రైతుల సందేహాలు తీరుస్తున్న రైతు భరోసా, పశుమత్స్యదర్శిని
అత్యాధునికంగా తీర్చిదిద్ది... అందంగా ముద్రించి...
రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
ఇప్పటికే లక్షన్నర దాటిన చందాదారులు
అమ్మకాలపై ఆర్బీకే సిబ్బందిపై ఒత్తిళ్లు లేవు
పనిగట్టుకుని అడ్డగోలు కథనాన్ని అందించిన ఈనాడు
ఎన్నికలు ముగిసినా ఇంకా ఈనాడు దుగ్ధ తీరలేదు. ఏదోలా ప్రభుత్వంపైనా... అనుసరిస్తున్న విధానాలపైనా లేనిపోని విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకుంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు అందిస్తూ పైశాచికానందం పొందుతోంది. తాజాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా, పశు మత్స్యదర్శిని మ్యాగజైన్స్‌పైనా తన అక్కసును వెళ్లగక్కింది. దురుద్దేశంతో ఇచ్చిన ఈ కథనాన్ని ప్రభుత్వాధికారులు నిర్ద్వందంగా ఖండించారు. వారి ఆరోపణలను తిప్పి కొట్టారు.
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమగ్రంగా... సచిత్రంగా ఆకర్షణీయంగా అందించేందుకు రైతు భరోసా, పశుమత్స్య దర్శిని మ్యాగజైన్స్‌ను ఐదేళ్లుగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో మూస పద్ధతిలో బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో నాణ్యత లేని మెటీరియల్‌తో ‘పాడి పంటలు’ పేరిట వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటికీ కలిపి ఒకే మాస పత్రిక అందించేవారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గతం కంటే మెరుగ్గా... ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయిల్ ప్రింట్ కవర్, అన్ని పేజీలు రంగుల్లో 44 పేజీలతో కూడిన ఈ మ్యాగజైన్‌ను ముద్రిస్తూ కేవలం రూ.25లకే అందిస్తున్నారు. గన్నవరం సమీకృత రైతు సమాచార కేంద్ర పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి దాదాపు పది మంది పర్యవేక్షణలో ఈ మ్యాగజైన్ రూపొందుతోంది.
ఆర్బీకేలకు ఉచితంగా సరఫరా
వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచే సాగు ఉత్పాదకాల వివరాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా సాగులో పంటల వారీగా మెలకువలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు, ఆదర్శ రైతుల అభిప్రాయాలతో విభిన్న కథనాలను అందిస్తున్నారు. 2020 జూలైలో ఈ మ్యాగజైన్‌కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రైతులకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తోంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల దాదాపు 14,300 ప్రతులను ముద్రించి ఆర్బీకేలకు వ్యవసాయ శాఖ అధికారులకు ఉచితంగా ఇస్తున్నారు.
లక్షన్నర మంది చందాదారులు
ఆర్బీకే పరిధిలో 400–500 మంది రైతులు ఉండగా ఆర్బీకేలోని డిజిటల్ లైబ్రరీలో ఒక మాస పత్రిక మాత్రమే ఉంచడం వల్ల మెజారిటీ రైతులు చదవలేకపోతున్నారు. వీరి కోసం ఓ వైపు వ్యవసాయ, అనుబంధ శాఖల వెబ్‌సైట్లలో ఈ పత్రికను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ మెజార్టీ రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు స్వచ్ఛందంగా చందాదారులుగా చేరుతున్న వారికి నేరుగా మ్యాగజైన్స్ అందజేస్తున్నారు.
లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉచితకాపీలు ఏ ధరతో ముద్రిస్తున్నారో అదే ధరకు రైతులకు అందిస్తున్నారు. చందాదారులుగా చేరగోరే రైతుల నుంచి మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం ఈ పత్రికల చందాదారులు లక్షన్నరకు పైగా ఉన్నారు. ఉన్నతాశయంతో నిర్వహిస్తున్న ప్రభుత్వంపై ఈనాడు బురద జల్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వచ్ఛందంగానే చేరుతున్నారు
ఈ మాసపత్రికల కోసం రైతులు స్వచ్ఛందంగానే చందాదారులుగా చేరుతున్నారు. వారిపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. వీటి ప్రాముఖ్యతపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించాం. చందా దారులంతా ఆర్బీకే పరిధిలో ఉండే రైతులే కాబట్టి, వారికి ప్రతీ నెలా ఈ మాసపత్రికలు అందజేసే బాధ్యతను అప్పగించాం. చందాదారులుగా చేర్పించేందుకు ఆర్బీకే సిబ్బందిపై ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించలేదు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment