సాక్షి, అమరావతి: కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్‌సీ) అందచేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారోద్యమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. జూలై 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 7న ముగియనుంది. కౌలు రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకోవాలన్నది ఈ కార్డుల ఉద్దేశమని సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చే ఈ కార్డులతో కౌలు రైతులు ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, వ్యవస్థాగత పరపతి పొందుతారు. ఏపీ పంట సాగుదారుల చట్టం–2019 ప్రకారం ఈ కార్డులు జారీ చేస్తారు.
11 నెలలు మాత్రమే చెల్లుబాటు..
► పంట సాగుదారు కార్డుపై భూ యజమాని లేదా ప్రతినిధి, సాగుదారు, గ్రామపరిపాలనాధికారి (వీఆర్‌వో) సంతకాలు ఉంటాయి.
► 11 నెలల తరువాత సాగుదారు మళ్లీ కొత్తకార్డు పొందాల్సిందే.
► కార్డు పొందిన వారికి భూమిపై ఎటువంటి హక్కులు ఉండవు.
► ఈ కార్డుపై పంట రుణం తీసుకుంటే పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సాగుదారుదే. ఒకవేళ రుణం కట్టకుంటే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండదు. రుణం ఇచ్చిన బ్యాంకు భూ యజమానికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది
► సాగుదారుడు భూమికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు.
► భూ యజమాని కుటుంబ సభ్యుల పేర్లతో సాగుదారు కార్డులు ఇవ్వరు.
► దేవదాయ భూములను సాగు చేస్తున్న వారు కూడా కార్డు పొందవచ్చు.
► దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో సాగుదారు కార్డు లభిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మార్వో కార్యాలయం దృష్టికి తేవాలి.
► ప్రస్తుత ఖరీఫ్‌లో సీసీఆర్‌సీ కార్డుదారులందరికీ నూటికి నూరు శాతం పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోంది.
► రైతు భరోసా కేంద్రాలలో వాస్తవ సాగుదారులు, భూ యజమానులను సమావేశపరచి కార్డుల జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు భూ యజమానులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.
కౌలు రైతులకు చకచకా కార్డులు
Published Tue, Aug 4 2020 4:54 AM | Last Updated on Tue, Aug 4 2020 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment