మూగ వేదన
♦ జిల్లా అంతటా అరకొర పశువైద్యం
♦ అందుబాటులో ఉండని వైద్యులు
♦ చాలా చోట్ల గోపాలమిత్రల వైద్యమే దిక్కు
♦ గణనీయంగా తగ్గుతున్న పశు సంతతి
♦ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం
జిల్లాలో పశు వైద్యం పడకేసింది. పలు ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. రోగాల బారిన పడ్డ పశువులకు అటెండర్లు, గోపాలమిత్రల వైద్యమే దిక్కవుతోంది. కొన్ని ఆస్పత్రులకు డాక్టర్లే లేకపోగా, ఉన్న చోట వైద్యులు సమయపాలన పా టించడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో అటెండర్లే వైద్యుల విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణకు మూలాధారమైన మూగజీవాలను రక్షించుకునేందుకు ఆరాటపడుతున్న పశు పోషకుల ఆశలు అడియాశలవుతున్నాయి.
మందులు సమృద్ధిగానే ఉన్నాయి...
వైద్యానికి అవసరమైన మందులు సరిపడా ఉన్నాయి. ఈ మధ్యనే ఖాళీ పోస్టుల భర్తీ కూడా జరిగింది. జిల్లాలో ఆస్పత్రుల పనితీరు బాగానే ఉంది. వాస్తవంగా వైద్యులందరూ తాము పనిచేసే చోటే నివాసం ఉండాలి. అయితే చాలా చోట్ల దగ్గర్లోని పట్టణాల్లో ఉంటున్నారు. వీరందరూ ఆస్పత్రులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ ఎస్. వెంకటరావు, పశు సంవర్థక శాఖ జేడీ. చిత్తూరు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తక్కువైనా పశు సంతతి మాత్రం ఎక్కువే. సు మారు ఆరు లక్షలమందికి పైగా పశుపోషకులు ఉన్నారు. వ్యవసాయం, పాడి పరి శ్రమలపై ఆధారపడే శ్రమజీవులూ ఎక్కువ. జిల్లా పశు సంవర్థక శాఖ గణాం కాల ప్రకారం ఆవులు, గేదెలు, ఎడ్లు వంటివన్నీ కలిపి 10 లక్షలకు పైనే ఉన్నాయి. ఏడాదికి ప్రభుత్వం జిల్లా పశువైద్యం కోసం రూ.3 కోట్ల మేర నిధులను కేటా యిస్తున్నట్లు పశు సంవర్థక శాఖ గ ణాంకాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో పశు వైద్యం మాత్రం అరకొరగా మారింది. సగానికి పైగా మండలాల్లో పశు వైద్యం అందుబాటులో లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనాలు, అందుబాటులో ఉండని డాక్టర్లు, కొరవడ్డ కనీస సదుపాయాల వంటి సమస్యలతో పశుపోషకులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.
సమయపాలన ఏదీ..
జిల్లాలో పశు సంవర్థక శాఖ వైద్యులు సమయ పాల న పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా మండల కేంద్రాల్లో ఆస్పత్రులకు అందుబాటులో ఉండాలి. అయితే ఉన్న వైద్యుల్లో 60 శాతం మంది దగ్గర్లోని పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల కోసమనో, కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమనో కారణాలు చూపుతూ పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 55 వేల పశువులున్నాయి. 30 వేల కుటుంబాలు పాడిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చిత్తూరు గ్రామీణ మండలంలోని కుర్చివేడు, మాపాక్షి పశువైద్య శాలల్లో వైద్యులు లేరు. కుర్చివేడులో ఇన్‌చార్జ్ డాక్టర్ అడపాదడపా వెళ్లి వైద్యం చేస్తున్నారు. ఇక మాపాక్షిలో అయితే వైద్యుడు 50 రోజులు సెలవుపై వెళ్లడంతో అటెండర్లే వైద్యం చేస్తున్నారు. నియోజకవర్గంలో 12 గ్రామీణ పశు వైద్యశాలలున్నా, అందులో ఎనిమిదింటికి పక్కా భవనాలు లేవు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 41 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఎనిమిది పశువైద్యశాలలున్నాయి. ఆరుగురు డాక్టర్లున్నారు. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం వంటి చోట్ల వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన రిటైర్డ్ అయిన కాంపౌండర్ అడపాదడపా వైద్యుడి అవతారం ఎత్తాల్సి వస్తోంది. మందుల జాబితాలో ఖరీదైన మందులు లేకపోవడంతో చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లోని ప్రజలు, రైతులు బయట మందుల షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. థైలేరియా, గర్భకోశ వ్యాధులు, పొదుగువాపు వ్యాధి, కుక్కలకు సంబం ధించి రేబిస్ టీకాలు, యాంటీబయాటిక్స్, సెలైన్స్, నొప్పి నివారణ మందుల కొరత ఎక్కువగా ఉంది. నీలి నాలుక, పీపీఆర్(పారుడురోగం), బ్రూసెల్లోసీస్, అంత్రాక్స్, గొంతువాపు, నట్టల నివారణ వ్యాధులకు సీజన్ల వారీగా ఉచితంగా టీకాలు వేస్తున్నా...మధ్యమధ్యలో వ్యాధులు సోకితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. కుంట్రపాకం, పెరుమాళ్లపల్లి వంటి చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. అత్యవసర మందులు, వీర్యం వంటివి నిల్వ చేసుకునేందుకు సరైన వసతులు కూడా అంతంత మాత్రమే.
మదనపల్లె మండలంలో అంకిశెట్టిపల్లె, సీటీఎం పశువైద్యకేంద్రాలలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. మదనపల్లె పశు ఆరోగ్యకేంద్రంలో ఏడీ, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. కుక్కలు, గేదెలకు ఎప్పుడన్నా పాము కాటు వేస్తే మందులు బయటనుంచి తెచ్చుకోవాలని చెపుతున్నారు. చిన్నచిన్న రోగాలకు తప్ప మరే ఇతర వాటికి మందులు లేవు. మదనపల్లెలో విధులు నిర్వర్తించే అసిస్టెంట్ డైరెక్టర్ సెలవులో ఉన్నందున పుంగనూరు ఏడీ ఇన్‌చార్జ్‌గా ఉంటున్నారు. అయితే పారా మెడికల్ సిబ్బంది, కాంపౌండర్లు మాత్రమే ఇక్కడ వైద్య సేవలందిస్తున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో ఆరు వెటర్నరీ ఆస్పత్రులు, పది సబ్‌సెంటర్‌లున్నాయి. మొత్తం ఆరు మండలాల్లో 67వేల దాకా అన్ని రకాల పశువులున్నాయి. అయితే సంబంధిత ఆస్పత్రుల్లో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. ఉదయం 8 నుంచి 12 వరకు సాయంత్రం 3 నుంచి 5 వరకు ఇవి పనిచేయాలి. కానీ ఉదయం తప్ప సాయంత్రం వేళల్లో ఇవి పనిచేయడం లేదు. గడచిన ఆరు నెలల కాలంలో ఈ ప్రాంతంలో సుమారు 17 ఆవులు వివిధ రోగాలతో మృతి చెందాయి. ఈ విధంగా జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ఈ తరహా సమస్యలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే సమయపాలనలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
శిథిల భవనాలతో అవస్థలు...
జిల్లాలోని 50కి పైగా వైద్యశాలలు శిథిలమయ్యాయి. వర్షం వస్తే చాలు సగానికి పైగా భవనాలు ఉరుస్తున్నాయి. ఈ క్రమంలో మందులు దాచే చోటు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పాడైన కిటికీలు, దెబ్బతిన్న తలుపులతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది.