
బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి అపఖ్యాతి మూటగట్టుకునే విధంగా కొందరు మూకలు దారుణానికి ఒడిగట్టారు. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ యువతి, మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
వివరాల ప్రకారం.. కొప్పల్‌కు చెందిన మహిళ(29) పర్యాటకుల కోసం హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. దీంతో, వారంతా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గురువారం వారంతా డిన్నర్ చేసిన అనంతరం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.
Israeli Tourist, Homestay Owner Gang-Raped While Stargazing In Karnataka pic.twitter.com/DbtuOlGuxp
— NDTV (@ndtv) March 8, 2025
అనంతరం, సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, వారంతా గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తుంగభద్ర కాలువ వద్దకు వెళ్లారు. కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో టూరిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువతులను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.