పత్తాలేని విత్తు!
పత్తాలేని విత్తు!
Published Wed, Jun 14 2017 12:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
రాష్ట్రంలో తీవ్రంగా విత్తనాల కొరత
- లక్ష్యం 6 లక్షల క్వింటాళ్లు.. పంపిణీ చేసింది 76 వేల క్వింటాళ్లే
- రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో పంటలకు సిద్ధమైన రైతులు
- అయినా విత్తన సరఫరాలో వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం
- ‘రైతు సమగ్ర సర్వే’ పేరిట గ్రామాల్లో తిరుగుతున్న వైనం
- కమీషన్ల కక్కుర్తితో పలు చోట్ల సరఫరాను అడ్డుకుంటున్న అధికారులు!
సాక్షి నెట్‌వర్క్, హైదరాబాద్: వరుణుడు కరుణించాడని సంబరపడుతున్న అన్నదాతపై ‘విత్తనాల’పిడుగు పడింది. అటు వానలు పడుతున్నా.. ఇటు పంటలు వేసేందుకు పొలా లను సిద్ధం చేస్తున్నా.. విత్తనాల జాడ లేకుండా పోయింది. రాష్ట్రంలో భారీగా పంట లక్ష్యాలు నిర్దేశించుకున్న వ్యవసాయశాఖ అందుకు తగి నట్లుగా విత్తనాలను సిద్ధంగా ఉంచడంలో విఫ లమైంది. కొన్ని రకాల విత్తనాలు తగిన స్టాకు ఉన్నా అవసరమైన చోట, అవసరమైన స్థాయి లో అందుబాటులోకి తేలేకపోయింది. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఈ పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. దీంతో రాష్ట్రవ్యా ప్తంగా అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సబ్సిడీ విత్తనాలు అందకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో నకిలీ విత్తనాల బెడద కూడా మొదలైంది.
పది శాతమే పంపిణీ..
ఖరీఫ్ సీజన్ మొదలైంది. రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 127 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది కూడా. దీంతో రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వ్యవసాయ శాఖ మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. వాస్తవానికి ఖరీఫ్‌లో అన్ని రకాల విత్తనాలు కలిపి 6 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని, వాటిని సబ్సిడీపై అందజేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు జిల్లాల్లోని స్టాక్ పాయింట్లకు 4.33 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే చేరగా... అందులోనూ రైతులకు అందినవి 76,314 క్వింటాళ్లు మాత్రమే. 906 ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, డీసీఎంఎస్, 2 వేల ఏఈవో క్లస్టర్ కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేసినా.. రైతులకు సక్రమంగా పంపిణీకాకపోవడం గమనార్హం. ఏఈవో లంతా ‘రైతు సమగ్ర సర్వే’పేరిట గ్రామాల్లో తిరుగుతున్నారని... విత్తనాలు అడుగుతుంటే కొన్నాళ్లు ఆగాలంటున్నారని చెబుతున్నారు. అటు ప్యాక్స్‌లోనూ పెద్దగా విక్రయాలు జరగడం లేదు.
అధికారుల కక్కుర్తితో..
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో విత్తన విక్రయా లు జరుపుదామంటే.. స్థానికంగా ఉండే వ్యవసాయాధికారులు అడ్డుతగు లుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో విత్తనాలు విక్రయిస్తామని.. అందుకు బిల్‌బుక్‌పై సంతకం చేయాలని స్థానిక ఏవోను కోరితే లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇలా వ్యవసాయా దికారులే విత్తనాలు విక్రయించకుండా అడ్డు తగులుతు న్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
స్టాక్ పాయింట్లలో ఉన్నా..
ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల్లో కొన్నింటికి 33.33 శాతం, మరికొన్నింటికి 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీ పోను మిగతా సొమ్మును రైతులు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ సరఫరా చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక చోట్ల రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఈసారి మొక్కజొన్న సబ్సిడీ విత్తన సరఫరా లక్ష్యం 63,800 క్వింటాళ్లుకాగా, స్టాక్ పాయింట్లకు 52 వేల క్వింటాళ్ల వరకు చేరింది. కానీ రైతులకు అందజేసింది మాత్రం 964 క్వింటాళ్లు మాత్రమే. ఇక సోయాబీన్ సరఫరా లక్ష్యం 2.40 లక్షల క్వింటాళ్లు కాగా.. 28,377 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. పలుచోట్ల వ్యవసాయాధికారులే ప్రైవేటు విత్తనాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తు న్నారన్న ఆరోపణలున్నాయి.
‘పత్తి’పై ప్రైవేటుదే గుత్తాధిపత్యం
రాష్ట్రంలో పత్తి సాగు అధికం. అంత భారీగా వేసే ఈ పంటకు విత్తనాలన్నింటినీ ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తాయి. ఈసారి పంటల సాగు పెరుగుతున్నందున కోటి ప్యాకెట్లకు పైగా పత్తి విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ తేల్చింది. కానీ ఇప్పటివరకు సగానికి మించి సరఫరా కాలేదని సమాచారం. మరోవైపు కొరత కారణంగా నకిలీ విత్తనాలు విజృంభిస్తున్నాయి. ఇటీవలే అధికారులు జడ్చర్ల, బిజినేపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో నకిలీ విత్తనాలను పట్టుకున్నారు కూడా. ఇక కొందరు వ్యాపారులు బీటీ–3 విత్తనాలంటూ ధ్రువీకరణ లేని విత్తనాలను విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఏ మాత్రం స్పందన లేదు. అంతేకాదు నకిలీ విత్తనాల వెనుక స్థానికంగా కొందరు వ్యవసాయా ధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాల్లో విత్తనాలు పత్తాలేవు..
ఈ ఏడాది వరి, మొక్కజొన్న, పెసర, కంది, కుసుమ విత్తనాలను వ్యవసాయ శాఖ విరివిగానే సిద్ధం చేసింది. కానీ ఆముదం, వేరుశనగ, పచ్చజొన్న, సజ్జ, టమాటా, పత్తి, మినుము విత్తనాలు అందుబాటులో లేవు.
► జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆముదం, వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. కానీ ఇంతవరకు ఒక్క క్వింటాలు విత్తనాలు కూడా ఈ ప్రాంతానికి రాలేదు.
► రంగారెడ్డి జిల్లాలో వరి, కంది, కుసుమ తదితర విత్తనాలు సరఫరా అవుతున్నాయి. ఏఈవో క్లసర్టలో కేంద్రాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో అవి రైతులకు అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ డిమాండ్ అధికంగా ఉన్న పచ్చజొన్నలు, ఆముదం విత్తనాలు అసలే రాలేదు.
► ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో రైతులు అధికంగా పత్తిని సాగు చేస్తున్నారు. కానీ ఇక్కడ పత్తి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతా లకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరి ఎక్కువగా పండిస్తారు. కానీ ఇప్పటివరకు సరిపడా వరి విత్తనాలను సరఫరా చేయలేదు. ఇక గతేడాది మిర్చి పండించిన రైతులు.. పత్తి వైపు దృష్టిపెట్టారు. కానీ ఇక్కడ పత్తివిత్తనాలు లభించడం లేదు.
► ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నుంచి డిమాండ్ ఉన్న పెసర, మినుము, కందులు తదితర విత్తనాలు అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాకూ సబ్సిడీ విత్తనాలు అందలేదు.
► కుమ్రం భీం, నిర్మల్ జిల్లాలకు ఇప్పటివరకూ సబ్సిడీ విత్తనాలు సరఫరా కాలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపా రులను ఆశ్రయిస్తున్నారు.
చేతిలో డబ్బుల్లేవు!
పలు జిల్లాల్లో ఎరువులు, విత్తనాల కొరత లేకున్నా.. డబ్బు సమస్య వెంటాడుతోంది. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాక కొందరు.. డబ్బులు జమ అయినా నగదు కొరత ఉందంటూ బ్యాంకర్లు డబ్బులివ్వక మరికొందరు రైతులు ఇబ్బం దులు పడుతున్నారు.
‘వరి’పై సబ్సిడీ అత్తెసరే
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో వరి విత్తనాలపై సబ్సిడీ నామమాత్రంగా మారిపోయింది. విత్తనాల ధరలో కనీసం 20 శాతం కూడా సబ్సిడీ లభించకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఖరీఫ్‌లో బీపీటీ–5204, ఎంటీయూ–1010 వంటి వరి రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ప్రభుత్వం రూ.800 విలువ చేసే బీపీటీ–5204 రకం 25 కేజీల విత్తన బస్తాపై కేవలం రూ.125 సబ్సిడీయే ఇస్తోంది. రూ.834 ధర ఉన్న ఎంటీయూ–1010 రకం విత్తనాల బస్తాపై కేవలం రూ.150 మాత్రమే సబ్సిడీగా ఇస్తోంది. పైగా ఈ సబ్సిడీ విత్తనాలు పొందాలంటే ముందుగా వీఆర్‌వోల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వ్యవసాయశాఖ అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇంత తక్కువ సబ్సిడీ కోసం కూడా అధికారుల చుట్టూ తిరగాల్సి రావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
పురుగుపట్టిన.. ముక్కిపోయిన విత్తనాలు!
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏటా ఆయా జిల్లాల్లో రైతులకు ఫౌండేషన్ సీడ్ అందజేసి.. వారితో ఒప్పందం చేసుకుని వరి విత్తనాలను సేకరిస్తుంది. వాటిని ప్రాసెస్ చేసి సరఫరా చేస్తుంది. అయితే ఈసారి కొన్ని లాట్‌లు నాణ్యత లేని విత్తనాలు సరఫరా అయినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. విత్తనాలు ముక్కిపోవడం, బస్తాల్లో లక్క పురుగుల లాంటివి కనిపించడంతో వ్యవసాయాధికారులు వాటిని తిప్పి పంపేశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన స్టాకులోని కొన్ని లాట్‌లలో నాణ్యత లేని విత్తనాలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గతేడాది ఖరీఫ్‌లో సేకరించిన విత్తనాల్లో ఒకటి, రెండు లాట్లకు మాత్రమే పురుగు పట్టి ఉందని, వాటిని తొలగించామని టీఎస్‌ఎస్‌డీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎరువులు అందుబాటులో లేవు
‘‘ఏటా మండల వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఎరువులు సకాలంలో అందించేవారు. కానీ ఈ ఏడాది ఎరువులు అందుబాటులో ఉంచక ఇబ్బంది పడుతున్నాం. నారాయణపేట, మద్దూర్ ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద డీఏపీ, యూరియా తెచ్చుకుంటున్నాం. ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు..’’
– వీరారెడ్డి, రైతు, పిడెంపల్లి, దామరగిద్ద, మహబూబ్‌నగర్ జిల్లా
ఆముదం విత్తనాలు ఇంకా రాలేదు
‘‘మా ప్రాంతంలో ఎక్కువగా ఆముదం వేస్తాం. ఈసారి ఇంకా ఆ విత్తనాలు రాలేదు. ఏటా క్రాంతి రకం ఆముదం విత్తనాలు ఇస్తున్నారు. వాటితో సరైన దిగుబడి రావడం లేదు. ఈసారైనా నవభారత్ రకం విత్తనాలు ఇవ్వాలి..’’
– కుర్వ నర్సింహులు, ధరూరు,జోగుళాంబ గద్వాల
విత్తనాల కొరత లేదు
‘‘రాష్ట్రంలో విత్తనాలకు ఎటువంటి కొరతా లేదు. ప్యాక్స్, ఏఈవో క్లస్టర్ పాయింట్ల వద్ద కావాల్సినంతగా విత్తనాల స్టాక్ ఉంది. నకిలీ విత్తనాలు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తాం..’’
– పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి
Advertisement