సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఊపందుకుంది. భారీగా వర్షాలు కురుస్తుం డటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు చల్లడంలో నిమగ్నమయ్యారు. వానాకాలం సీజన్‌లో సాధారణంగా 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12.17 లక్షల ఎకరాల్లో(11%) సాగైన ట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. అందులో 7.5 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. మొక్కజొన్న 82,500 ఎకరాల్లో వేశారు. కంది, పెసర తదితర పప్పుధాన్యాల సాగు కొద్ది మొత్తంలో ఉంది. నెలాఖరులోగా సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
పెరుగుతున్న పత్తి సాగు...
2017–18లో 38.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే అదనంగా సాగు చేయిం చాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది పత్తి సాగు తగ్గడంతో మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ధరలు అధికంగా పెరిగాయి. మరోవైపు మిర్చి, కంది ధరలు అమాంతం తగ్గాయి. ఈసారి రైతులు పెద్ద ఎత్తున పత్తి వైపు మరలుతున్నారు. ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 2016–17లో 87.60 లక్షల ఎకరాలుండగా, ఈసారి 81.25 లక్షల ఎకరాలకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరి విస్తీర్ణాన్ని మాత్రమే కాస్తంత పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటివరకు 80 శాతం అధిక వర్షం
ఈ వ్యవసాయ సీజన్‌లో ఇప్పటివరకు 80 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి బుధ వారం నాటికి సాధారణంగా కురవాల్సిన సరాసరి వర్షపాతం 81.4 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 146.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 123 శాతం అధికంగా నమోదైంది. అక్కడ సాధా రణంగా ఈ 21 రోజుల్లో 67.3 ఎంఎం ఉండాలి. కానీ, 150.1 ఎంఎం వర్షపాతం నమోదైంది. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 120 శాతం అధికంగా కురిసింది. అక్కడ 58.5 ఎంఎం కురవాల్సి ఉండగా, 128.9 ఎంఎం వర్షపాతం నమోదైంది.
12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
Published Thu, Jun 22 2017 2:57 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement