నాటు నమ్మితే కాటికే..! | Snake bite veterinary medicine doctors | Sakshi
Sakshi News home page

నాటు నమ్మితే కాటికే..!

Published Sat, Jun 17 2017 10:52 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

నాటు నమ్మితే కాటికే..! - Sakshi

నాటు నమ్మితే కాటికే..!

పెరుగుతున్నపాముకాటు బాధితులు
నాటువైద్యం నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న వైనం
ఏడాదిలో 300ల మందకిపైగా మృత్యువాత
వచ్చే రెండు నెలలు అత్యంత ప్రమాదకరం
ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు


మహబూబ్‌నగర్‌ క్రైం: గ్రామీణ ప్రాంతం అంటేనే వ్యవసాయ పనులు చేసుకునే వారు ఎక్కువ.. పగలూరాత్రీ అనే తేడా లేకుండా పనులు చేస్తూనే ఉంటారు.. ఇక పిల్లలు, విద్యార్థులు అయితే చెట్లు, పుట్టల మధ్య తిరుగుతూ ఆడుకుంటారు. మారుమూల గ్రామాలు, తండాల్లో వంట కోసం కట్టెల తీసుకురావడానికి మహిళలు సమీప అడవులు, గుట్టల దగ్గరకు వెళ్తుంటారు. ఇవన్నీ రోజువారి జరిగే కార్యక్రమాలే అయితే వర్షాకాలం వచ్చే సరికి మాత్రం అందరూ భయపడుతుంటారు.

దీనికి ప్రధాన కారణం.. ఈ కాలంలో వర్షం పడటం వల్ల విషపురుగులు రాత్రిపూట చల్లదనంతో అడవుల నుంచి ఉపశమనం కోసం ఇళ్లలోకి వస్తుంటాయి. వారి పనుల కోసం ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వాటిని గమనించకపోవడంతో పొరపాటున అవి కాటు వేయడం జరుగుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం పూర్తిగా రాకముందే పాముకాటు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న పాముకాటు మృతులు, వైద్యసేవలు, జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం..

సరైన సమయంలో వైద్యం అందక..
పాలమూరు ఉమ్మడి జిల్లాలో పాముకాటు సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఇది మరీ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. గత వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు ఏడాదిలో దాదాపు 300ల మందికి పైగా కేవలం పాముకాటుతోనే మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూలీ చేసుకుని జీవించే నిరుపేదలతోపాటు పంట పొలాల దగ్గరకు కాపల కోసం వెళ్తున్న రైతన్నలు ఎక్కువగా బలవుతున్నారు. చేను పనికి వెళ్లినప్పుడు పొదల్లో చేతులు పెట్టడం, అందులోంచి కాలినడకన వెళ్లడం చేస్తుండడంతో పాముకాటుకు గురవ్వుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

మూఢనమ్మకాలపై ఆధారపడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా వరకు మూఢనమ్మకాలను నమ్ముతూ నాటువైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పాముకాటుకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సింది పోయి మంత్రాలు, తంత్రాలకు తగ్గుతుందని చెప్పే వారి దగ్గరకు.. ఏవో చెట్ల మందులు ఇచ్చే వారి వద్దకు తీసుకువెళ్తున్నారు. వారు ఏదో ఒక ఆకు పసరు రుద్ది పంపిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే మాతో కాదని ఇతర ఆస్పత్రులకు తీసుకువెళ్లండని తొందర పెడుతున్నారు. తీరా ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే బాధితుడి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

మందుల నిల్వకు ఇబ్బంది..
జిల్లాలో ఉన్న జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పాముకాటుకు సంబంధించిన మందును చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రిజ్‌ను ఉంచాలి. ఇది నిరంతరం పనిచేస్తూ ఉండాలి. జిల్లా ఆస్పత్రితోపాటు నారాయణపేట ఏరియా ఆస్పత్రి, బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో తప్ప మిగతా 28 పీహెచ్‌సీల్లో ఫ్రిజ్‌లు పనిచేయడం లేదని తెలుస్తోంది.

పాముకాటు ప్రమాదాలు ఇలా..
జిల్లాలో పాముకాటుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 17న ధన్వాడ మండలం మాధ్వార్‌కు చెందిన ఆంజనేయచారి(35) పాముకాటుకు గురై రాత్రికి రాత్రి మృత్యువాత పడ్డాడు. ఈ నెల 17న తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన అనిత(18) పాముకాటుకై గురై మృతి చెందింది. ఆమనగల్లు మండలంలోని కడ్తాల పంచాయతీ పరిధిలోని పెద్దారెడ్డి చెరువు తండాకు చెందిన బాల్యనాయక్‌(45) పంట పొలంలో పశువులు మేపుతుండగా గడ్డిలో ఉన్న పాముకాటు వేయడంతో మృత్యువాతపడ్డాడు. ఈ నెల 6న కేశంపేట మండలం నిర్ధవెళ్లికి చెందిన గిద్దెల చిన్న కేశవులు(26), ఈ నెల 4న మిడ్జిల్‌ మండలంలోని కొత్తూర్‌కు చెందిన విద్యార్థి శివకుమార్‌(11), ఈ నెల 3న ధరూరు మండలం మాల్‌దొడ్డికి చెందిన చంద్రిక(4) ఇంట్లో నిద్రపోతున్న సమయంలో పాటుకాటు వేయడంతో మృతిచెందింది.

ప్రభుత్వ వైద్యులకు శిక్షణేదీ..?
పాము కాటేస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విషం విరుగుడు మందులు అందుబాటులో ఉన్నా అత్యధిక చోట్ల మరణాలే సంభవిస్తున్నాయి. చికిత్స విధానంలో వైద్యులు సరైన పద్ధతి పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంటుంది. అన్ని వసతులున్న జిల్లా ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. ఇటీవల భూత్పూర్‌కు చెందిన ఓ రైతును పాము కాటేస్తే జిల్లాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ల్లాస్పత్రిలో పాముకాటుకు విరుగుడు మందులున్నా వైద్యుల్లో చికిత్సపై అవగాహన లేక ప్రజల ప్రాణాలకు రక్షణ లభించడం లేదు. ప్రభుత్వ వైద్యులకు దీనిపై ప్రత్యేక శిక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జిల్లా ఆస్పత్రిలో వైద్యులు చేతులెత్తేసిన రోగులకు పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోవడం ఇక్కడ ప్రభుత్వ వైద్యుల పని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఇక విష సర్పాలు కాటేయ్యకున్నా మాములు సర్పం కాటేసినా విరుగుడు చికిత్స అందిస్తుడటంతో అదీ ప్రాణాలమీదకొస్తుందనే వాదనలున్నాయి.

ఆర్‌ఎంపీలను ఆశ్రయించొద్దు..
జిల్లాలో పాముకాటు వేసిన తర్వాత ఎక్కువ శాతం మంది నాటు వైద్యులను, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితంగానే మరణాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో యాంటీ స్నేక్‌ బైట్‌ మందు ఎక్కడ కొరత లేదు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికంగా మందులు తీసుకువచ్చాం. ఇప్పటికే చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. చాలామంది భయం వల్ల పీహెచ్‌సీలకు రావడంలో ఆలస్యం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో మరణాల సంఖ్య కొంత పెరుగుతుంది. దీనిపై దృష్టి పెడుతాం. జిల్లాలో ఎక్కడైనా మందు లేని పీహెచ్‌సీలు ఉంటే వెంటనే ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీచేస్తా. – డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement