lease farmers
-
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
కౌలు రైతుల కష్టాలకు చెల్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న కౌలు రైతులకు వ్యవస్థాగత పరపతి సౌకర్యం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంటసాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్సీ) ఉన్నా వ్యక్తిగతంగా పంట రుణాలు ఇచ్చేందుకు వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు మొగ్గుచూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సాగుదారుల సంఘాలను ఏర్పాటుచేసి వారికి పరపతి సౌకర్యం కల్పించాలని సంకల్పించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా కౌలుదారులకు కార్డులిచ్చినా బ్యాంకర్లు రకరకాల సాకులతో 12–13 శాతం మందికి మాత్రమే పంట రుణాలిచ్చారు. దీంతో సీఎం వైఎస్ జగన్ పరిస్థితిని సమీక్షించి.. వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులందరికీ ప్రభుత్వ రాయితీలు, పంట రుణాలు అందేలా చూడాలని, అందుకు సంబంధించి ఏం చేయవచ్చో ఆలోచించమని వ్యవసాయ శాఖను ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఉపసంఘం సమావేశంలో సాగుదారుల సంఘాల ప్రతిపాదన చేసింది. నాబార్డు నిబంధనల ప్రకారం రుణ అర్హత పత్రాలు, జాయింట్ లయబులిటీ గ్రూపులకు (జేఎల్‌జీ) రుణాలిచ్చేందుకు అవకాశమున్నందున ఆ ప్రతిపాదనను చేసింది. ఇందుకు ఎస్ఎల్బీసీ సబ్ కమిటీ కూడా అంగీకరించింది. దీంతో సీసీఆర్సీ కార్డులున్న వారితో పాటు జేఎల్‌జీ గ్రూపులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు వ్యక్తంచేసిన సందేహాలను వ్యవసాయ శాఖాధికారులు నివృత్తి చేయడంతో పాటు రుణాల చెల్లింపులో తమ వంతు సాయంచేస్తామని కూడా భరోసా ఇచ్చారు. సాగుదారుల సంఘాల ఏర్పాటు ఎలాగంటే.. ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో కనీసం పది సాగుదారుల సంఘాలు ఉంటాయి. ఒక్కో సంఘంలో ఐదుగురికి తగ్గకుండా కౌలురైతులు ఉంటారు. నాబార్డు నిబంధనల ప్రకారం రుణాలిప్పించేందుకు వ్యవసాయాధికారులు సహకరిస్తారు. ఇ–పంట నమోదు ఆధారంగా వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. వాళ్లతో మాత్రమే సాగుదారుల సంఘాలు ఏర్పాటవుతాయి. వీటిని ఆయా గ్రామాల వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ధ్రువీకరిస్తారు. ఇ–పంట డేటా ప్రాతిపదికగా నిర్దేశించిన నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలిస్తాయి. సమష్టి బాధ్యత ఉంటుంది గనుక సభ్యులే రుణాలు చెల్లించేందుకు ముందుకు వస్తారని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. -
కౌలు రైతులకు చకచకా కార్డులు
సాక్షి, అమరావతి: కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్సీ) అందచేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారోద్యమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. జూలై 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 7న ముగియనుంది. కౌలు రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకోవాలన్నది ఈ కార్డుల ఉద్దేశమని సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చే ఈ కార్డులతో కౌలు రైతులు ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, వ్యవస్థాగత పరపతి పొందుతారు. ఏపీ పంట సాగుదారుల చట్టం–2019 ప్రకారం ఈ కార్డులు జారీ చేస్తారు. 11 నెలలు మాత్రమే చెల్లుబాటు.. ► పంట సాగుదారు కార్డుపై భూ యజమాని లేదా ప్రతినిధి, సాగుదారు, గ్రామపరిపాలనాధికారి (వీఆర్వో) సంతకాలు ఉంటాయి. ► 11 నెలల తరువాత సాగుదారు మళ్లీ కొత్తకార్డు పొందాల్సిందే. ► కార్డు పొందిన వారికి భూమిపై ఎటువంటి హక్కులు ఉండవు. ► ఈ కార్డుపై పంట రుణం తీసుకుంటే పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సాగుదారుదే. ఒకవేళ రుణం కట్టకుంటే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండదు. రుణం ఇచ్చిన బ్యాంకు భూ యజమానికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది ► సాగుదారుడు భూమికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ► భూ యజమాని కుటుంబ సభ్యుల పేర్లతో సాగుదారు కార్డులు ఇవ్వరు. ► దేవదాయ భూములను సాగు చేస్తున్న వారు కూడా కార్డు పొందవచ్చు. ► దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో సాగుదారు కార్డు లభిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మార్వో కార్యాలయం దృష్టికి తేవాలి. ► ప్రస్తుత ఖరీఫ్‌లో సీసీఆర్సీ కార్డుదారులందరికీ నూటికి నూరు శాతం పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోంది. ► రైతు భరోసా కేంద్రాలలో వాస్తవ సాగుదారులు, భూ యజమానులను సమావేశపరచి కార్డుల జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు భూ యజమానులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. -
కౌలు రైతులకు బ్యాంకులు సహకరించాలి
-
కౌలు రైతులకు బ్యాంకులు సహకరించాలి
-
కౌలు రైతులకు బ్యాంకులు సహకరించాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: రుణం తీసుకునే కౌలు రైతులకు బ్యాంకులు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కేబినెట్ సమావేశంలో కౌలు రైతుల రుణ పరిమితిపై చర్చించామని తెలిపారు. ఏపీలో అన్ని చోట్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయని వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్ చాలా ఆశాజనకంగా ఉందన్నారు. సాధారణం కన్నా 51 శాతానికి పైగా వర్షం వచ్చిందన్నారు. ఏపీ రిజర్వాయర్లలో కూడా నీటి లభ్యత స్థితి కూడా చాలా బాగుందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు) గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపు వల్లే ఈసారి విత్తన సమస్యలు లేవని మంత్రి అన్నారు. చరిత్రలో మొదటిసారిగా పొగాకు కొనుగోళ్లను ప్రారంభించామని చెప్పారు. ఇందుకోసం రూ. 200 కోట్లు కేటాయించేందుకు సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.(ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ) -
కౌలు కష్టం దక్కనుంది
సాక్షి, కొమరాడ (విజయనగరం): పండించిన పంటకు మద్దతు లేక.. భూజమానికి కౌలు ఇవ్వలేక సతమతం అయిన కౌలు రైతున్నకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతృత్యంలో ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయం నియోజవర్గంలో రైతులు వేలామంది కౌలు కష్టాలు తీరినట్లే. భూహక్కు దారుడికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు హక్కులు కల్పిస్తు 11 నెలలు సాగు ఒప్పంద ప్రతంతో అన్ని రాయతీలు, సదుపాయాలు, లాభాలు వర్తించి వారికి భరోసా ఏర్పుడినుంది. కౌలు రైతుకు భరోసా... సొంతంగా భూమిలేని ఎంతో మంది రైతులు భూ యజమానులు వద్ద భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తు జీవనం కొనసాగుస్తున్నారు. సాగుకోసం కౌలు రైతులు భూజమానితో ఎన్నో ఇబ్బందుల ఎదుర్కొనుంటున్నాడు. కనీసం హక్కు ప్రతాలు కావాలని అడిగితే ఎక్కడ తమ భూమి కౌలు రైతుకు చెందిపోతుందో అని భయపడి తన ఆధీనంలో ఉంచుకుంటున్నారు భూ యజమానులు. దీంతో కౌలు రైతులకు కష్టం తప్ప లాభమేమి ఉండడం లేదు. ఇలాంటి సమయంలో జగన్న కౌలు రైతులు కష్టాలు నేరుగా తెలుసుకుని వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకరావడం గర్వహించే తగ్గ విషయం. ఈ చట్టం ద్వారా కౌలు రైతులు పంట నష్ట పోయిన ఇప్పుడు కౌలు రైతులు చెందితుంది. కౌలు రైతు చేకూరే ప్రయాజనాలు కౌలు రైతులు ముసాయదా బిల్లు వచ్చినందు వల్లన భూ యాజామాని ఎలాంటి ఇబ్బందులు కల్గికుండా11నెలలు కాల పరిమితం కూడిన సాగు ఒప్పందం ఉంటుంది. కౌలు రైతులు కూడా హక్కులు కల్పిస్తు అన్ని ప్రయోజనాలు చేకూరిలా వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.12500పెట్టబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణం కూడా పొందే వెసులుబాటు. ఈ బిల్లు ద్వారా కౌలు రైతులు కలుగుతుంది. ఎంతో సంతోషంగా ఉంది కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ రాష్టం ప్రభుత్వం కౌలు రైతు ముసాదా బిల్లును తీసుకురావడం శుభపరిమాణం సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులు పట్ల ఎంతో ప్రేమ ఉంది, కౌలు రైతులకు ముసాయిదా బిల్లు ద్వారా కౌలు రైతులు హక్కులు కల్పించటమే కాకుండా అన్ని రాయితీలు, ప్రయోజనలు వర్తింపజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. – రఘుమండల గౌరునాయడు, పరుశురాంపురం ఆనందంగా ఉంది కౌలు రైతులకు హక్కులు కల్పించడంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎళ్ల తరబడి కౌలుకు భూములు సాగు చేస్తున్నాం. పంటలు దెబ్బతినే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థతి లేకుండా అన్ని ప్రయోజనలు చేకూరిలా భరోసా వచ్చింది. – ఆర్.ముత్యాలనాయుడు, పి.పురం -
కౌలు రైతులకు జగన్ సర్కార్ వరాల జల్లు!
సాక్షి, అమరావతి: కౌలు రైతులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఇందులో భాగంగానే కౌలు రైతు ముసాయిదా బిల్లుకు ప్రభుత్వం అమోద ముద్ర వేసింది. భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా, కౌలు రైతులకు 11 నెలల కాలానికి సాగు ఒప్పంద పత్రాలు ఇస్తున్నారు. దీని వలన రైతులకు ఒనగూరే ప్రయోజనాలన్నీ చేకూరనున్నాయి. వీరికి వైఎస్సార్ రైతు భరోసాపాటు, ఉచిత పంటల బీమా, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు అందనున్నాయి. జిల్లాలో దాదాపు 3.60 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. గత ఏడాది కేవలం 1.02 లక్షల మందికి మాత్రమే ఎల్ఈసీ (రుణ అర్హత కార్డులు) సీవోసీలు (సాగు ధ్రువీకరణ పత్రాలు) ఇచ్చారు. గత ఏడాది కౌలు రైతులకు రూ.200 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే బ్యాంకర్లు పంట రుణాలు కేవలం రూ158.95 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది కౌలు రైతులకు రూ.1100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 75,800 ఎల్ఈసీ కార్డులు, 1000 సీవోసీ పత్రాలు ఇచ్చారు. జిల్లాలో ఎక్కువ మంది పంటలు సాగు చేసేది కౌలు రైతులే కావడం విశేషం. సీఎం చొరవతో.. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పంటలు సాగు చేసే రైతులందరికీ సాగు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా కౌలు రైతుల చట్టానికి సవరణ చేశారు. జిల్లాలో దాదాపు 3.60 లక్షల మంది కౌలు రైతులకు వైఎస్సార్ భరోసా కింద ఏడాది రూ.12,500 ఇవ్వనున్నారు. సాగు చేసిన పంటలకు ప్రమాద బీమా, ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేస్తారు. ప్రధానంగా పంట రుణాలు ఎక్కువ మొత్తంలొ అందనున్నాయి. గత ప్రభుత్వ హయంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గుర్తింపు కార్డులు కూడా దక్కలేదు. దీంతో పంట పెట్టుబడులు రాక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేకాభిమానంతో కౌలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెంటు భూమి ఉండదు.. కానీ ఆ భూమాతకు పచ్చని పారాణి పూసేది ఆయనే.. పెట్టుబడైనా వస్తుందనే గ్యారంటీ లేదు.. కానీ ఆ పుడమి తల్లి ఒడిలోనే గుప్పెడు మెతుకుల కోసం ఆరాటపడేది ఆయనే.. మద్దతు ధర దక్కుతుందనే నమ్మకం లేదు.. కానీ ఏదొక రోజు తన లోగిలిలో సిరుల పంట పండుతుందని ఆశగా ఎదురుచూసేది ఆయనే.. మొక్క ఒంగినా కుంగిపోయేది ఆయనే.. పంట పచ్చగా నవ్వితే పులకించిపోయేది ఆయనే.. పొట్టకొచ్చిన కంకులను చూసి పొంగిపోయేదీ ఆయనే.. చివరకు ప్రకృతి వైపరీత్యాలకు, ప్రభుత్వ నిరాదరణకు నిండా మునిగేదీ ఆయనే.. ఆయనే ఆకుపచ్చని చందమామైన కౌలు రైతు.. ఇప్పుడా కౌలు రైతు బతుకుల్లో వెన్నెల వెలుగులు రాబోతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో రారమ్మని బ్యాంకు రుణాలు పిలవబోతున్నాయి. అసెంబ్లీలో కౌలు రైతుల ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర పడి.. అన్నదాత ఇంట ఆనందాల పచ్చని కంకులు వేయబోతున్నాయి. -
భూయజమానిపై కౌలు రైతులు దాడి
-
కౌలు రైతులపై వైఎస్ జగన్ వరాల జల్లు
-
రొయ్య సాగెలా..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలు భారీగా తగ్గించారు. ఒక్కో రైతుకు కేజీ రూ.50 నుంచి రూ.70 వరకు నష్టపోయారు. దీంతో రెండో పంట సాగుకు వెనుకాడుతున్నారు. దీంతో తీర ప్రాంతంలోని 11 మండలాల పరిధిలో 30 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాల చెరువులు బీళ్లుగా మారాయి. ఇక కౌలు రైతులకు మరింత నష్టం వాటిల్లుతోంది. దీంతో వారు రెండో పంటకు రొయ్యల సాగుజోలికి వెళ్లడం లేదు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో అధికారికంగా 27 వేల ఎకరాలు, అనధికారికంగా 30 వేల ఎకరాల్లో వేలాది మంది రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వానాకాలం పంటలు దాదాపు పూర్తిగా రొయ్యల చెరువులు సాగయ్యాయి. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక కేజీ 100 కౌంట్ రొయ్యల సాగుకు రైతులు..ఒక ఎకరాలో లక్ష సీడ్‌కు రూ.30 వేలు, ఒకటిన్నర ఫీడ్‌కు రూ.లక్షా10 వేలు, కరెంటు బిల్లు మూడు నెలలకు రూ.36 వేలు, ఫీల్డు బాయ్‌కి రూ.15 వేలు, కెమికల్స్ అండ్ మినరల్స్‌కు రూ.30 వేలు చొప్పున రూ.2లక్షల 20 వేలు ఖర్చు చేశారు. ఇక ఒక పంటకి కౌలు రైతు కౌలు కింద రూ.25 వేలు వెచ్చించారు. ఈ లెక్కన ఎకరాకు రైతుకు పెట్టుబడి రూ.2.45 లక్షలు అయ్యింది. ఒక కేజీ రొయ్య ఉత్పత్తికి రైతుకు రూ.245లు ఖర్చు కాగా 100 కౌంట్ రొయ్య కేవలం రూ.175లకు అమ్ముడు పోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కొద్దో గొప్పో వచ్చిన వారి పరిస్థితి ఇలా ఉంటే రొయ్యలు చనిపోయి చెరువులు పూర్తిగా నష్టపోయిన వారూ ఉన్నారు. మొత్తంగా మొదటి పంటలో దాదాపుగా రైతులందరూ తీవ్ర స్థాయిలో నష్టాలు చవి చూశారు. ఇదే ధరలకు రొయ్య రైతులు మరింతగా నష్టపోవాల్సిందే. దీంతో బెంబేలెత్తిన రైతులు వర్షాకాలం పంట సాగుకు విముఖత చూపడంతో 30 వేల ఎకరాల సాగులో దాదాపు 20 వేల ఎకరాల్లో రొయ్యల సాగు నిలిచి పోయింది. చెరువులన్నీ బీళ్లుగా మారాయి. రెండో పంట సాగు చేసి మరింత నష్టాలు పాలు కావడం ఇష్టం లేక చాలా మంది రైతులు సాగుకు దూరమయ్యారు. రొయ్య రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర మత్స్యశాఖ, కేంద్ర పరిధిలోని ఆక్వా అథారిటీ ఆఫ్ ఇండియాలు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయాయి. రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఉష్ణోగ్రతల తీవ్రతల కారణంగా జిల్లాలో రెండో పంట రొయ్యసాగు తగ్గుతోందని అధికారులు పేర్కొంటుండడం విడ్డూరంగా ఉంది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ప్రారంభం సమయంలో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని కొందరు రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గి రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటాయన్నది వారి అభిప్రాయం. వాస్తవానికి 15 నుంచి 28 శాతం నీటిలో ఉప్పు ఉంటే రొయ్యల ఎదుగుదల ఉంటుంది. అయితే ప్రస్తుతం రెండో పంట ప్రారంభంలో ముందస్తు వర్షాలు కురవక పోవడంతో సముద్రపు నీటితో ఉన్న బకింగ్ హామ్ కెనాల్‌తో పాటు క్రీకులు, కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల ఉప్పు శాతం 38 శాతం నుంచి ప్రాంతాలను బట్టి 50 శాతం వరకు ఉంది. ఈ సమయంలో రొయ్యల సాగు కొంత ఇబ్బందికరమే. అయితే వర్షం కురిస్తే క్రీకులు కాలువల నీరు సముద్రంలో కలిసిపోయి కొత్త నీరు నిల్వ ఉంటుంది. అప్పుడు ఉప్పు శాతం తగ్గుతుంది. రెండో పంట సమయంలో ఇది సర్వ సాధారణమని రైతులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రొయ్య ధరలు పతనం కావడం వల్లే రైతులు రెండో పంటకు మొగ్గు చూపడం లేదన్నది రైతుల వాదన. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధరలు పెంచి రొయ్యల సాగు యధావిధిగా కొనసాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
కౌలు రైతుల కష్టాల సాగు!
సాక్షి, అమరావతి: - శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్యవలసకు చెందిన దలి రేయన్నఓ కౌలు రైతు. రుణ అర్హత పత్రం(ఎల్ఇసీ) ఉంది. గ్రామసభలో పంట రుణానికి దరఖాస్తు ఇచ్చాడు. మూడేళ్లుగా ఇదే తంతు. ఇంతవరకు పంట రుణం లేదూ, పంటల బీమా కూడా లేదు. - ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఓ చిన్న సన్నకారు రైతు. ఆయనకున్న రెండున్నర ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటాడు. పంట హామీగా రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా, ఎంతో మందితో చెప్పించినా బ్యాంకులు పట్టించుకోవడంలేదు. - కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామానికి చెందిన లక్ష్మణస్వామి కూడా ఓ కౌలు రైతు. కౌలుదారుల చట్టం ప్రకారం అన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో కౌలు రైతుల సంఘం సభ్యులతో ఆందోళనకు దిగి ఎట్టకేలకు బ్యాంకు నుంచి రుణం పొందారు. ..పంట రుణం పొందడానికి కౌలు రైతులు పడుతున్న ఇక్కట్లకు ఇవన్నీ సాక్ష్యాధారాలు. వారికి రుణం పెద్ద ఫార్స్‌గా మారింది. వ్యవసాయ శాఖ చెప్పేదానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. రుణ అర్హత పత్రాలు లేవు, సాగు ధృవీకరణ పత్రాలు కానరావు. మరోవైపు.. భూ యజమానులు పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ ఇవ్వరు.. ఇన్ని ఇక్కట్ల మధ్య రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 17 లక్షల మంది కౌలు రైతులు కాడీ మేడీ పట్టారు. 2011 భూ అధీకృత చట్టం ప్రకారం ఎటువంటి హామీ లేకుండా రూ.లక్ష రుణం ఇచ్చేందుకు అవకాశం ఉన్నా బ్యాంకులు పెద్దగా ముందుకు రావడంలేదు. దీంతో రుణాలు అందుతున్న వారి సంఖ్య 3.59 లక్షల మందికి మించడంలేదు. మరోవైపు.. 7–8 వేల కోట్ల రూపాయలను కౌలు రైతులకు రుణాల కింద ఇస్తామని చెబుతున్నా గత ఏడాది (ఖాతాల సర్దుబాటు సహా)ఇచ్చింది కేవలం రూ.2,600 కోట్లే. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో సాగు, రైతుల వివరాలు.. సాగు విస్తీర్ణం : 80,96,441 హెక్టార్లు రాష్ట్రంలో రైతుల సంఖ్య : 72,21,118 షెడ్యూల్డ్ కులాల రైతుల సంఖ్య : 7,13,038 షెడ్యూల్డ్ తెగల రైతుల సంఖ్య : 3,87,053 షెడ్యూల్డ్ కులాల రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం : 5,12,932 హెక్టార్లు షెడ్యూల్డ్ తెగల రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం : 4,77,432 హెక్టార్లు షెడ్యూల్డ్ కులాల చేతుల్లో సరాసరి విస్తీర్ణం : 1.80 హెక్టార్లు షెడ్యూల్డ్ తెగల చేతుల్లో సరాసరి విస్తీర్ణం : 3.08 హెక్టార్లు కౌలు రైతుల వివరాలు ఇలా.. – రాష్ట్రంలో వాస్తవ సాగుదారులు : 44 లక్షలకు పైగా – వీరిలో కౌలుదారులు : 32 లక్షల మందికి పైగా – ప్రభుత్వం చెబుతున్న లెక్క : 17 లక్షలు – కౌలుదారుల్లో అసలు భూమి లేనివారు : 7.5 లక్షల మంది – ఎకరం, అర ఎకరం లోపు : 8 లక్షలు – 3 నుంచి 5 ఎకరాల లోపు రైతులు : 7 నుంచి 8 లక్షల మధ్య (వీళ్లు 3 నుంచి 5 ఎకరాల వరకు కౌలుకు తీసుకుంటారు) – 20 ఎకరాల వరకు భూమి ఉండే రైతులు : సుమారు 10 లక్షల మంది(వీళ్లు కూడా మరో 20 ఎకరాల వరకు కౌలు చేస్తుంటారు) కౌలు రైతుకు రుణం ఇవ్వాలంటే.. – రుణ అర్హత పత్రం – పట్టాదార్ పాస్‌బుక్ – టైటిల్ డీడ్ – సాగు ధృవీకరణ పత్రం ఎదురయ్యే సమస్యలు.. – చాలామంది కౌలు రైతులు ఎటువంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు – కౌలు రైతుకు పంట రుణం ఇవ్వాలంటే భూమి యజమాని రుణం తీసుకోకుండా ఉండాలి – పట్టాదార్ పుస్తకం ఇచ్చేందుకు యజమాని ఇష్టపడడు. టైటిల్ డీడ్ అసలే ఇవ్వడు. అందువల్ల కౌలు రైతుకు పంట రుణం అసాధ్యంగా మారింది మరి ఎలా ఇవ్వొచ్చు.. – భూ యజమానికి రుణం కావాలంటే భూమి హామీగా ఇవ్వొచ్చు – కౌలు రైతుకు పంట హామీతో ఇవ్వొచ్చు – కౌలు రైతు, అసలు రైతు మధ్య సమన్వయం ఉండాలి – సమన్వయపరిచేలా రైతు సంఘాలు చొరవ తీసుకోవాలి చట్టం ఏమి చెబుతోంది? 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ఎల్ఇసీ కార్డు, పంట హామీపై లక్ష రూపాయల వరకు కౌలు రైతులకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉంది. వ్యక్తిగత పూచీకత్తుగా వేసిన పంటను పరిగణించవచ్చు. పెట్టుబడి రాయితీ, మార్కెటింగ్ సౌకర్యాలు వంటివి కూడా కౌలు రైతుకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, అది ఆయా బ్యాంకర్ల చిత్తశుద్ధి, రైతుసంఘాల సంఘటిత శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎల్ఇసీ కార్డులు ఉన్నప్పుడే రుణం పొందడానికి, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట నష్టపరిహారం పొందడానికి అర్హులు. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. – 2018–19లో 6,13,639 మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇచ్చి రుణాలు ఇవ్వాలన్నది ప్రతిపాదన – కానీ, ఇప్పటివరకు 1,72,892 మందికి మాత్రమే కొత్తకార్డులు ఇచ్చారు – 2018–19లో 5.50 లక్షల మంది కౌలు రైతులకు పంట సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నది లక్ష్యం – ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం : రూ.76,207 కోట్లు – దీర్ఘకాలిక రుణాల లక్ష్యం : రూ.30,108.71కోట్లు – ఇప్పటివరకు కౌలుదారులకు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్న రుణాలు : రూ.624 కోట్లు – అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కౌలు రైతులకు ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదు. -
సాగు చేయలేం..
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్లకు చెందిన కొండవీటి సీతయ్య సొంత భూమితోపాటు ఏటా పెద్ద ఎత్తున కౌలుకు సాగు చేస్తుంటారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో 230 ఎకరాలకుపైగా పంటలు సాగుచేయగా సరైన ధరలు లభించక రూ.30 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. సగటున ఎకరాకు రూ.13 వేలదాకా నష్టపోయారు. ఈ ఏడాది కౌలుకు భూములు తీసుకోవడం కష్టమేనని, రైతులు కౌలు ధర తగ్గించి ఇస్తే సాగు గురించి ఆలోచిస్తామని ఆయన అంటున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పల్లపాడు గ్రామ పరిధిలో 1,500 ఎకరాలవరకు సాగు భూమి ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం కౌలుకు సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభమై సాగు సమయం వచ్చినా 500 ఎకరాలకు మించి ఇంకా కౌలుకు తీసుకోలేదు. వర్షాలు పడి దుక్కులు దున్నాల్సి ఉన్నప్పటికీ కౌలుదారులు ఇంకా సంశయంలోనే ఉన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు, యద్దన పూడి, ఇంకొల్లు, చీమకుర్తి తదితర మం డలాల పరిధిలోనూ సాగుకు కౌలుదారులు ఆసక్తి చూపట్లేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడంతో.. బ్యాంకుల్లో తిరిగి రుణం పుట్టకపోవడంతో రైతులు మరింతగా అప్పుల పాలయ్యారు. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో పడిపోయారు. దీనికితోడు విత్తనాల నుంచి ఎరువులు, పురుగుమందుల వరకు ధరలు పెరిగిపోయి సాగు వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోగా.. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలూ లభించక రైతులు అప్పుల పాలై ఉసురు తీసుకుంటున్న దైన్య స్థితి నెలకొని ఉంది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ఎన్నో కష్టాలకోర్చి గతేడాది పంటలు సాగు చేసిన కౌలు రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. పెట్టిన పెట్టుబడి ఖర్చూ కూడా తిరిగి రాలేదు. కనీస మద్దతు ధర అమలు కాకపోగా.. ఇంకా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది సాగు చేసేందుకు కౌలుదారులు ముందుకు రావట్లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. చివరకు కృష్ణా, గుంటూరు, సాగర్, గోదావరి డెల్టాల కింద కూడా పంటల సాగుకు కౌలురైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. రెండు, మూడు పంటలు పండే పొలాల సాగుకూ కౌలుదారులు ధైర్యం చేయలేకపోతున్నారు. గతేడాది మిగిల్చిన చేదు అనుభవాలే వారిని సాగుకు ససేమిరా అనేలా చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కౌలు ధరలు 25 శాతం నుంచి 40 శాతం వరకు పడిపోయాయని భూయజమానులు ఆందోళన చెందుతున్నారు. సాగు సమయం ఆసన్నమైనా... జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. పలుచోట్ల దుక్కులు దున్నేందుకు అనువుగా పదునైనప్పటికీ కాడి కట్టలేదు, సాలు దున్నలేదు. సాధారణంగా ఉగాది ముగియగానే కౌలు ఒప్పందాలు జరుగుతాయి. తొలకరి జల్లులు కురిసేనాటికి పత్తి, మిరపలాంటి ఎండుకట్టె తొలగించి తొలి దుక్కులకు పొలాలను సిద్ధంగా ఉంచడం ఆనవాయితీ. వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్ సాగు ఆరంభమవుతుంది. కానీ, ఈ దఫా కృష్ణా, గోదావరి డెల్టాల్లో సైతం కౌలుకు భూములు తీసుకుని సాగు చేయడానికి రైతులు ముందుకు రావట్లేదు. కనీసం అడిగేవారు లేరు. దీంతో కౌలుధరలు అమాంతం పడిపోయాయి. సాధారణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి వసతి కలిగి వాణిజ్య పంటలైన పత్తి, మిరప పండే భూములకు ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.18 నుంచి రూ.37 వేల వరకు కౌలు ధరలు పలుకుతాయి. వరి తరువాత మినుము, సెనగ, పెసర, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగయ్యే భూములకు ఎకరానికి రూ.12 నుంచి రూ.18 వేల వరకు కౌలు ఉంటోంది. ఇప్పుడీ కౌలు ధరలు బాగా తగ్గిపోయాయి. గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో ఎకరం రూ.19 వేల నుంచి 20 వేల వరకు కౌలు ఉండేది. ఈ ఏడాది రూ.10 నుంచి రూ.12 వేలకు మించి తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. కౌలు ధర తరువాత నిర్ణయించుకుందామని, తొలుత సాగు చేయమని కోరుతున్నా కౌలుదారుల నుంచి ఆశించిన స్పందన రావట్లేదని భూయజమాని రామారావు ‘సాక్షి’కి చెప్పారు. రైతు, కౌలుదారు కూడా అయిన కె.సీతయ్య మాట్లాడుతూ గతేడాది రూ.18 వేలు చెల్లించానని, ఈ ఏడాది రూ.10 వేలకు కొన్ని ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కౌలు ఎలాఉన్నా ముందుగా సాగు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో ఈ ఏడాది మే, జూన్ రెండో వారం వరకు నీటి వసతి కలిగిన, ముంపునకు వీల్లేని మిరప పండే భూములను ఎంపిక చేసుకుని ఎకరానికి రూ.34 వేల నుంచి రూ.36 వేల వరకు కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నా అడిగేవారు కరువవుతున్నారని కొర్రపాటి రామకృష్ణ అనే యువరైతు చెప్పారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి తదితర మండలాల్లో గతంలో రూ.5,000 నుంచి పదివేల వరకు కౌలు ఉండేదని, ఇప్పుడు రెండు, మూడు వేలకు కూడా ఎవరూ అడగట్లేదని బండ్లమూడికి చెందిన ఎం.వెంకారెడ్డి చెప్పారు. గతేడాది ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతులు అసలు సాగు చేయకుండా అలాగే బీడుగా వదిలేశారని, ఈ సీజన్లో ఇప్పటివరకు ఎవరూ భూమిని అడగట్లేదన్నారు. గోదావరి డెల్టాలో ఇంతకన్నా దారుణ పరిస్థితులున్నాయి. సార్వా, దాళ్వాలో ఎకరానికి 70 నుంచి 80 బస్తాల దిగుబడి వచ్చే భూములను తీసుకోవడానికీ కౌలుదారులు ముందుకు రావట్లేదు. సార్వాలో 15 బస్తాలను పది బస్తాలకు తగ్గించినా స్పందన రావట్లేదని రైతు నేత త్రినాథ్‌రెడ్డి చెప్పారు. ఎకరానికి అయిదారు బస్తాల మేర కౌలును రైతులు తగ్గిస్తున్నారన్నారు. నీటివసతి ఉండి, అరటి సాగయ్యే, ఆదాయంపై నమ్మకమున్న వైఎస్సార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కౌలుకు కాసింత డిమాండ్ కొనసాగుతోంది. కాగా, వాణిజ్య పంటలు అయిన పత్తి, మిరప దిగుబడి బాగా వచ్చే పొలాలను మాత్రం ఎంపిక చేసుకుని మరీ తక్కువ కౌలుకు ఇచ్చేట్లయితే సాగు చేస్తామని రాష్ట్రంలో అక్కడక్కడా ముందుకు వస్తున్నారని భూయజమానులు చెపుతున్నారు. ఎకరానికి పాతిక వేలు నష్టం.... గతేడాది సెనగ జెజి–11 రకం క్వింటా రూ.8,000 పలికింది. ఇప్పుడు రూ.3,300 నుంచి రూ.3,400 వరకు ధర ఉంది. కాక్–2 రకం రూ.పదివేలు అమ్మింది. ఇప్పుడు రూ.4,000 పలుకుతోంది. ఎకరానికి సగటున ఏడు క్వింటాళ్ల దిగుబడి రాగా ధరల పతనంతో సుమారు రూ.25 వేల నష్టం వాటిల్లింది. దీంతో సెనగ పండే ప్రాంతాల్లో కౌలుదారులు సాగుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు తదితర మండలాల్లో గతేడాది ఎకరానికి రూ.25 నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించగా ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.17 వేలకు మించట్లేదు. పైగా సాగుకు ముందుకొచ్చేవారూ కరువయ్యారు. గతేడాది మొక్కజొన్న సాగుదారులకు ఎకరానికి రూ.5,000 నుంచి రూ.6,000 నష్టం వాటిల్లింది. మిరప సాగుదారులు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. పత్తి కూడా ముంచింది. ఎకరానికి సగటున రూ.15 వేలు నష్టం తప్పలేదు. ఎందుకీ పరిస్థితి.. గతేడాది కౌలుదారులకు ఎదురైన చేదు అనుభవాలే ఈ ఏడాది వారు సాగుకు ముందుకు రాకపోవడానికి కారణం. సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కౌలుతో కలుపుకున్నట్లయితే సాగు వ్యయం కౌలుదారులకు ఎక్కువ. దీనికితోడు వారికి నేరుగా బ్యాంకుల్లో రుణం పుట్టేదారి లేకుండాపోయింది. ఇందుకోసం రుణ అర్హత పత్రాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా అది ఆచరణలో పూర్తిగా అమలు కావట్లేదు. భూయజమానులే బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందుతున్నందున కౌలుదారులకు అప్పులు లభించని పరిస్థితి. దీంతో బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేయాల్సి వస్తోంది. ముందుగా అప్పులు తీసుకున్నందున వ్యాపారులు, ఎరువుల వ్యాపారులకు తమ పంట ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎక్కువ మంది కౌలుదారులకు ఉంటోంది. గతేడాది పంటలు సరిగా పండకపోవడం, దీనికితోడు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో పెట్టుబడులూ తిరిగి రాలేదు. దీంతో ఈ ఏడాది కౌలుకు సాగు చేసేందుకు సాగుదారులు ముందుకు రావట్లేదు. కౌలుదారులు ఎందరు? రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 లక్షల మందికిపైగా కౌలుదారులున్నారని ప్రభుత్వం అంటోంది. కానీ ప్రభుత్వం నియమించిన రాధాకృష్ణ(సెస్ అధ్యక్షుడు) కమిటీ 2016లో తేల్చిన కౌలుదారుల సంఖ్య దాదాపు 32 లక్షల పైచిలుకు. వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ రైతు సంఘాల అంచనాల ప్రకారం 25 లక్షలమంది పైనే కౌలుదారులు ఉన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 40 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా.. ఇందులో అత్యధిక శాతం కౌలుదారుల ద్వారానే సాగైంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో 50 శాతం సాగు కౌలుదారుల చేతుల్లో.. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో 80 శాతం సాగు కౌలుదారుల చేతుల్లోనే ఉంది. వృద్ధి శూన్యం... రాష్ట్రప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయేతప్ప వ్యవసాయ రంగంలో వృద్ధి లేనేలేదు. సాగులో, ఉత్పత్తుల్లో, ఆదాయంలో.. ఎందులోనూ వృద్ధి లేకపోగా గత నాలుగేళ్లుగా తిరోగమనం కొనసాగుతోంది. ఉత్పత్తి వ్యయం కన్నా మద్దతు ధరలు 20 శాతం తక్కువ. పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధరకన్నా 20 శాతం తక్కువ ధరలు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తులతోసహా అన్ని పంటల ధరలు పడిపోయాయి. ఏటా కౌలుదారులు, సాగుదారులు తగ్గుతున్నారు. దీంతో కౌలు ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్రామాల్లో భూముల ధరలు పడిపోయాయి. బ్యాంకుల్లోని రైతుల బంగారం వేలం వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వ్యవసాయరంగం వృద్ధి దిశగా ఉందని తప్పుడు లెక్కలు చెపుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎగపడటం లేదు... గతంలో మాదిరి సాగుకు కౌలుదారులు ఎగపడటంలేదు. వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రానందున కౌలుధర కూడా తగ్గించాలని ఆశిస్తున్నారు. రుణ అర్హతపత్రాలు సకాలంలో ఇచ్చి బ్యాంకర్లు రుణాలు వాస్తవ సాగుదారులకు ఇవ్వాల్సిన అవసరముంది. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నా కౌలుదారుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. –నాగబోయిన రంగారావు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కందకాలతో నీటి లభ్యత పెరిగింది!
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు. 3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు. -
సాయం మాకేదీ?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయ భూములు వాస్తవంగా సాగు చేస్తున్నది తామేనని.. తమకు పెట్టుబడి సాయం అందజేయాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 1956 కౌలుదారు చట్టం ప్రకారం కౌలు రైతులకు హక్కులున్నాయని, తమను గుర్తించి, కార్డులు ఇచ్చి ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. సాగు చేసేవారికి ఇవ్వరా..? వచ్చే ఖరీఫ్ నుంచి రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సాగు యోగ్యమైన భూములన్నింటికీ ఈ సాయం అందుతుంది. అయితే ఈ పథకంలో ఆ భూముల యజమానులైన రైతులకే సొమ్ము ఇవ్వనున్నారు. అయితే చాలా మంది పెద్ద రైతులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు తమ భూములను సొంతంగా సాగు చేయకుండా కౌలుకు ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ సాయం కౌలురైతులకు అందకుండా.. భూయజమానులకే అందుతుంది. రాష్ట్రంలోని 71.72 లక్షల రైతులకు సంబంధించి 1.42 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో సాగుయోగ్యమైన భూములకు ఎకరాకు ఒక్కో సీజన్లో రూ.4 వేల చొప్పున రూ.8 వేల ఆర్థిక సాయం అందుతుంది. దీంతో వాస్తవంగా సాగు చేసే తమకు పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమ ని కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. 14 లక్షల మంది.. రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం తెలంగాణలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వారు ఒక్కొక్కరు ఎకరం నుంచి నాలుగైదు ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. కానీ కౌలు రైతులకు పెట్టుబడి పథకం వర్తింపజేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. 1956 కౌలుదారు చట్టం ప్రకారం కౌలు రైతులకు హక్కులున్నాయని, వారిని గుర్తించి పెట్టుబడి పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పథకం స్ఫూర్తి దెబ్బతింటుంది! వ్యవసాయశాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 61.96 శాతం మంది సన్నకారు రైతులే. వారి చేతిలో సరాసరి ఎకరా నుంచి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక 23.9 శాతం ఉన్న చిన్నకారు రైతుల చేతిలో రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూమి ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్న 85.86 శాతం మంది సన్న, చిన్నకారు రైతుల చేతిలో కలిపి 55.45 శాతం భూమి ఉంది. అయితే భూమి తక్కువగా ఉన్న సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు కొందరు కౌలుదారులుగా ఉన్నారు. ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులు, భూములు సాగు చేయని ధనికులు, వ్యాపారస్తులు, ఇతర రంగాలవారు తమ భూములను కౌలుకు ఇస్తారు. కౌలుదారులే ఆ భూములపై పెట్టుబడి పెట్టి, పంటలు పండిస్తారు. పంట విక్రయించిన అనంతరం భూయజమానికి కౌలు సొమ్ము చెల్లిస్తారు. అంటే వాస్తవంగా పెట్టుబడి సాయం అందాల్సింది కౌలు రైతులకేనని.. సాగు చేయని యజమానులకు ఎందుకని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌలుదారులకు సాయం ఇవ్వకపోతే పెట్టుబడి పథకం స్ఫూర్తి దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కౌలుదార్లను గుర్తిస్తేనే సాధ్యం తమ వద్ద పంట రుణాలు తీసుకునే రైతుల ఆధారంగా బ్యాంకర్లు కౌలు రైతుల సంఖ్యను 14 లక్షలుగా గుర్తించారు. కానీ ప్రభుత్వం కౌలుదారుల చట్టం మేరకు కౌలు రైతులను గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే పెట్టుబడి సాయం అందించడానికి వీలవుతుంది. దీంతో ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కోరారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినాల్సి వస్తుందని హెచ్చరించారు. -
సేద్యమే వేదం.. బతుకు భారం
వాస్తవ సాగుదారులు మన కౌలుదారులు రాష్ట్రంలో ప్రతి 30 గంటలకు ఓ కౌలు రైతు ఉరికొయ్యకు వేళ్లాడుతున్నాడు. రెండు నెలల వ్యవధిలో 43 మంది చనిపోయారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు 23 మంది చనిపోతే ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటికి అంటే అక్టోబర్ 31 నాటికి మరో 20 మంది చనిపోయారు. ఇవి కేవలం దినపత్రికల్లో వచ్చిన వివరాల మేరకే. ఇక నమోదు కానివి, మారుమూల ప్రాంతాల్లో అనామకంగా ముగిసిపోయే జీవితాలు మరెన్నో... సాక్షి, అమరావతి: అటు ప్రకృతి కరుణించక, ఇటు పాలకులు దృష్టి సారించక వ్యవసాయం జూదంగా మారింది. ‘ఓ సంతోషం లేదు.. సుఖం లేదు.. ఇదేం జీవితం..’ అంటూ భూములున్న రైతులు విసిగి వేసారి సాగు వదిలేసి మరో దారి చూసుకుంటున్నారు. మరో దారి లేని పరిస్థితుల్లో వ్యవసాయాన్నే నమ్ముకుని పొలాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు బడుగు రైతులు. పగలూ రాత్రి ఒళ్లు హూనమయ్యేలా పనిచేస్తున్నా కాయకష్టమే మిగులుతోంది తప్ప ఎదుగూ బొదుగూ లేని జీవితం వారిది. ఏటేటా పెరుగుతున్న కౌలురేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్ ధరల పెరుగుదలతో కుదేలవుతున్నారు. వీరి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. రుణ అర్హత కార్డులు ఇవ్వరు.. ఒకవేళ ఇచ్చినా రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రారు.. పంటల పెట్టుబడికి వడ్డీ వ్యాపారులే గతి. అతివృష్టితోనే, అనావృష్టితోనో పంట పాడైతే పరిహారం దక్కదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువులు, పెళ్ళిళ్లు వారికి పెనుభారంగా మారుతున్నాయి. మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న అప్పుల భారంతో దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరి జీవితాలు ఇంతేనా? వీరి ఆత్మహత్యలు నివారించే మార్గాలే లేవా? ప్రభుత్వం ఏం చేస్తోంది..? కాయకష్టం తప్ప కాసులు మిగిలిందెక్కడ? ‘‘నేనో సన్నకారు కౌలు రైతును. 16 ఏళ్లుగా కౌలు చేస్తున్నా.. పిల్లలు పెద్దోళ్లు అయ్యారు తప్ప చేతిలో నాలుగు రాళ్లు మిగిలింది లేదు. పిల్లలను బాగా చదివించాలనుకున్నా.. పరిస్థితి ఇట్టాగుంటే ఏం సదివిస్తాం? కంటి నిండ నిద్రా లేదు.. కడుపారా తిన్నదీ లేదు.. ఎద్దులతో దున్నినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చూశా. ఆ నాటి పరిస్థితులు ఈ వేళ లేవు. ఇవ్వాళ అన్నీ కొనుక్కోవాల్సిందే. రెండేళ్లు నీళ్లు లేక నాట్లు వేయలేదు. అంతకు ముందు అధిక వర్షాలతో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. చూసి చూసి కళ్లు కాయలు కాశాయి తప్ప ఇంతవరకు ఏ సాయం అందలేదు. ఒకేడాది అయితే పంట బాగా పండింది. కష్టాలన్నీ తీరుతాయనుకున్నా. పంటను మార్కెట్‌కు తీసుకుపోయే సరికే ధర ఉన్నట్లుండి పడిపోయింది. ఆ భూదేవినే నమ్ముకున్నా.. నాకు సేద్యం చేయడం తప్ప మరో పని రాదు. ఈ ఏడాది కూడా పంట వేశాను. ఎలా ఉంటుందో మరి. రెండు గేదెలుండబట్టి సరిపోయింది గానీ లేకుంటే ఆకలి దప్పులతో ఎప్పుడో పోయేవాళ్లం. మాలాంటోళ్ల కోసం సర్కారోళ్లు ఏమేమో చేసేస్తున్నారని చెబుతున్నారే కానీ ఏం చేశారో తెలియడం లేదు.’’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన కౌలు రైతు పల్లపోతు రెడ్డయ్య వాపోయాడు. రాష్ట్రంలోని కౌలు రైతులందరిదీ ఇదే ఆవేదన. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వ సర్వేల ప్రకారమే రాష్ట్రంలోని 93 శాతం మంది రైతులు రుణగ్రహీతలుగా ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందడం లేదు. రాష్ట్రంలో గ్రామీణ జీవితం భూమితో ముడిపడి ఉంది. ఇప్పటికీ 63 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ప్రధానంగా సాంకేతికం, వ్యవస్థాగతం అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంది. కౌల్దారీ వ్యవస్థ రెండో రకానికి చెందినది. కమతాల మెరుగుదల, కౌలు కాల పరిమితి, నియంత్రణతో పాటు భూ యజమాని, కౌల్దారు మధ్య సత్ సంబంధాలు, కౌలు రైతుకు భద్రత ఉంటే వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి వీలవుతుంది. వ్యవసాయ రంగంలో 1991 తర్వాత విధానపరమైన మార్పులు అనేకం చోటు చేసుకున్నాయి. భూములపై సరిపడా ఆదాయం రాకపోవడం, భూమి ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో భూస్వాములు క్రమంగా తమ భూముల్ని కౌలుకు ఇచ్చి పట్టణాల బాట పట్టారు. కొన్ని ప్రాంతాల్లో సొంత భూమి ఉన్న రైతులకు పంటల్ని సాగు చేయడం కష్టతరమైంది. అప్పటివరకు భూస్వాముల పొలాల్లో పని చేసిన కూలీలు సైతం సొంత భూమి కోసం ఆరాటపడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన భూ యజమానులు తమ పొలాన్ని కౌలుకు, పాలికి ఇవ్వడం ప్రారంభించారు. కౌలు రైతులే అధికం దేశంలో ప్రస్తుతం ఉన్న 9 కోట్ల రైతు కమతాల్లో 10 శాతానికిపైగా కౌలు రైతుల చేతుల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా 34 శాతం వరకు కౌలు రైతుల చేతుల్లో ఉన్నట్టు అనధికార వర్గాల సమాచారం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రాష్ట్రంలోని ప్రస్తుత సాగుదార్లలో 70 శాతం మంది కౌలుదారులు. వీరిలోనూ అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారే. తాజా అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కానీ, 24 లక్షల మంది ఉన్నట్టు రైతు సంఘాల అంచనా. (వాస్తవానికి వీరి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఎకరం.. రెండెకరాల భూమి ఉన్న రైతులు మరో రెండు మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీరిని కౌలు రైతులుగా గుర్తించడం లేదు) భూ అధీకృత చట్టం ప్రకారం రైతులకు కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డు ఉన్న వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు ఇవ్వాలి. కానీ అవేవీ ఇప్పటికీ అమలు కావడం లేదు. గత ఏడాది 11 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం కూడా ఇవ్వలేదు. 2016–17లో రూ.80 వేల కోట్ల పంట రుణాలలో 80 వేల మంది కౌలు రైతులకు కేవలం రూ.202 కోట్ల రుణం మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగం మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే సాగు కమతాల విస్తీర్ణంపై వ్యవసాయ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగటున రైతుకున్న భూమి 1.06 హెక్టార్లు (సగటు సాగు విస్తీర్ణం 2.64 హెక్టార్లు). 70 శాతానికి పైగా గ్రామీణ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల మంది రైతులున్నారనుకుంటే వారిలో 49,83,611 మంది సన్నకారు రైతులు. 15,91,112 మంది చిన్నకారు, 7,96,198 మంది ఓ మోస్తరు మధ్యతరహా రైతులు. మధ్యతరహా 2,30,419 మంది కాగా, 19,878 మంది పెద్ద రైతులు ఉన్నారు. సాగు పరంగా చూస్తే సన్నకారు రైతుల చేతిలో 26.68 శాతం భూమి, చిన్నకారు రైతుల చేతుల్లో 27.80 శాతం, ఓ మోస్తరు మధ్య తరహా రైతుల చేతిలో 25.93 శాతం, మధ్యతరహా రైతుల చేతిలో 15.83 శాతం, పెద్ద రైతుల చేతిలో 3.75 శాతం భూమి ఉన్నట్టు అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో 66 శాతం భూమిని సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు. విస్తృత చర్చ జరగాలి రాష్ట్రంలో కౌలు రైతుల దుస్థితిపై విస్తృతంగా చర్చ జరగాలని రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాల అమలులో అడ్డంకులపై అంశాలవారీ చర్చ జరగాలని చెబుతున్నారు. ఓ వైపు పొలం కౌలుకు తీసుకున్నందుకు చెల్లించే డబ్బు కోసమే తొలుత అప్పు చేయాల్సి వస్తోంది. ఆపై పంట పెట్టుబడి కోసం రుణదాతల మీద ఆధారపడుతున్నారు. రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ఏ తరహా అడ్డంకులు వస్తున్నాయి.. వాటినెలా పరిష్కరించాలనే విషయంపై పాలకులు మరింతగా దృష్టి సారించి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. వీటి గురించి పాలకులు పట్టించుకోక పోవడం వల్లే కౌలు రైతుల అప్పులు ఏటికేటా పెరిగిపోతూ.. తీర్చే మార్గం కనిపించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. కౌలు రైతుల డిమాండ్లు - 2011 కౌల్దారి చట్టం ప్రకారం కౌలురైతులకు రుణ అర్హత పత్రాలు ఇవ్వాలి. - స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీలేని పంట రుణం లక్ష రూపాయలు ఇవ్వాలి - ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు కౌలు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలి - పంటల బీమా పథకం కింద కౌలు రైతులు చెల్లించే బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి - ఈ–క్రాప్ బుకింగ్‌లో కౌలురైతుల పేర్లను నమోదు చేయాలి - ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రక్రియను సులభతరం చేయాలి - స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలి. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలి ఆగని ఆత్మహత్యల పరంపర... కౌలు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు కన్నుమూసిన రైతుల వివరాలను చూస్తే కర్నూలు జిల్లా ముందుంది. ఈ జిల్లాలో 8 మంది చనిపోతే గుంటూరు జిల్లాలో ఆరుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, వైఎస్సార్, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. ఖరీఫ్ పంటలు చేతికి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. -
కౌలు రైతుల మరణ వేదన
కౌలు రైతుకు కనికరం లభించడం లేదు. అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలకులు శీతకన్ను వేశారు. ఎవరూ ఏం చేసినా వీరికి పూర్తి స్థాయిలో పథకాలు అందక.. పంటపై పెట్టిన పెట్టుబడులు రాక దినదినగండంగా మారింది. పంట చేతికి అందేవరకు నిత్యం నరకయాతన అనుభవిస్తూ వ్యవసాయ జూదంలో చివరికి ఓడిపోయి ఈ లోకాన్ని శాశ్వతంగా వీడుతున్నాడు. సాక్షి, కడప: పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆందోళనకర పరిస్థితుల్లో దిక్కుతోచక మరణమార్గం ఎంచుకుంటున్నా భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు పెట్టుబడులు భారీగా పెట్టినా పంట దిగుబడి రాకపోవడం...తెచ్చిన అప్పుల భారం పెరిగిపోవడంతో తీర్చే దారి తెలియక కౌలు రైతు ఉరి కొయ్యను ఎంచుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకుని కౌలు రైతు తనువు చాలించినా తర్వాత కూడా నిబంధనల సాకుతో కుటుంబానికి పరిహారం అందించకుండా ప్రభుత్వం పరిహాసం ఆడుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. కనికరమేదీ.. కౌలు రైతుల విషయంలో ఎవరూ కనికరం చూపడం లేదు. బ్యాంకులకు వెళ్లినా గుర్తింపు కార్డులు లేవని రుణాలు ఇవ్వకపోవడం..బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడంతో రైతుపై భారం పెరుగుతోంది.అంతంతమాత్రంగా వచ్చి న దిగుబడితో అప్పులు తీర్చలేక చావే శరణ్యమని పలువు రు రైతులు బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారు. జిల్లాలో పంటలు పండక, సక్రమంగా రుణమాఫీ జరగక, పెరిగిన అప్పుల భారంతో ఇప్పటికే 40–45 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో కౌలు రైతులే 12 నుంచి 15 మంది చనిపోయినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. పరిహారం..పరిహాసం జిల్లాలో అనేక మంది రైతులు మృత్యువాత పడుతున్నారు. సాకు ఏదైనా పరిహారం అందని విషయం మాత్రం వాస్తవం. అన్నిచోట్ల పంటలపై పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక అప్పుల బాధతో రైతన్నలు తనువు చాలిస్తే ఇప్పటికీ పరిహారం మాత్రం కేవలం కొద్దిమందికి మాత్రమే అందించారు. కౌలు రైతుల విషయానికి వస్తే అధికారికంగా ఒకరినే గుర్తించారు. అయితే కౌలు రైతులు అనేక మంది చనిపోతున్నా..గుర్తింపుకార్డులు లేవని...ప్రభుత్వ గుర్తింపు లేదని చెబుతూ అందించే పరిహారానికి రైతు కుటుంబాలను దూరం చేస్తున్నారు. పరిహారం విషయంలోనూ అధికారులు పరిహాసమాడుతున్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. కౌలు రైతుల కుటుంబాల బాధలు వర్ణనాతీతం.కౌలురైతుల మరణానంతరం కుటుంబాలు ఎలా ఉన్నాయన్న పలుకరింపు కూడా లేదు. పరిహారం రాక...తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబ పెద్దను పోగొట్టుకున్న కుటుంబాలు నిత్యం నరకయాతనతో అల్లాడిపోతున్నాయి. మానవతా దృక్పథంతోనైనా తనువు చాలించిన కుటుంబాలకు పరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేయాలని పలువురు రైతు కుటుంబాలు సూచిస్తున్నాయి. నేటికీ పరిహారం అందలేదు నా పేరు మంగమ్మ. రాయచోటి మండలం, శిబ్యాల గ్రామం. సుండుపల్లె మండలంలో 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం.పంటలు పండక..పెట్టుబడులు రాక సుమారు రూ.7లక్షల వరకు అప్పులు మిగిలాయి. మనస్థాపంతో నా భర్త కేతమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది జులై 23వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు.కుటుంబ పెద్దను కోల్పోడంతో కుమారున్ని చదువు మాన్పించాల్సి వచ్చింది.కుమార్తెను అష్టకష్టాలు పడి చదివిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై కనికరం చూపి పరిహారాన్ని అందించాలి. -
దా‘రుణ’ స్థితి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ రైతు లాగానే అన్ని పనులూ చేస్తున్నా ఆ అన్నదాతకు వచ్చే రాయితీలు, సంక్షేమ పథకాలు పొందలేక చతికిలపడుతున్నారు. ప్రభుత్వ సాయం మాట పక్కన పెడితే కనీస గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కౌలు రైతులు దాదాపుగా 2లక్షలకు పైబడి ఉన్నట్లు రైతు సంఘాలు చెబుతుంటే అధికారులు మాత్రం యాభై వేల మందే ఉన్నట్లు లెక్కలు చూ పుతున్నారు. అయితే ఇందులో ఇప్పటివరకు లోన్ ఎలిజిబులిటీ (ఎల్ఈసీ) కార్డులు 18వేల మందికి,సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ (సీఓసీ) కార్డులు 12,500 మందితో కలిపి మొత్తం 30,500 మం దికి కార్డులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సుమారు 1.70 లక్షల కౌలుదారులు గుర్తింపు కార్డులకు నోచుకోక రాయితీలు పొందలేకపోతున్నారు. కౌలు రైతుల చట్టం 2011 ప్రకారం ఎలాంటి కార్డులు లేకున్నా భూ యజమాని రుణంతో సంబంధం లేకుండా రు ణం ఇవ్వాలి. కానీ అలాంటి చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కేసి గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే రుణం మంజూరు చేయాలని నిబంధన పెట్టడంతో ఏ ఒక్క కౌలు రైతు రుణం తీసుకోలేకపోతున్నారు. సరిపోని రుణం భూ యజమానుల మాదిరిగానే కౌలు రైతులకు పంట పండించేందుకు అయ్యే ఖర్చు రూ.30వేలు ఉంటుంది. ప్రభుత్వం అలా రుణం మంజూ రు చేయకుండా ఐదుగురు నుంచి ఏడుగురు కౌ లు రైతులు కలిపి ఒక ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి గ్రూప్‌కి రూ.70వేలు చొప్పున ఇస్తున్నారు. దీని ప్రకారం ఒక్కొక్కరికీ రూ.10వేలు మాత్ర మే అందుతోంది. అది దేనికీ సరిపోవడం లేదు. అప్పివ్వని బ్యాంకులు కౌలు రైతులకు రుణం మంజూరు చేయాలని క లెక్టర్ చెప్పినా కో ఆపరేటివ్ బ్యాంకులు తప్పితే మరే ఇతర జాతీయ బ్యాంకులు రుణం ఇవ్వ డం లేదు. రైతులు రుణాలు చెల్లించకుంటే బ్యాంకు అధికారుల పదోన్నతులు, ఇంక్రిమెం ట్ల మీద దాని ప్రభావం పడుతుందని పూర్తిగా రుణాల ఇచ్చేందుకే ఎగనామం పెట్టేశారు. దీం తో అప్పుల కోసం బయట వ్యక్తులను ఆశ్రయిం చడంతో ఇదే అదనుగా రూ.2కి పైగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఓ పక్క కౌలు చెల్లించాలి, మరో పక్క వడ్డీ చెల్లించాలి పంట బాగా పండితే సరే లేకుంటే మరణమే శరణ్యమవుతోంది. ప్రదక్షిణ చేయాల్సిందే నాకు సెంటు భూమి లేదు. ఏటా రెండు మూడు ఎకరాలు కౌలుకి తీసుకుని పండిస్తాను. దాదాపుగా పదేళ్లుగా ఇలాగే చేస్తున్నాను. ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇవ్వలేదు. కార్డు కావాలని ప్రతి రోజు రెవెన్యూ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. కార్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి రుణం తీసుకోలేపోయాను. – లబ్బ జగ్గారావు, కౌలు రైతు, కోమర్తి గ్రామం, నరసన్నపేట మండలం -
మద్దికెరలో కౌలు రైతుల ధర్నా
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మద్దికెర తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. ఈ ఆందోళనకు రైతు సంఘం, సీపీఐ నేతలు నాయకత్వం వహించారు. -
మహిళా రైతు ఆత్మహత్య
కమలాపూర్ మండలం గోపాల్‌పూర్‌లో మంగళవారం కుడుతుల సత్తమ్మ(50) అనే మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. కౌలుకు తీసుకున్న పొలంలో పంట సరిగా పండక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. -
కౌలు రైతుల కష్టాలు
- రుణాలివ్వని బ్యాంకులు - బ్యాంకు నిబంధనలు పట్టించుకోని ప్రభుత్వం - గత ఏడాది వంద మందికే రుణాలు - ఈ ఏడాది అవీ అందని పరిస్థితి బ్యాంకు రుణాలు అందకపోవడంతో జిల్లాలో కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు. కౌలు రైతులందరికీ రుణాలిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పినా బ్యాంకులు మాత్రం మొండిచేయి చూపాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. సాక్షి, చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన కౌలు రైతులు 5,626 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాలో 5,626 మంది కౌలు రైతులను గుర్తించి ఏడాది కాలపరిమితితో రుణ అర్హత కార్డులను మంజూరు చేసింది. ఎటువంటి ష్యూరిటీ లేకుండా అందరికీ రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో వంద మంది రైతులకు రూ.30 లక్షల లోపు రుణాలు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులిపేసుకున్నాయి. మిగిలిన 5,526 మంది కౌలు రైతులకు మొండిచేయి చూపాయి. బ్యాంకుల చుట్టూ పదేపదే తిరిగి రైతులు విసిగిపోయారు. చేసేది లేక కౌలు రైతులు మిన్నకుండిపోయారు. ఈ ఏడాదైనా రుణాలందేనా? ప్రభుత్వం ఈ ఏడాదైనా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రుణాలు అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా కౌలు రైతులకు ఇచ్చే విషయంలో బ్యాంకులు నిబంధనలను బూచిగా చూపుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి సూచనలు చేసినా పట్టించుకోవడంలేదన్నది బ్యాంకుల ఆరోపణ. ప్రధానంగా రుణ అర్హత కార్డుల కాలపరిమితిని ఏడాదికి బదులు మూడేళ్లకు పెంచాలి. కౌలు రైతులందరికీ రుణాలు అందించేందుకు వీలుగా రుణహామీ నిధిని (క్రెడిట్ గ్యారంటీ ఫండ్) ఏర్పాటు చేయాలి. కౌలు రైతులకు మంజూరు చేసే పంట రుణాల నుంచి బ్యాంకులు కొంతమొత్తాన్ని ప్రీమియం కింద రాష్ట్ర ప్రభుత్వానికి జమచేస్తే ప్రభుత్వం అందుకు తగ్గ మ్యాచింగ్ గ్రాంట్‌ను రుణహామీ (క్రెడిట్ గ్యారంటీ) కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటే ఈ నిధి వినియోగంపై విధివిధానాలను రూపొందిస్తామని బ్యాంకులు తెలిపాయి. దీంతో పాటు కౌలు రైతుల రుణాల వసూళ్లలో బ్యాంకులకు సహకరించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, స్వయం సహాయక బృందాలతో ప్రభుత్వం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో బ్యాంకులు కౌలు రైతులకు రుణాల మంజూరులో వెనుకడుగు వేశాయి. ఈ సీజన్‌కైనా బ్యాంకుల సూచనలు పాటించి కౌలు రైతులకు రుణాలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
లక్షమందిని కౌలుకోనివ్వరా!
