పిలిచింది వెయ్యిమందిని.. వండింది వందమందికి అన్నట్లు..జిల్లాలో కౌలు రైతులు లక్షమందికి పైగా ఉంటే ప్రభుత్వం మాత్రం వారిని వేలల్లోనే గుర్తిస్తోంది. భూమిలేని, తక్కువ భూమి ఉన్న రైతులుపెద్దరైతుల దగ్గర భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుని ఉపాధి పొందుదామని యాతన పడుతుంటే సాయం చేయాల్సిన ప్రభుత్వం వారిని అసలు గుర్తించకుండా పక్కన పెడుతోంది.
గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన రొంగలి గంగునాయుడు, ఎలిశెట్టి సత్యనారాయణలు గ్రామంలో ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వారికి ఇప్పటికీ కౌలు రైతు రుణార్హత కార్డులివ్వడం లేదు. పలుమార్లు అధికారులను అడిగినా ఇంకా కార్డులు రాలేదని అంటున్నారని వీరు వాపోతున్నారు. మరి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయాలంటే వీరు బ్యాంక్ అప్పు తీసుకోవాలి. అది కావాలంటే రుణార్హత కార్డులుండాలి. ఈ గ్రామంలో సుమారు 21 మందికి కార్డులు లేవు.
సీతానగరం మండలం రామవరం గ్రామానికి చెందిన పెంట సింహాచలం, బుడతనాపల్లిలోని రెడ్డి దేముడులుకు గత ఏడాది కౌలు రైతుల రుణార్హత కార్డులు ఇచ్చారు. దీంతో ఎంతో సంతోషించిన వారు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఆ కార్డుల మీద ఒక్క పైసా రుణమూ ఇవ్వలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఫైనాన్షియర్ల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి వ్యవసాయం చేసి ఫలసాయం అమ్మగా వచ్చిన సొమ్ము..అప్పులకు, వడ్డీలకే చాలలేదు.
ఈ పరిస్థితి ఈ రెండు మండలాల్లోని నలుగురు రైతులదే కాదు. జిల్లాలోని వేలాది మంది కౌలు రైతుల దుస్థితి.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ద్వారా రుణాలు ఇవ్వాల్సి ఉండగా వారి గుర్తింపే జరగడం లేదు. గత ఏడాది కన్నా ఈ ఏడాది కౌలు రైతుల గుర్తింపు గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది 19వేల మందికి పైగా కౌలు రైతులను అధికారులు గుర్తిస్తే ఇటీవల చేపట్టిన గుర్తింపులో కేవలం 15,561 మందిని మాత్రమే గుర్తించారు. క్షేత్రస్థాయిలో సక్రమంగా గ్రామసభలు నిర్వహించకుండా తూతూ మంత్రంగా పాత కౌలుదారులనే ఏటా చూపించడం వల్ల పూర్తిస్థాయి కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదు. ఇతర రైతుల వద్ద భూమిని తీసుకుని సాగు చేస్తున్న రైతులు జిల్లాలో దాదాపు లక్ష మందికి పైగా ఉంటారు. ఏటా వీరిని గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. గ్రామాల్లో వీఆర్వోలకు తెలిసిన కొందరి రైతుల పేర్లను మాత్రమే తీసుకుని కార్డులు ప్రింట్ చేసి ఇస్తున్నారు. దీని వల్ల ఏటా మారుతున్న కౌలు రైతులకు మాత్రం గుర్తింపు దక్కడం లేదు.
ప్రభుత్వం గుర్తించిన మేరకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదు. తక్కువ మందినైనా కౌలు రైతులుగా గుర్తిస్తున్న అధికారులు ఆ మేరకు కూడా వారికి రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులు కూడా రుణాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం గత ఏడాది గుర్తించిన కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలంటే కనీసం రూ.12 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చింది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్ష మంది రైతులకు రుణాలు ఇవ్వాలంటే కనీసం రూ.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
కానీ ఏటా ఈ కౌలు రైతులు మాత్రం రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గుర్తింపు కార్డులు మండలాలకు చేరుతున్నాయి. కానీ వాస్తవానికి కౌలు రైతులెంత మంది ఉన్నారో అంతమందికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి అదే పద్ధతిలో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమపరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కౌలు రైతులు వాపోతున్నారు.
లక్షమందిని కౌలుకోనివ్వరా!
Published Fri, May 29 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement