Posts Replacement
-
‘కానిస్టేబుల్’ పరీక్షలకు 1 నుంచి వెబ్సైట్లో కాల్‌లెటర్లు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలకు కాల్ లెటర్లను మార్చి 1 నుంచి 10వ తేదీలోగా తమ వెబ్సైట్ slprb.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం ప్రిలిమినరీ పరీక్షను జనవరిలో నిర్వహించారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దేహదారుఢ్య పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీసు నియామక మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ పరీక్షల తేదీలను పోలీసు నియామక మండలి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. -
ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది. ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా.. ప్రస్తుతం ఆర్బీకేల్లో పనిచేస్తున్న మొత్తం 14,347 మందిలో ప్రధానంగా 6,291 మంది వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య, 317 మంది పట్టు సహాయకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖల సహాయకులు స్థానిక ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన సహాయకులే ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. కొన్నిటిలో మాత్రం పట్టు, మత్స్య సహాయకులు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖలకు చెందిన సహాయకులు సెకండ్ ఇన్చార్జిలుగా సేవలందిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల పరిధిలో పాడి సంపద ఉండడంతో ప్రతి ఆర్బీకేకు ఓ పశుసంవర్ధక సహాయకుడు చొప్పున కేటాయించారు. ఇలా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే సీఎం ఆదేశాలు.. ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పొలం బడులు, తోట, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్‌ను ఆర్బీకేలకు అనుసంధానించారు. మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సచివాలయాల్లోనూ.. ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతిలోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టాం. –వై.మధుసూదనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి.. మళ్లీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 1,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిౖకైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. దీంతో జేఎల్ఎం నోటిఫికేషన్ జారీపై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభించనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలివారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే 9న సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసి, జూలై 17న రాతపరీక్ష నిర్వహించింది. అయితే రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు గత ఆగస్టు 25న సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు ఏకంగా 181 మంది అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు నిర్ధారణ కావడంతో యాజమాన్యం పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అభ్యర్థులు మళ్లీ ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఏపీపీఎస్సీ ప్రకటన: గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పరీక్షల తేదీలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ (జీఎస్ఎంఏ) పరీక్ష, సబ్జెక్టు పేపర్ల పరీక్షలకు వేర్వేరు తేదీలను ప్రకటించారు. షెడ్యూళ్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచారు. తెలుగు రిపోర్టర్ ఏపీ లెజిస్లేచర్ పోస్టులకు పరీక్షను విజయవాడలో మాత్రమే నిర్వహించనున్నారు. -
ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ!
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో మానవ వనరుల కొరతకు ఆస్కారం లేకుండా పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా చర్యలు చేపడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో అనేక విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 40 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. భారీగా నియామకాలు చేపట్టినప్పటికీ ఉద్యోగుల మరణాలు, ఉద్యోగ విరమణ, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోతే వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఎప్పటికప్పుడు వైద్య శాఖలో ఏర్పడిన పోస్టులను భర్తీ చేసుకునేలా ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర అనుమతులు (బ్లాంకెట్ పర్మిషన్) ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతి మూడు నెలలకు ఓసారి ఖాళీ అయిన పోస్టుల భర్తీ చేపట్టాలని వైద్య శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రతిసారి అనుమతులు లేకుండా ఉద్యోగులు మరణించడం, వీఆర్ఎస్, పదవీ విరమణ వంటి కారణాలతో ఏడాది పొడవునా ఏదో ఒక విభాగంలో పోస్టులు ఖాళీ అవుతుంటాయి. ఈ తరహాలో గత ఏడాదికిపైగా కాలంలో ప్రజారోగ్య విభాగంలో 91, డీఎంఈలో 272 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 150 అసోసియేట్ ప్రొఫెసర్లు, 130 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటికి అదనంగా వందల సంఖ్యలో స్టాఫ్ నర్సు, పారామెడికల్, నాన్‌మెడికల్ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు విభాగాలతోపాటు వైద్య విధాన పరిషత్‌ను కూడా కలుపుకుంటే 2 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయని అంచనా. వీటిని భర్తీ చేయాలంటే మొదట ఆర్థిక శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపి.. ఆర్థిక శాఖ అనుమతులు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అత్యవసర అనుమతులు రావడం వల్ల ఖాళీల భర్తీకి ప్రతిసారి ప్రతిపాదనలు పంపడం, ఆర్థిక శాఖ అనుమతుల కోసం ఎదురుచూడటం వంటివి ఉండవు. ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు.. ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. ఖాళీలన్నింటిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ఆస్పత్రుల్లో మానవవనరుల కొరతకు తావుండకూడదన్న సీఎం ఆశయాన్ని నెరవేర్చడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ సీఎస్‌కు ప్రతిపాదనలు పంపాం.. వైద్య శాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా అనుమతులు కోరుతూ సీఎస్‌కు ప్రతిపాదనలు పంపాం. ఏటా సెప్టెంబర్ నుంచి ఆగస్టు మధ్య పదోన్నతులు, ఉద్యోగ విరమణల ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నాం. వీటిని ఓ ప్రణాళిక ప్రకారం భర్తీ చేస్తే ఉద్యోగుల మరణాలు, వీఆర్ఎస్ల రూపంలో ఏర్పడే ఖాళీలను అప్పటికప్పుడు భర్తీ చేయొచ్చు. తద్వారా వైద్య శాఖలో పోస్టుల ఖాళీలన్న మాటకు తావుండదు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. – ముద్దాడ రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ -
విద్యుత్ కొలువులు 1,201
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 1000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 201 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రి కల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా (విద్యుత్ సర్కిల్) పోస్టులుగా భర్తీ చేయనున్నారు. కొత్త జోనల్ విధానం ప్రకారం దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు 95% ఉద్యోగాలను రిజర్వ్ చేశారు. ► జేఎల్ఎం అభ్యర్థుల వయోపరిమితి 2022, జనవరి 1 నాటికి 18–35 ఏళ్లు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు మరో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేదు. ట్రాన్స్‌కో/ టీఎస్ఎస్పీడీసీఎల్/ టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో ఆర్టిజన్లు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వయోసడలింపు కల్పించారు. వారు ఆయా సంస్థల్లో చేరినప్పుడున్న వయసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. అప్రెంటిస్ అవసరం లేదు. ► సబ్ ఇంజనీర్ అభ్యర్థులు 2022, జనవరి 1 నాటికి 18–44 ఏళ్లు వయోపరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు లభించనుంది. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లమా తర్వాత ఇవే విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీలు చేసిన వాళ్లు కూడా అర్హులే. -
