తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్‌లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్‌లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.
#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.
The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025
అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్‌లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్‌లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.
ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్‌లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..
స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.
అప్పటికే ఆలస్యమైంది..
శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్‌ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.
‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment