కమ్మిన కరువు మేఘం! | Drought Cloud-capped ! | Sakshi
Sakshi News home page

కమ్మిన కరువు మేఘం!

Published Tue, Oct 18 2016 3:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కమ్మిన కరువు మేఘం! - Sakshi

కమ్మిన కరువు మేఘం!

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న దుర్భిక్ష పరిస్థితులు
670 మండలాలకు గాను 373 మండలాల్లో తీవ్ర వర్షాభావం

 
-
‘నైరుతి’ కొనసాగినా జాడ లేని వానలు
- ఖరీఫ్‌ను మింగిన కరువు.. రబీపైనా ప్రభావం
- సగానికి తగ్గనున్న ఆహార ధాన్యాల దిగుబడులు
- దిగుబడుల లక్ష్యాలను కుదించిన వ్యవసాయ శాఖ
- కరువుతో పొరుగు రాష్ట్రాలకు సీమ రైతుల వలస
- దుర్భిక్ష మండలాల జాబితా కేంద్రానికి పంపడంలో తీవ్ర జాప్యం
 - గతేడాది 359 కరువు మండలాలను {పకటించినా ఇంతవరకూ అందని సాయం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. కరువునే భయటపెడదాం, అది మనల్ని చూసి పారిపోవాలి అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు ఫలితాన్నివ్వడం లేదు. ఖరీఫ్‌ను మింగేసిన క్షామం రబీని కూడా పట్టిపీడిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరువు తీవ్రత కలవరపరుస్తోంది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో (జూన్1 నుంచి అక్టోబరు 15 వరకూ) నెల్లూరు జిల్లాలో 60.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. (50 ఏళ్ల వర్షపాత వివరాలను క్రోడీకరించి సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా నిర్ణయిస్తారు) దీంతో నెల్లూరును వాతావరణ శాఖ పెను కరువు జిల్లాల జాబితాలో చేర్చింది.

ఇక అనంతపురం జిల్లాలో సాధారణ వర్షం కంటే 35.3 శాతం తక్కువ కురిసింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా ఈ నెల 15వ తేదీ వరకూ నమోదైన వర్షపాతం గణాంకాల ప్రకారం 373 మండలాలు కరువు బారిన పడ్డాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇందులో 191 మండలాల్లో కరువు, 90 మండలాల్లో తీవ్ర కరువు, మరికొన్ని మండలాల్లో పెను కరువు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 669.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 569.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

 మూడు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం
 రాష్ట్రంలో కేవలం మూడు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదైన జిల్లా ఒక్కటి కూడా లేదు. అక్టోబరు మొదటి పక్షమంతా నైరుతీ రుతుపవనాలు కొనసాగుతాయని, అల్పపీడనం వల్ల మంచి వర్షాలు కురుస్తాయన్న ఆశలు అడియాశలయ్యాయి. నైరుతీ రుతుపవనాలు కొనసాగినప్పటికీ ఈ నెల మొదటి పక్షంలో చినుకు జాడేలేదు. దీంతో సెప్టెంబరు చివరి వారం కంటే ఈ నెల 15వ తేదీనాటికి కరువు తీవ్రత పెరిగింది.

 రబీపై దుష్ర్పభావం
 ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో అత్యధిక భాగం కరువు వల్ల ఎండిపోయాయి. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా బోర్ల కింద ఉన్న పైర్లు కూడా గత నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. రబీ సీజన్‌లోనైనా వర్షాలు కురుస్తాయని, పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించారు. నైరుతీ రుతుపవనాలు అక్టోబరు ఒకటిన నిష్ర్కమించాల్సి ఉన్నా మరో 15 రోజులు అదనంగా కొనసాగుతాయని, అల్పపీడనాల వల్ల వర్షాలు మంచి కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. అయితే వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారింది.