క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీలో క్రీడాకారులకు 2% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోలో ఏయే క్రీడాకారులు అందుకు అర్హులో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పుడు అందుకు విరుద్ధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారిని మాత్రమే ప్రతిభావంత క్రీడాకారులుగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు గ్రూప్–1 పోస్టులను అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారికే పరిమితం చేసేలా ఉందని ఆక్షేపించింది. తోకను కుక్క ఆడిస్తుందే తప్ప, తోక కుక్కను ఆడించదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన లేదన్న కారణంతో ఓ క్రీడాకారుడిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవడానికి సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని తప్పు పట్టింది. ఆ అభ్యర్థిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. అధికారులు నిబంధనలకు స్వీయ భాష్యం చెబుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న ఓ క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కేసు పూర్వాపరాలివీ.. జాతీయస్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ తనను క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకునేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ జె.వెంకట బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో కూడా అర్హత సాధించానని, అయితే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేదంటూ క్రీడల కోటా కింద తనను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును తప్పుబట్టారు. రాజ్యాంగంలోని అధికరణ 309 కింద రూపొందించిన రాష్ట్ర, సబార్డినేట్ రూల్స్‌లో ఎక్కడా కూడా ప్రతిభావంతుని నిర్వచన పరిధిని అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి మాత్రమే పరిమితం చేయలేదన్నారు. çకమిషన్ వాదనను ఆమోదిస్తే.. గ్రూప్–1 పోస్టులు కేవలం కొన్ని కేటగిరీల ప్రతిభావంత క్రీడాకారులకే పరిమితం అవుతాయన్నారు. పాఠశాల, వర్సిటీ, జాతీయ, స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా ప్రతిభావంతుల కిందకే వస్తారని తెలిపారు. -
ఏపీపీల భర్తీకి 263 రోజులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల భర్తీకి 263 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏపీపీలు లేక క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో నియామక ప్రక్రియ వ్యవధిని కుదించాలని ఆదేశించింది. ఏపీపీలను భర్తీ చేయాలంటూ 2018 నుంచి చెబుతున్నా.. మూడేళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి 9 నెలల సమయం కోరడం ఏంటని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో ఏపీపీల ఖాళీలు ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాసినలేఖను ధర్మాసనం 2018లో సుమోటో వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. తాజాగా ఈ పిల్ విచారణకు రాగా.. ఈనెల 6న ఏపీపీ ఖాళీలు గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చామని పేర్కొం ది. విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది. వయోపరిమితి పెంచాలి ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేం దుకు వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచాలి. ఉమ్మడి ఏపీలో 2013లో ఈ పోస్టులు భర్తీ చేశారు. ఏ పోస్టులకైనా వయోపరిమితి 10 ఏళ్లకు పెంచుతూ 2017లో ప్రభుత్వం జారీచేసిన జీవోను ఈ పోస్టుల భర్తీకి వర్తింపజేయాలి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఈ పోస్టులకు వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిని 47 ఏళ్లుగా పేర్కొంది. ఇలాగే ఇక్కడా వయోపరిమితి పెంచాలి. – వి.రవికుమార్, న్యాయవాదుల జేఏసీ -
రైల్వే సీబీటీలో 5లక్షల మందికి అర్హత
న్యూఢిల్లీ: అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మొదటి దశలో మొత్తం 5, 88, 605 మంది అర్హత సాధించారని రైల్వే శాఖ తెలిపింది. డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న రెండో దశ పరీక్షకు వీరు అర్హత పొందారని పేర్కొంది. పరీక్షకు 10రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందుగా ఈ–కాల్ లెటర్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 64, 371 పోస్టులకు గాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించారు. -
సమాచార కమిషనర్ల భర్తీలో ఇంత నిర్లక్ష్యమా?
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తోపాటు రాష్ట్రాల సమాచార కమిషన్ల (ఎస్ఐసీ)లో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. సీఐసీ, ఎస్‌ఐసీల్లో ఖాళీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో తెలపాలని కేంద్రానికి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశాలకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా అఫిడవిట్ సమర్పించకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందంది. సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘ప్రస్తుతం సీఐసీలో 4 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రధాన సమాచార కమిషనర్ సహా మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. ‘సీఐసీలో 23వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐసీలో ఒక్క సభ్యుడినీ నియమించలేదు. ప్రధాన సమాచార కమిషనర్ లేకుండానే గుజరాత్, మహారాష్ట్ర కమిషన్లు నడుస్తున్నాయి’ అని పిటిషనర్ తరఫు లాయరు ప్రశాంత్ భూషణ్ అన్నారు. సీఐసీ, ఎస్ఐసీలకు కమిషనర్లను నియమించకుండా కేంద్ర, రాష్ట్రాలు స.హ. చట్టాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. -
మే నాటికి గురుకులాల్లో 8,434 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో వచ్చే మే నాటికి 8,434 పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో శుక్రవారం గురు కుల పాఠశాలలపై లఘు చర్చ జరిగింది. 10 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం సమాధానమిస్తూ.. ఆయా పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏళ్లలో 296 గురుకులాలు ఏర్పాటైతే, రాష్ట్రం ఏర్పాటు తర్వాత 577 గురుకులాలు అదనంగా ఏర్పాటయ్యా యని తెలిపారు. ఇది ఒక చరిత్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం స్థలాలను సేకరించా మని చెప్పారు. 4 క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. అందులో రెండు బాలికలకు, మరో రెండు బాలురకు కేటాయించామన్నారు. స్కూల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుపై పరిశీలిస్తామని హామీనిచ్చారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష ఖర్చు.. పూర్వ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కడియం చెప్పారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. ఐదు సొసైటీల కింద ఉన్న గురుకులాలను విద్యాశాఖ పరిధిలోకి తేవాలన్న అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రతీ విద్యార్థిపై తమ ప్రభుత్వం ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. విదేశాల్లో అమలుచేస్తున్న విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో విదేశాలకు ఒక బృందాన్ని పంపుతామని కడియం తెలిపారు. సమయం కేటాయించడం వరకే చీఫ్ విప్ పని: సతీశ్ గురుకుల పాఠశాలలపై జరిగిన చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుల మధ్యే వాదోపవాదాలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన సభ్యుడు పురాణం సతీశ్ మాట్లాడుతూ.. కొమురం భీం జిల్లాలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని ‘గురుకులాల్లో సైనిక్ స్కూల్’ అనాలని చెప్పడంతో సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ్యులకు సమయం, అంశం కేటాయించడం వరకే చీఫ్‌విప్ పని. సభ్యుల హక్కులకు పాతూరి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అంతా ఆయనే మాట్లాడుతారు. జోక్యం చేసుకుంటారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరో సభ్యుడు రాములు నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ‘దాన వీర శూర కర్ణ’లాంటి వారని, అందుకే బడుగువర్గాలకు గురుకులాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. -
జూన్ నాటికి వర్సిటీల్లో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో బుధవారం గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి తరఫున ఆయన సమాధానమిచ్చారు. కడియం మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో 1,661 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపామన్నారు. వాటికి ఆయా వర్సిటీలు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీలు జరుగుతాయన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11 వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ. 420 కోట్లు కేటాయించిందన్నారు. 2004–14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం రూ.1.29 లక్షల కోట్లు కాగా, 2014 నుంచి ఇప్పటివరకు చేసిన పెట్టుబడి వ్యయం రూ.1.24 లక్షల కోట్లు ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందనడానికి ఈ లెక్కలే నిదర్శనమన్నారు. -
మూగ వేదన
♦ జిల్లా అంతటా అరకొర పశువైద్యం ♦ అందుబాటులో ఉండని వైద్యులు ♦ చాలా చోట్ల గోపాలమిత్రల వైద్యమే దిక్కు ♦ గణనీయంగా తగ్గుతున్న పశు సంతతి ♦ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం జిల్లాలో పశు వైద్యం పడకేసింది. పలు ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. రోగాల బారిన పడ్డ పశువులకు అటెండర్లు, గోపాలమిత్రల వైద్యమే దిక్కవుతోంది. కొన్ని ఆస్పత్రులకు డాక్టర్లే లేకపోగా, ఉన్న చోట వైద్యులు సమయపాలన పా టించడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో అటెండర్లే వైద్యుల విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణకు మూలాధారమైన మూగజీవాలను రక్షించుకునేందుకు ఆరాటపడుతున్న పశు పోషకుల ఆశలు అడియాశలవుతున్నాయి. మందులు సమృద్ధిగానే ఉన్నాయి... వైద్యానికి అవసరమైన మందులు సరిపడా ఉన్నాయి. ఈ మధ్యనే ఖాళీ పోస్టుల భర్తీ కూడా జరిగింది. జిల్లాలో ఆస్పత్రుల పనితీరు బాగానే ఉంది. వాస్తవంగా వైద్యులందరూ తాము పనిచేసే చోటే నివాసం ఉండాలి. అయితే చాలా చోట్ల దగ్గర్లోని పట్టణాల్లో ఉంటున్నారు. వీరందరూ ఆస్పత్రులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. డాక్టర్ ఎస్. వెంకటరావు, పశు సంవర్థక శాఖ జేడీ. చిత్తూరు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తక్కువైనా పశు సంతతి మాత్రం ఎక్కువే. సు మారు ఆరు లక్షలమందికి పైగా పశుపోషకులు ఉన్నారు. వ్యవసాయం, పాడి పరి శ్రమలపై ఆధారపడే శ్రమజీవులూ ఎక్కువ. జిల్లా పశు సంవర్థక శాఖ గణాం కాల ప్రకారం ఆవులు, గేదెలు, ఎడ్లు వంటివన్నీ కలిపి 10 లక్షలకు పైనే ఉన్నాయి. ఏడాదికి ప్రభుత్వం జిల్లా పశువైద్యం కోసం రూ.3 కోట్ల మేర నిధులను కేటా యిస్తున్నట్లు పశు సంవర్థక శాఖ గ ణాంకాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో పశు వైద్యం మాత్రం అరకొరగా మారింది. సగానికి పైగా మండలాల్లో పశు వైద్యం అందుబాటులో లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనాలు, అందుబాటులో ఉండని డాక్టర్లు, కొరవడ్డ కనీస సదుపాయాల వంటి సమస్యలతో పశుపోషకులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. సమయపాలన ఏదీ.. జిల్లాలో పశు సంవర్థక శాఖ వైద్యులు సమయ పాల న పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా మండల కేంద్రాల్లో ఆస్పత్రులకు అందుబాటులో ఉండాలి. అయితే ఉన్న వైద్యుల్లో 60 శాతం మంది దగ్గర్లోని పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల కోసమనో, కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమనో కారణాలు చూపుతూ పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 55 వేల పశువులున్నాయి. 30 వేల కుటుంబాలు పాడిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చిత్తూరు గ్రామీణ మండలంలోని కుర్చివేడు, మాపాక్షి పశువైద్య శాలల్లో వైద్యులు లేరు. కుర్చివేడులో ఇన్చార్జ్ డాక్టర్ అడపాదడపా వెళ్లి వైద్యం చేస్తున్నారు. ఇక మాపాక్షిలో అయితే వైద్యుడు 50 రోజులు సెలవుపై వెళ్లడంతో అటెండర్లే వైద్యం చేస్తున్నారు. నియోజకవర్గంలో 12 గ్రామీణ పశు వైద్యశాలలున్నా, అందులో ఎనిమిదింటికి పక్కా భవనాలు లేవు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 41 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎనిమిది పశువైద్యశాలలున్నాయి. ఆరుగురు డాక్టర్లున్నారు. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం వంటి చోట్ల వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన రిటైర్డ్ అయిన కాంపౌండర్ అడపాదడపా వైద్యుడి అవతారం ఎత్తాల్సి వస్తోంది. మందుల జాబితాలో ఖరీదైన మందులు లేకపోవడంతో చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లోని ప్రజలు, రైతులు బయట మందుల షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. థైలేరియా, గర్భకోశ వ్యాధులు, పొదుగువాపు వ్యాధి, కుక్కలకు సంబం ధించి రేబిస్ టీకాలు, యాంటీబయాటిక్స్, సెలైన్స్, నొప్పి నివారణ మందుల కొరత ఎక్కువగా ఉంది. నీలి నాలుక, పీపీఆర్(పారుడురోగం), బ్రూసెల్లోసీస్, అంత్రాక్స్, గొంతువాపు, నట్టల నివారణ వ్యాధులకు సీజన్ల వారీగా ఉచితంగా టీకాలు వేస్తున్నా...మధ్యమధ్యలో వ్యాధులు సోకితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. కుంట్రపాకం, పెరుమాళ్లపల్లి వంటి చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. అత్యవసర మందులు, వీర్యం వంటివి నిల్వ చేసుకునేందుకు సరైన వసతులు కూడా అంతంత మాత్రమే. మదనపల్లె మండలంలో అంకిశెట్టిపల్లె, సీటీఎం పశువైద్యకేంద్రాలలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. మదనపల్లె పశు ఆరోగ్యకేంద్రంలో ఏడీ, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. కుక్కలు, గేదెలకు ఎప్పుడన్నా పాము కాటు వేస్తే మందులు బయటనుంచి తెచ్చుకోవాలని చెపుతున్నారు. చిన్నచిన్న రోగాలకు తప్ప మరే ఇతర వాటికి మందులు లేవు. మదనపల్లెలో విధులు నిర్వర్తించే అసిస్టెంట్ డైరెక్టర్ సెలవులో ఉన్నందున పుంగనూరు ఏడీ ఇన్చార్జ్గా ఉంటున్నారు. అయితే పారా మెడికల్ సిబ్బంది, కాంపౌండర్లు మాత్రమే ఇక్కడ వైద్య సేవలందిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో ఆరు వెటర్నరీ ఆస్పత్రులు, పది సబ్సెంటర్లున్నాయి. మొత్తం ఆరు మండలాల్లో 67వేల దాకా అన్ని రకాల పశువులున్నాయి. అయితే సంబంధిత ఆస్పత్రుల్లో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. ఉదయం 8 నుంచి 12 వరకు సాయంత్రం 3 నుంచి 5 వరకు ఇవి పనిచేయాలి. కానీ ఉదయం తప్ప సాయంత్రం వేళల్లో ఇవి పనిచేయడం లేదు. గడచిన ఆరు నెలల కాలంలో ఈ ప్రాంతంలో సుమారు 17 ఆవులు వివిధ రోగాలతో మృతి చెందాయి. ఈ విధంగా జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ఈ తరహా సమస్యలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే సమయపాలనలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శిథిల భవనాలతో అవస్థలు... జిల్లాలోని 50కి పైగా వైద్యశాలలు శిథిలమయ్యాయి. వర్షం వస్తే చాలు సగానికి పైగా భవనాలు ఉరుస్తున్నాయి. ఈ క్రమంలో మందులు దాచే చోటు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పాడైన కిటికీలు, దెబ్బతిన్న తలుపులతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. -
ఉద్యోగాలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లలో వివిధ పోస్టుల భర్తీకి (ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన) గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్-10, సివిల్ ఇంజనీరింగ్-6, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-4, మెకానికల్ ఇంజనీరింగ్-1, కెమిస్ట్రీ-1, బీఫార్మసీ/ ఎమ్‌ఫార్మసీ-6. అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాటు నెట్/ స్లెట్ అర్హత ఉండాలి. అకడమిక్ అసోసియేట్లు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్-2. అర్హత: బీఆర్క్ ఉత్తీర్ణత ఉండాలి. ల్యాబ్ టెక్నీసియన్లు -3. అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో పాలిటెక్నిక్ డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్లో లభిస్తాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 28 వెబ్సైట్: www.anu.ac.in రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ మేనేజర్: డేటాబేస్-2, సెక్యూరిటీ-2, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హార్డ్‌వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -2, ఎంపీఎల్ఎస్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, మార్కెటింగ్-10. మేనేజర్: లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హార్డ్‌వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -2, సెక్యూరిటీ-2, ఎంపీఎల్ఎస్-4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-8. డిప్యూటీ జనరల్ మేనేజర్-1 (ఎంపీఎల్ఎస్). డిప్యూటీ మేనేజర్: టెక్నికల్-40, ఎంపీఎల్ఎస్-8. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-2 (ఫైనాన్స్) జాయింట్ జనరల్ మేనేజర్ -1 (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీ సెక్రటరీ (లా)-1 (జనరల్ అడ్మిన్.) అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు సీఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూన్ 28 వెబ్సైట్: www.railtelindia.com భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ (మిస్సైల్ సిస్టమ్స్ ఎస్‌బీయూ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల సంఖ్య: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-4, మెకానికల్ ఇంజనీరింగ్-4, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-4. అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. ఆర్మీ/ నేవి/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం 15 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 30 వెబ్సైట్: http://bel-india.com -
నోటిఫికేషన్‌తో సరి!
ఎచ్చెర్ల క్యాంపస్: ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని..’ అన్నట్టుంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిస్థితి. రెగ్యులర్ బోధకుల నియామక వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చినా వర్సిటీ అధికారులు సకాలంలో ఆ ప్రక్రియను పూర్తిచేయకపోవటం విద్యార్థు ల పాలిట శాపంగా మారింది. 2008 జూన్ 25న వర్సిటీ ఏర్పాటు కాగా ఒక్కసారి మాత్రమే నియామకాలు జరపగలిగారు. మరో మూడుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ పోస్టుల భర్తీ మాత్రం చేయలేకపోయారు. ఇదీ పరిస్థితి బీఆర్ఏయూలో ప్రస్తుతం 12 మంది రెగ్యులర్ బోధకులు మాత్రమే ఉన్నారు. దీంతో 70 మంది కాంట్రాక్ట్ బోధకులతో తరగతులను నెట్టుకొస్తున్నారు. 2008లో ఎచ్చెర్లలోని ఏయూ పీజీ సెంటర్ బీఆర్ఏయూగా ఏర్పాటయ్యాక ఇక్కడ పనిచేస్తున్న 22 మంది బోధకులు విశాఖలోని మాతృసంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో మొదటినుంచి సమస్య కొనసాగుతోంది. రెగ్యులర్ బోధకులు లేకపోవటం వర్సిటీ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. తగినంతమంది రెగ్యులర్ బోధకులు లేకపోవటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 12-బీ గుర్తింపు ఇంతవరకు లభించలేదు. వర్సిటీ ఏర్పడ్డాక 2008లో తొలి వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్ హయాంలో సోషల్ వర్క్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లను ప్రారంభించారు. 2009లో నోటిఫికేషన్ జారీ చేసి బయోటెక్నాలజీ విభాగంలో నలుగురు, సోషల్ వర్క్‌లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఈ సమయంలోనే బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ని ర్వహించినా ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆ నియామకాలు నిలిచిపోయాయి. వీసీ సుధాకర్ హయాంలోనే 8 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2010 డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో సోషల్‌వర్క్ విభాగానికి 4, బయోటెక్నాలజీకి 3, కామర్స్‌కు 3, ఎకనామిక్స్‌కు 3, ఎల్ఎల్బీకి 7, ఎంఎల్‌ఐఎస్సీకి 3, రూరల్ డెవలప్మెంట్కు 4, గణిత విభాగానికి 5 పోస్టులను కేటాయించారు. అయితే భర్తీ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయకపోవటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. వీసీగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ బాధ్యతలు చేపట్టాక అవే 34 పోస్టులకు కొద్దిపాటి రోస్టర్ మార్పులతో 2013 జూన్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి స్పందనగా 400 దరఖాస్తులు రాగా వాటి పరిశీలనను సైతం పూర్తి చేశారు. కానీ నియామకాలు మాత్రం చేపట్టలేకపోయారు. నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది అవుతుండటం, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టటంతో ఈ నోటిఫికేషన్‌కు కూడా కాలదోషం పట్టనుందని సమాచారం. ఈ ఏడాది మార్చి 3న మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. తర్వాత ఎలాంటి కదలిక లేకపోవటంతో పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందే నియామకాలు పూర్తిచేయాలని అధికారులు భావించినా గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతి రాకపోవటంతో ప్రక్రియ నిలిచిపోయింది. వర్సిటీ అధికారుల ఏకపక్ష నిర్ణయాల గురించి సమాచారం ఉండటంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన నామినీని నియమించలేదని తెలిసింది. రాజకీయ అడ్డంకులు తప్పవా? బీఆర్‌ఏయూ ప్రస్తుత వీసీ హనుమంతు లజపతిరాయ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు పట్టింది. నియామకాలపై దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుం దని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, వర్సిటీ పాలక మండలి నియామకం ఇంతవరకు జరగకపోవటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటం వల్ల నియామకాలు ఇప్పట్లో జరగకపోవ చ్చని తెలుస్తోంది. టీచింగ్ అసోసియేట్ల ప్రచారం.. రెగ్యులర్ బోధకులుగా తాము నియమితులవటం ఖాయమని కొందరు టీచిం గ్ అసోసియేట్లు గట్టిగా ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం. వర్సిటీ ఉన్నతాధికారి త మ బంధువని.. అందువల్ల తమకు పోస్టు వచ్చి తీరుతుందని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే జిల్లాకు చెందిన అప్పటి కేంద్ర సహాయ మంత్రి అండదండలతో నియామకాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ గవర్నర్ నామినీ నియామకం జరగకపోవటంతో అది సాధ్యం కాలేదు. ఏర్పాట్లు చేశాం.. కానీ.. పోస్టుల భర్తీని సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని.. అయితే ఎన్నికలకు ముందు గవర్నర్ నామినీ రాకపోవటంతో ప్రక్రియ నిలిచిపోయిందని వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.