పిలిచింది వెయ్యిమందిని.. వండింది వందమందికి అన్నట్లు..జిల్లాలో కౌలు రైతులు లక్షమందికి పైగా ఉంటే ప్రభుత్వం మాత్రం వారిని వేలల్లోనే గుర్తిస్తోంది. భూమిలేని, తక్కువ భూమి ఉన్న రైతులుపెద్దరైతుల దగ్గర భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుని ఉపాధి పొందుదామని యాతన పడుతుంటే సాయం చేయాల్సిన ప్రభుత్వం వారిని అసలు గుర్తించకుండా పక్కన పెడుతోంది. గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన రొంగలి గంగునాయుడు, ఎలిశెట్టి సత్యనారాయణలు గ్రామంలో ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వారికి ఇప్పటికీ కౌలు రైతు రుణార్హత కార్డులివ్వడం లేదు. పలుమార్లు అధికారులను అడిగినా ఇంకా కార్డులు రాలేదని అంటున్నారని వీరు వాపోతున్నారు. మరి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయాలంటే వీరు బ్యాంక్ అప్పు తీసుకోవాలి. అది కావాలంటే రుణార్హత కార్డులుండాలి. ఈ గ్రామంలో సుమారు 21 మందికి కార్డులు లేవు. సీతానగరం మండలం రామవరం గ్రామానికి చెందిన పెంట సింహాచలం, బుడతనాపల్లిలోని రెడ్డి దేముడులుకు గత ఏడాది కౌలు రైతుల రుణార్హత కార్డులు ఇచ్చారు. దీంతో ఎంతో సంతోషించిన వారు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఆ కార్డుల మీద ఒక్క పైసా రుణమూ ఇవ్వలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఫైనాన్షియర్ల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి వ్యవసాయం చేసి ఫలసాయం అమ్మగా వచ్చిన సొమ్ము..అప్పులకు, వడ్డీలకే చాలలేదు. ఈ పరిస్థితి ఈ రెండు మండలాల్లోని నలుగురు రైతులదే కాదు. జిల్లాలోని వేలాది మంది కౌలు రైతుల దుస్థితి. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ద్వారా రుణాలు ఇవ్వాల్సి ఉండగా వారి గుర్తింపే జరగడం లేదు. గత ఏడాది కన్నా ఈ ఏడాది కౌలు రైతుల గుర్తింపు గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది 19వేల మందికి పైగా కౌలు రైతులను అధికారులు గుర్తిస్తే ఇటీవల చేపట్టిన గుర్తింపులో కేవలం 15,561 మందిని మాత్రమే గుర్తించారు. క్షేత్రస్థాయిలో సక్రమంగా గ్రామసభలు నిర్వహించకుండా తూతూ మంత్రంగా పాత కౌలుదారులనే ఏటా చూపించడం వల్ల పూర్తిస్థాయి కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదు. ఇతర రైతుల వద్ద భూమిని తీసుకుని సాగు చేస్తున్న రైతులు జిల్లాలో దాదాపు లక్ష మందికి పైగా ఉంటారు. ఏటా వీరిని గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. గ్రామాల్లో వీఆర్వోలకు తెలిసిన కొందరి రైతుల పేర్లను మాత్రమే తీసుకుని కార్డులు ప్రింట్ చేసి ఇస్తున్నారు. దీని వల్ల ఏటా మారుతున్న కౌలు రైతులకు మాత్రం గుర్తింపు దక్కడం లేదు. ప్రభుత్వం గుర్తించిన మేరకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదు. తక్కువ మందినైనా కౌలు రైతులుగా గుర్తిస్తున్న అధికారులు ఆ మేరకు కూడా వారికి రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులు కూడా రుణాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం గత ఏడాది గుర్తించిన కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలంటే కనీసం రూ.12 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చింది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్ష మంది రైతులకు రుణాలు ఇవ్వాలంటే కనీసం రూ.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏటా ఈ కౌలు రైతులు మాత్రం రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గుర్తింపు కార్డులు మండలాలకు చేరుతున్నాయి. కానీ వాస్తవానికి కౌలు రైతులెంత మంది ఉన్నారో అంతమందికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి అదే పద్ధతిలో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమపరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కౌలు రైతులు వాపోతున్నారు. -
నేలరాలిన మామిడి ఆశలు
- వందల ఎకరాల్లో నష్టం - పలు చోట్ల విరిగిపడిన మామిడి చెట్లు - ఆందోళనలో కౌలు రైతులు జైపూర్/తాండూర్/చెన్నూర్‌రూరల్/నెన్నెల : జిల్లాలో ఆదివారం రాత్రి గాలి దుమా రం, వాన బీభత్సం సృష్టించింది. మామిడి చెట్లపై ఉన్న కాయలన్నీ నేలరాల్చింది. కాయలన్నీ రాలిపోవడంతో రైతుల ఆశలు నేలరాలారుు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జైపూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలారుు. మండలంలోని ఇందారం, టేకుమట్ల, రసూల్‌పల్లి, మిట్టపల్లి, దుబ్బపల్లి, జైపూర్, భీమారం, బూరుగుపల్లి, నర్సింగాపూర్, ఖాజిపల్లి, దాంపూర్, రెడ్డిపల్లి, ధర్మారం, మద్దికల్, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. వేలాది రూపాయాలు ఖర్చు చేసి తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు రాలిన కాయలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాండూర్ మండలం అచ్చలాపూర్, బోయపల్లి, తాండూర్, రేపల్లెవాడ, చౌటపల్లి మదారం తదితర గ్రామాల్లోని 800 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి గాలివానకు మామిడికాయలు నేలరాలారుు. కొద్ది రోజుల్లో కాయలు కోసి మార్కెట్‌కు తరలించాలని అనుకుంటున్న రైతుల ఆశలకు గండికొట్టింది. చెన్నూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన గాలి దుమారానికి సుద్దాల, సంకారం, కొమ్మెర, ఎర్రగుంటపల్లి, నాగాపూర్, కన్నెపల్లి, కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలారుు. అకాల వర్షాలు, గాలిదుమారంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు వాపోతున్నారు. నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, చిత్తాపూర్, మెట్పల్లి, నందులపల్లి, ఘన్పూర్, గొళ్లపల్లి, మైలారం, కొత్తూర్, దుబ్బపల్లి, జంగాల్‌పేట, గుండ్లసోమారం, జోగాపూర్, కోనంపేట గ్రామాల్లో చెట్లపై ఉన్న కాయల్లో 90శాతం నేలరాలారుు. మూడు వేల ఎకరాల్లోని తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గంట సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది. -
రుణమే యమపాశమై..
మోమిన్‌పేట: ఆరుగాలం కుటుంబీకులంతా రెక్కలుముక్కలు చేసుకున్నారు. పంటలు బాగా పండితే అప్పులు తీర్చొచ్చని భావించారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో పెట్టుబడులు కూడా సరిగా రాలేదు. అప్పులు పెరిగాయి. వాటిని తీర్చేమార్గం కానరావడం లేదని మనోవేదనకు గురైన ఓ కౌలురైతు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని ఏన్కతలలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోతురాజు పాండు(39), అనిత దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాండుకు గ్రామంలో సెంటు భూమి కూడా లేకపోవడంతో గ్రామంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఏడాది ఖరీఫ్ సీజన్లో పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేశాడు. కుటుం బీకులు ఆరుగాలం కష్టపడ్డారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పాండు పెట్టుబడి కోసం తెలిసిన వారి వద్ద రూ. లక్ష అప్పు చేశాడు. స్థానికంగా ఓ బ్యాంకులో భార్య నగలు తనఖా పెట్టి మరో రూ. 50 వేలు రుణం తీసుకున్నాడు. పంటలు బాగా పండితే అప్పులు తీర్చొచ్చని ఆశించిన పాండుకు నిరాశే మిగిలింది. అప్పులు ఎలా తీరుద్దామని పాండు ఇటీవల భార్య అనితతో చెబుతూ మదనపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం సాయంత్రం పొలంలో పురుగుమందు తాగా డు. పొరుగు రైతుల సాయంతో కుటుం బీకులు పాండును చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమిం చడంతో ఆయన ఆదేరోజు రాత్రి మృతి చెందాడు. శనివారం పోలీసులు పోస్టుమార్టం అనంతరం పాండు మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారు. పాండు ఆత్మహత్యతో కుటుంబీకులు వీధినపడ్డారు. అందరితో కలుపుగోలుగా ఉండే అతడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పాండు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు శనివారం తెలిపారు. -
కౌలు రైతు కన్నీటి సాగు
కౌలు రైతులకు ఏటా కన్నీటి సేద్యం తప్పడం లేదు. జిల్లాలో 70 శాతం పంట భూములు సాగు చేసేది వీరే. అయినా ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందాల్సిన రాయితీలు, రుణాలు వారి దరిచేరవు. ఇందుకు కారణం వేరే వారి భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడమే. సాగుకు అందరి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా వీరే. పెట్టుబడితో పాటు కౌలు కింద ముందే డబ్బు చెల్లించాలి. ఇంత కష్టపడిన వారిని రైతులుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినా దిగువ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కౌలు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చీరాల : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రెవెన్యూ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా వేలాది మంది రైతులు కౌలుదారులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 8 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో మూడోవంతు మందికి ఎటువంటి రుణం మంజూరు కాలేదు. జిల్లాలో 2 లక్షలపైగా కౌలు రైతులున్నారు. జిల్లాలో సాగవుతున్న 5.7 లక్షల హెక్టార్లలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 35 వేల మంది కౌలు రైతులు గుర్తింపుకార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 8 వేల మందికే మంజూరు చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఏ రాయితీని, బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారు. దీనికి తోడు రైతులకు అవగాహన లేకపోవడం కూడా గుర్తింపుకార్డు పొందలేకపోవడానికి కారణమవుతోంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కౌలు రైతులను కన్నీటి కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు నామమాత్రంగా కూడా చేయడంలేదు. రైతు సంఘాల నాయకులు గట్టిగా అడిగితే కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లోకి వెళ్లి వారు ఎంత భూమిని కౌలుకు తీసుకున్నారో ఆ ప్రకారం కార్డుల్ని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఆ ప్రక్రియ సాగడం లేదు. స్థానిక నేతలు చెప్పిన వారికి, సర్వే నంబర్లు చెప్పినవారికి కార్డులు అందుతున్నాయి. అలాంటి వాటిలో కౌలు చేసిన భూమికి, కార్డులో ఉన్న విస్తీర్ణానికి పొంతన ఉండడంలేదు. ఎరువులు, విత్తనాలు, రుణాలు, వ్యవసాయ పనిముట్లు, పంటల బీమా, నష్టపరిహారం ఇలా కౌలుదారుడికి ప్రభుత్వం నుంచి పొందే ఏ లబ్ధికైనా గుర్తింపుకార్డులు అవసరం. ఏటా కౌలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అంతా కలిపి 35 వేలకు మించి ఉండదు. దీనికి కారణం రైతులకు కార్డులు అందచేయడంలో అధికారులు రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టడమే. పైగా కార్డులిచ్చినా వాస్తవంగా రైతులు సాగు చేస్తున్న భూమికి, గ్రామస్థాయి అధికారులు నమోదు చేస్తున్న విస్తీర్ణానికి సంబంధం ఉండడం లేదు. ఐదు ఎకరాలు కౌలు చేస్తున్న వారికి పదిసెంట్లు కౌలు చేస్తున్నట్లుగా కౌలు కార్డులిచ్చిన సంఘటనలున్నాయి. సర్కారు తీరుతో మరింత అవస్థలు... ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. ఫలితంగా కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో కౌలు రైతులు తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకు నుంచి రుణసౌకర్యం పొందేవారు. అయితే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దానిని పూర్తిచేయకపోవడంతో బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. అటు రుణమాఫీ కాక, ఇటు పెట్టుబడికి రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడులతో పాటు అదనంగా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలుదారులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వందకు రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. చివరకు వడ్డీ తడిసి మోపెడవుతోంది.