నైరుతీ రుతుపవనాలు కొనసాగినా అల్పపీడనాలు ఏర్పడలేదు. వర్షాలూ కురవలేదు. దీంతో రబీపైనా కరువు ఛాయలు అలుముకున్నట్లేనని వ్యవసాయ, వాతావరణ శాఖల అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మనకు అక్టోబరులో వర్షాలు బాగా కురుస్తాయి. అక్టోబరును ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ల సీజన్ అంటుంటారు. 2013లో పైలీన్, 2014లో హుద్‌హుద్ తుపాన్లు అక్టోబరులోనే ఏర్పడి భారీ వర్షాలు కురిశాయి. గతంలోనూ అదే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మాత్రం అక్టోబరు మొదటి పక్షం దాటినా వర్షాల జాడ లేదు. దీంతో రబీ సాగు విస్తీర్ణం భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

 నెలాఖరుకు కరువు మండలాల జాబితా
 రాష్ట్రంలో కరువు మండలాల జాబితాను వాస్తవానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పుడు హడావిడిగా కరువు మండలాల జాబితా తయారీలో నిమగ్నమైంది. కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా వంటి రాష్ట్రాలు ఇప్పటికే కరవు మండలాల జాబితాను కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధిత అన్ని విభాగాల నుంచి సమాచారాన్ని కోరింది. రెవెన్యూ, వాతావరణ, గణాంక శాఖల నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఈ నెలాఖరుకు జాబితాను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాను కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం పరిశీలక బృందాలను పంపించి పరిస్థితిని మదింపు చేసి కరువు ప్రాంతాలను ప్రకటిస్తుంది. ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశంతోపాటు పలు జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.  

 దొరవారిసత్రంలో 82.6 శాతం లోటు
 రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ ప్రాంతంలోనూ నమోదు కానంత వర్షపాతం లోటు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో రికార్డయింది. సోమవారం నాటికి ఈ మండలంలో 82.6 శాతం వర్షపాతం లోటు ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం జిల్లా గుమ్మగట్ట 76.2 శాతం, ప్రకాశం జిల్లా గుడ్లూరు 73.8, చిత్తూరు జిల్లా ములకలచెరువు 71.8, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి 63.2, వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల 59.8 శాతం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ వివరాలతో వ్యవసాయ శాఖ తయారు చేసిన నివేదిక త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 359 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించినా ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదు.

 రాయలసీమ రైతుల వలసబాట
 కరువు సీమ రాయలసీమ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారు. పని చేయగలిగే వయసు వారంతా కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లడంతో చాలా పల్లెల్లో ఇళ్ల వద్ద వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు, పుట్టపర్తి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బెంగళూరుకు వెళ్లి భవన నిర్మాణ కూలీలుగా, హోటళ్లలో సర్వర్లుగా, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయి. మడకశిర నియోజకవర్గంలోనూ సగం మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది.

 సగానికి సగం తగ్గనున్న పంట దిగుబడులు
 రాష్ట్రంలో ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం రు.120 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది. 2016-17లో 71.14 లక్షల హెక్టార్లలో (ఖరీఫ్, రబీ) 178.6 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 15.59 లక్షల టన్నుల అపరాలు, 11.27 లక్షల టన్నుల నూనె గింజల ఉత్పత్తిని సాధించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల ఈ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు.

 వరికి కారువు కాటు
 రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని మొదట 43.88 లక్షల హెక్టార్లుగా నిర్ధారించగా.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో 40.96 లక్షల హెక్టార్లకు కుదించారు. వరి విస్తీర్ణం సుమారు 3 లక్షల హెక్టార్లు తగ్గింది. ఖరీఫ్‌లో 17.5 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయిస్తే 14.55 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో 85.89 లక్షల టన్నుల వరి దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పుడు అది 64 లక్షల టన్నులకు మించకపోవచ్చని వ్యవసాయ శాఖ అంచనా.

కరువు కాటుకు వరి దిగుబడులు దాదాపు 21 లక్షల టన్నులు తగ్గనున్నాయి. చిరు ధాన్యాల పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. పప్పు ధాన్యాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అనుకున్న లక్ష్యంలో సగం కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. వేరుశనగ 9,29,000 హెక్టార్లలో సాగు చేస్తుండగా మూడొంతుల పంట ఇప్పటికే ఎండిపోయింది. ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా అది కాస్తా క్వింటాల్‌కు పడిపోయింది. ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడుల లక్ష్యాన్ని 98.04 లక్షల టన్నులుగా పెట్టుకున్నామని, కరువు నేపథ్యంలో ఇప్పుడది 64.06 లక్షల టన్నులుగా అంచనా వేశామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement