ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌  | Notification for filling 7,384 posts in RBK Centres Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ 

Published Wed, Jan 4 2023 5:02 AM | Last Updated on Wed, Jan 4 2023 5:02 AM

Notification for filling 7,384 posts in RBK Centres Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు అన్న­­దాతలకు విశేష సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మ­­రింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అ­డు­గులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇం­కా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూ­డా భర్తీ చేయనున్నారు.

ఈ మేరకు ఆర్బీకేల ఏ­ర్పా­టు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య­ను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అ­త్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకు­ల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీ­టికి త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆ­ర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది. 

ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా..
ప్రస్తుతం ఆర్బీకేల్లో పనిచేస్తున్న మొత్తం 14,347 మందిలో ప్రధానంగా 6,291 మంది వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య, 317 మంది పట్టు సహాయకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖల సహాయకులు స్థానిక ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన సహాయకులే ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు.

కొన్నిటిలో మాత్రం పట్టు, మత్స్య సహాయకులు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖలకు చెందిన సహాయకులు సెకండ్‌ ఇన్‌చార్జిలుగా సేవలందిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల పరిధిలో పాడి సంపద ఉండడంతో ప్రతి ఆర్బీకేకు ఓ పశుసంవర్ధక సహాయకుడు చొప్పున కేటాయించారు. ఇలా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సేవలు అందిస్తున్నారు. 

ఇప్పటికే సీఎం ఆదేశాలు..
ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పొలం బడులు, తోట, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్‌ను ఆర్బీకేలకు అనుసంధానించారు.

మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ సెంటర్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 

సచివాలయాల్లోనూ..
ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతిలోగా నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టాం.
–వై.మధుసూదనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement