ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేదెప్పుడు?
♦ పంట కోల్పోయిన 21.77 లక్షల మంది రైతుల నిరీక్షణ
♦ కరువు మండలాల వైపు కన్నెత్తి చూడని రాష్ట్ర సర్కారు
♦ రూ.989 కోట్లు కావాలని కోరిన విపత్తుల నిర్వహణ శాఖ
♦ అంత మొత్తం ఇవ్వలేమంటూ కొర్రీ వేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ
♦ కేంద్రానికి పంపిన ప్రతిపాదనల తిరకాసు.. ఫైలు తిరుగుటపా
సాక్షి, హైదరాబాద్: కరువు దుర్భిక్షంతో పంట నష్టపోయి తల్లడిల్లుతున్న రైతుల వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడటం లేదు. అన్నదాతకు అన్నింటా అండగా ఉంటామన్న ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావంతో పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదు. వచ్చే పంటకు పెట్టుబడి సాయంగా ఈ పరిహారం అందిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మీనమేషాలు లెక్కిస్తోంది. వ్యవసాయ శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, ఆర్థిక శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇన్‌పుట్ సబ్సిడీ ఫైలు ముందుకు కదలడం లేదు. కరువు మండలాల్లో పంట నష్టపోయిన 21.77 లక్షల మంది రైతులకు రూ.989 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరుతూ ఇటీవల విపత్తుల నిర్వహణ శాఖ ఆర్థిక శాఖకు ఫైలు పంపించింది. అంత మొత్తం ఇవ్వలేమంటూ ఆర్థిక శాఖ ఈ ఫైలును యథాతథంగా వెనక్కి పంపించింది. దీంతో వచ్చే నెలలోనైనా ఈ నిధులు విడుదలవుతాయా.. లేదా.. అన్నదానిపై సందిగ్ధం నెలకొంది.
21.77 లక్షల మందికి నష్టం...
గత ఖరీఫ్‌లో వర్షాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. ఆలస్యంగా తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడు జిల్లాల్లో 231 మండలాలు కరువు బారిన పడినట్లు ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఈ ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా కనీస పరిహారాన్ని చెల్లించాలి. కరువు మండలాలను ప్రకటించిన వెంటనే పంట నష్టపోయిన రైతులను గుర్తించాల్సిన వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా మూడు నెలల పాటు సాగదీసింది. పంట కాలం ముగిసిపోయాక జాబితా సిద్ధం చేసింది. మొత్తం 21.77 లక్షల మంది రైతులకు పరిహారం చెల్లించాలని వ్యవసాయ శాఖ లెక్కతేల్చింది.
ఈ వివరాలను విపత్తుల నిర్వహణ శాఖకు పంపించింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 8.36 లక్షల మంది రైతులు పంట నష్టపోయారు. ఏడు జిల్లాల పరిధిలో 33.81 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపు రూ. 1790.79 కోట్ల విలువైన పంట దెబ్బతిన్నట్లు విపత్తుల నిర్వహణ విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రూ.989.58 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు చెల్లించాలని లెక్కగట్టింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరింది.
కొర్రీ పెట్టిన ఆర్థిక శాఖ...
కరువు పరిస్థితులను అధిగమించే చర్యలు చేపట్టేందుకు తగిన ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.863 కోట్లు కావాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో ఉంటే.. ఇప్పుడు అంతకు మించి రూ.989.58 కోట్ల నిధులు ఎందుకు అవసరమయ్యాయంటూ కొర్రీ పెట్టింది. దీనికి తోడు కేంద్రం నుంచి వచ్చిన కరువు సాయం నిధులు తక్కువగా ఉండటం, విపత్తుల నిర్వహణ విభాగం ఎక్కువ నిధులు కోరడంతో ఆర్థిక శాఖ అప్రమత్తమైంది.
ముందుగా ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్న తర్వాతే ఫైలును తమకు పంపించాలంటూ వెనక్కి పంపించినట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,005 కోట్లు సాయం చేయాలని కోరితే.. కేంద్రం రూ.791 కోట్ల కరువు సాయం ప్రకటించింది. అందులో రూ.703 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కోటాగా నిర్దేశించింది. దీంతో అంతకు మించి నిధులను సర్దుబాటు చేయడం కుదరదని ఆర్థిక శాఖ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైలు మళ్లీ విపత్తుల నిర్వహణ విభాగానికి చేరింది. పర్యవసానంగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు మరింత ఆలస్యమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.