అప్పులు లభించని పరిస్థితి. దీంతో బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేయాల్సి వస్తోంది. ముందుగా అప్పులు తీసుకున్నందున వ్యాపారులు, ఎరువుల వ్యాపారులకు తమ పంట ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎక్కువ మంది కౌలుదారులకు ఉంటోంది. గతేడాది పంటలు సరిగా పండకపోవడం, దీనికితోడు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో పెట్టుబడులూ తిరిగి రాలేదు. దీంతో ఈ ఏడాది కౌలుకు సాగు చేసేందుకు సాగుదారులు ముందుకు రావట్లేదు.
కౌలుదారులు ఎందరు?
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 లక్షల మందికిపైగా కౌలుదారులున్నారని ప్రభుత్వం అంటోంది. కానీ ప్రభుత్వం నియమించిన రాధాకృష్ణ(సెస్ అధ్యక్షుడు) కమిటీ 2016లో తేల్చిన కౌలుదారుల సంఖ్య దాదాపు 32 లక్షల పైచిలుకు. వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ రైతు సంఘాల అంచనాల ప్రకారం 25 లక్షలమంది పైనే కౌలుదారులు ఉన్నారు.
గతేడాది ఖరీఫ్‌లో 40 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా.. ఇందులో అత్యధిక శాతం కౌలుదారుల ద్వారానే సాగైంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో 50 శాతం సాగు కౌలుదారుల చేతుల్లో.. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో 80 శాతం సాగు కౌలుదారుల చేతుల్లోనే ఉంది.
వృద్ధి శూన్యం...
రాష్ట్రప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయేతప్ప వ్యవసాయ రంగంలో వృద్ధి లేనేలేదు. సాగులో, ఉత్పత్తుల్లో, ఆదాయంలో.. ఎందులోనూ వృద్ధి లేకపోగా గత నాలుగేళ్లుగా తిరోగమనం కొనసాగుతోంది. ఉత్పత్తి వ్యయం కన్నా మద్దతు ధరలు 20 శాతం తక్కువ. పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధరకన్నా 20 శాతం తక్కువ ధరలు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తులతోసహా అన్ని పంటల ధరలు పడిపోయాయి. ఏటా కౌలుదారులు, సాగుదారులు తగ్గుతున్నారు. దీంతో కౌలు ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్రామాల్లో భూముల ధరలు పడిపోయాయి. బ్యాంకుల్లోని రైతుల బంగారం వేలం వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వ్యవసాయరంగం వృద్ధి దిశగా ఉందని తప్పుడు లెక్కలు చెపుతోంది.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
ఎగపడటం లేదు...
గతంలో మాదిరి సాగుకు కౌలుదారులు ఎగపడటంలేదు. వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రానందున కౌలుధర కూడా తగ్గించాలని ఆశిస్తున్నారు. రుణ అర్హతపత్రాలు సకాలంలో ఇచ్చి బ్యాంకర్లు రుణాలు వాస్తవ సాగుదారులకు ఇవ్వాల్సిన అవసరముంది. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నా కౌలుదారుల సమస్యలు పరిష్కారం కావట్లేదు.
–నాగబోయిన రంగారావు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment