సాక్షి, అమరావతి: మాండూస్ తుపాను కారణంగా విత్తనాలు కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. అదును ఉన్నా మళ్లీ విత్తేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనకు గురవుతున్న అన్నదాతలపై ఆర్థికభారం పడకుండా అండగా నిలుస్తోంది. వీరికి 80 శాతం సబ్సిడీపై విత్తనాలను అందిస్తోంది.
ఏ విత్తనం కావాలన్నా, సాగు విస్తీర్ణం బట్టి ఎంత కావాలన్నా సరఫరా చేస్తోంది. మాండూస్ తుపాను ఇటీవల రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రబీ సీజన్‌లో ముందుగా పంటలు సాగుచేసే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
ఆయా జిల్లాల్లో వరి, శనగ, వేరుశనగ, నువ్వులు, మినుము విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. వరిలో ఎన్‌ఎల్‌ఆర్–34449, ఆర్‌ఎన్‌ఆర్–15048, శనగలో జేజీ 11, పెసలులో పీయూ 31, వేరుశనగలో కదిరి లేపాక్షి రకం విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ వచ్చింది. ఇలా ఆయా జిల్లాల నుంచి 33వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఇందులో 28వేల క్వింటాళ్లను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంచేసింది. ఆర్బీకేల్లో విత్తనం కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేస్తోంది. వారికి డి.క్రిష్ యాప్ ద్వారా పారదర్శకంగా విత్తన సరఫరా చేస్తోంది.
15వేల మంది రిజిస్ట్రేషన్
ఇక విత్తనాల కోసం ఇప్పటివరకు 15వేల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 10వేల మందికి 8,727 క్వింటాళ్ల విత్తనం సరఫరా చేశారు. వీరికి 4,686 క్వింటాళ్ల వరి, 3,288 క్వింటాళ్ల శనగ, 748 క్వింటాళ్ల వేరుశనగ, ఐదు క్వింటాళ్ల నువ్వుల విత్తనం సరఫరా చేశారు. జనవరి 10 కల్లా మిగిలిన వారికి 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆయా జిల్లాల్లోని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు.
గతంలో ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు
రబీలో 8 ఎకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్ వరి విత్తనం వేశా. తుపాన్ దెబ్బకు మొత్తం పోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయా. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకుని 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. మొన్న రెండు బ్యాగ్‌లు ఆర్‌ఎన్‌ఆర్ 15048 విత్తనం తీసుకున్నా. ప్రభుత్వం ఆదుకోవడం ఆనందంగా ఉంది. పంట నష్టాన్ని కూడా అంచనా వేశారు.
– అట్ల కృష్ణయ్య, తునుబాక, పెల్లకూరు మండలం, తిరుపతి జిల్లా
జనవరి 10కల్లా అందరికీ సరఫరా
సీఎం జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై వరి, శనగ, వేరుశనగ, అపరాల విత్తనాన్ని సరఫరా చేస్తున్నాం. 33వేల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ఇప్పటికే 28వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంచేశాం. 8,727 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పంట దెబ్బతిన్న రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకుంటే జనవరి 10కల్లా కావాల్సిన విత్తనం సరఫరా చేస్తాం.
– డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
నాకున్న ఐదెకరాల్లో శనగ పంట వేశాను. వేసిన వారంలోనే తుపానువల్ల మొలక దశలోనే పంట పూర్తిగా దెబ్బతింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. కేవలం రూ.2,040 చెల్లించి ఆర్బీకేల్లో 1.25 క్వింటాళ్ల శనగ విత్తనం తీసుకున్నా. సబిడీపై విత్తనం ఇవ్వకపోతే చాలా ఇబ్బందిపడే వాళ్లం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– నలదల కొండయ్య, పలుకూరు, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment