నైరుతి | Southwest | Sakshi
Sakshi News home page

నైరుతి

Published Sat, Aug 1 2015 4:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Southwest

సాగర్ ఆయకట్టుపై నీలినీడలు
ఎగువ నుంచి రిజర్వాయర్‌కు రాని నీరు
{పస్తుత నీటి మట్టం 510 అడుగులు
జిల్లాలో లక్ష హెక్టార్లకు పైగా ప్రభావం
దిక్కుతోచని స్థితిలో రైతాంగం
 
 నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు
 ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటి మట్టం  510 అడుగులు
 సాగర్ నీళ్లు ఆయకట్టుకు రాకపోతే  లక్ష హెక్టార్లపై ప్రభావం
 
 సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ ఆయకట్టులోని 16 మండలాల పరిధిలో వరి లక్ష హెక్టార్ల వరకు సాగవుతుంది. నైరుతి రుతు పవనాలు అనుకూలిస్తే .. భారీ వర్షాలతో సాగర్ రిజర్వాయర్ నిండితే ఖరీఫ్, రబీకి ముందస్తుగానే నీటి విడుదల ఉంటుంది. రైతులు విత్తనాలు, ఎరువులు, పంటల సాగుకు ఉరుకులు,పరుగులు పెట్టేవారు. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జూన్‌లో తొలకరి పలకరించినా ఆ తర్వాత నైరుతి పవనాల అడ్రస్ లేకపోగా.. రిజర్వాయర్‌లో నీరు లేక వెలవెలబోతుంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే ఇన్‌ఫ్లోతో 530 అడుగులు నిండితే పంటలకు సాగు నీటిని విడుదల చేస్తారు.

ప్రస్తుతం నీటి మట్టం 510 అడుగులు ఉంది. శ్రీశైలం నుంచి ఇన్‌ప్లో కూడా లేదు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండడంతో నైరుతి పవనాలు జాడ లేదు. ఈ పరిస్థితులతో ఇక ఇప్పట్లో సాగర్  నిండే అవకాశాలు కనిపించడం లేదు. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 1.34 లక్షల హెక్టార్లు. ఇందులో లక్ష హెక్టార్లకు పైగా సాగర్ ఆయకట్టులోనే సాగు చేస్తారు. గత ఏడాది ఈ సమయానికి ఆయకట్టులో వరి సాగు కోసం 20 వేల హెక్టార్లలో నార్లు పోశారు. ప్రస్తుతం 7 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు నార్లు పోసి.. వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడోనని ఆకాశం కేసి చూస్తున్నారు.

 నీళ్లు వస్తాయో.. రావోనని..!
 సాగర్ నీళ్లు వస్తాయో.. రావోనని ఆయకట్టు చివరి భూముల రైతులు ఇప్పటికే మొక్కజొన్న, పెసర పంటలు సాగు చేశారు. మధిర, బోనకల్, కల్లూరు, ఎర్రుపాలెం, తల్లాడ, వైరా, ఏన్కూరు తదితర మండలాల్లో ఈ పంటల సాగుకు మొగ్గు చూపారు. సుమారు 4 వేల హెక్టార్లకు పైగా సాగర్ చివరి ఆయకట్టు భూముల్లో ఈ పంటల సాగు చేశారు. అలాగే కంది 1,600, పెసర 6 వేల హెక్టార్లలో సాగు అయింది. వర్షాలు పడితే ఈ పంటలను తీసి మళ్లీ వరి సాగు చేద్దామన్న ముందస్తు ఆలోచనతో రైతులు ఈ పంటలను వేశారు. అయితే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఈ పంటలు కూడా ఎండిపోయే దశకు చేరుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తొలకరి వర్షాలతో రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి ఈ పంటలు వేసినా చివరకు  వర్షాలు లేక తీవ్రంగా నష్టపోనున్నారు.

 ఈనెలలో వర్షాలు పడితేనే..
 ఖరీఫ్ సీజన్ ఇప్పటికే రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఇక ఆగస్టు పైనే రైతులు వర్షాలపై అంచనాలు పెట్టుకున్నారు. ఈనెలలో కురిసే వర్షాలతోనే పంటల సాగా..? భూముల బీడా..? తేలిపోనుంది. జూలై సాధారణ వర్షపాతం 309 మి.మీ కాగా చివరి వరకు కేవలం 110.07 మి.మీ మాత్రమే పడింది. ఇంకా 64.1 శాతం వర్షలోటు జిల్లాలో ఉంది. గత ఏడాది జూలైలో మొత్తం 225.2 మి.మీ పడితే కేవలం 27 శాతం మాత్రమే వర్షపాతం లోటు నమోదైంది. ఈసారి వర్షపాతం లోటు ఎక్కువగా నమోదు కావడంతో ఈనెలలో పవనాల కదిలక తీవ్ర స్థాయిలో ఉంటేనే పంటల సాగుకు అనుకూలిస్తుంది.  
 
 నీళ్లు ఎప్పుడొస్తాయో..    
 బోనకల్ బ్రాంచ్‌కెనాల్ ఆయకట్టు పరిధిలో రైతుల పరిస్థితి బాగాలేదు. ఎప్పుడు ఆయకట్టు కింద వరినారు పోయాలో! లేదో తెలియడం లేదు. మాగాణి కావడంతో మెరక పంటలు వేయలేం. బావులు, చెరువుల కింద రైతులు నార్లు  పోశారు. కాలువ నీటినే నమ్ముకున్న మా బాధను ఎవరు పట్టించుకుంటారు. అధికారులు సాగర్‌నీరు వస్తాయో, రావో కూడా చెప్పడం లేదు. నీళ్లు రాకపోతే నాకున్న ఐదెకరాలు బీడే.
కొమ్మినేని బాబు, రామాపురం, బోనకల్ మండలం

 నారుమళ్లు పోయలేదు..
 వర్షాలు పడితే వరినారు పోసేవాళ్ళం. సీజన్ ప్రారంభమై  రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వర్షాలు లేకపోవడం, సాగర్‌లో నీరు లేవని చెప్పడంతో నారు పోయలేదు. మాగాణి పొలంలో ఏ పంట వేయలేని పరిస్థితి. మాగాణి సాగు చేయకపోతే తిండి గింజలు కూడా కరువే. వర్షాలు పడి, సాగర్ నిండితేనే పంట సాగు చేస్తాం. లేకపోతే భూమి అంతా బీడుగా పెట్టాల్సిందే.
 కొత్త మల్లయ్య, ముష్టికుంట్ల, బోనకల్ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement