అరకొరగా వ్యాపారాలు.. మందగించిన కొనుగోళ్లు
చితికిపోయిన చిరు వ్యాపారులు
రాష్ట్రంలో దసరా.. దీపావళి.. నూతన సంవత్సరం తరువాత మరో పెద్ద పండగ వస్తోంది. పిల్లాపాపలతో.. కొడుకులు.. కోడళ్ళు.. కూతుళ్లు.. అల్లుళ్లతో సందడిగా జరుపుకోవాల్సిన పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. పండుగ నేపథ్యంలో ఈపాటికే మార్కెట్లో కొనుగోళ్లు మొదలవ్వాలి. కొత్త బట్టలు.. చెప్పులు.. ఆడపిల్లల రిబ్బన్లు.. గాజులు.. పూసలు.. బట్టలు.. ఒకటా రెండా.. ఇంటిల్లిపాదికీ కొత్త వస్తువులు కొనాల్సిన పండగ.. అవి ధరించి ఇదిగో.. మా నాన్న కొత్తవి కొన్నాడు అంటూ మెరిసే కళ్లతో ఊళ్ళో తిరుగుతూ అందరికి చెప్పుకొనే చిన్నారి చిన్నబోయింది.. ఎందుకంటే నాన్న జేబులో పైసల్లేవు.. ప్రభుత్వం నుంచి పైసా రాలేదు..
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయాక ప్రజల చేతుల్లో ఒక్క పైసా కూడా కానరావడం లేదు. పేదల ఇళ్లలో కొనుగోళ్ల జాడ లేదు.. పండగ వస్తే ఏంది.. వెళ్తే ఏంది అన్నట్లుగా నిస్తేజంగా ఉంది మార్కెట్ మొత్తం. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పండుగకు ఏదో ఒక పథకం కింద వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వెళ్లేవి. సంక్రాంతికి అమ్మఒడి, ఇంకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఆసరా... ఇలా నిత్యం డబ్బు చేతిలోకి వస్తుండడంతో ఆ డబ్బుతో పండగ గడిచిపోయేది. పేదవాడి చేతిలోకి వచ్చిన రూపాయి మార్కెట్లోకి పరుగులు తీసేది.. బట్టలు.. చెప్పులు.. ఫోన్లు.. టీవీలు.. ఇలా రకరకాల గృహోపకరణాలు కొనేవాళ్ళు.
ఆ డబ్బుతో కొంత డౌన్ పేమెంట్ కట్టి.. మిగతా నెలవారీ కిస్తీలు కట్టేలా వస్తువులు తీసుకునేవాళ్ళు. దీంతో పండగ వస్తే చాలు మార్కెట్లు జనంతో కళకళలాడేవి. ఒక పేదవాడి వద్దకు వచ్చిన పదివేలు రిటైల్ షాపులకు చేరితే అక్కడి నుంచి హోల్ సేల్ డీలర్ వద్దకు.. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకూ ఆ పదివేలు ప్రవహించేది. కానీ గత ఆర్నెల్లుగా ఎక్కడా రూపాయి వచ్చింది లేదు.. పైగా కరెంటు బిల్లుల మోత మొదలైంది. రానున్న సంక్రాంతి పండగ సైతం ఉస్సూరుమంటుంది తప్ప ఏమాత్రం జోష్ ఉండదు అని ఇప్పటికే జనాలకు అర్థమైంది.. ఈ క్రమంలోనే పల్లెల్లోని చిన్న చిన్న దుకాణాలు సైతం నడవని పరిస్థితి నెలకొంది. పండగ నాడు చేతిలోకి డబ్బులు రాగానే బట్టలు.. ఇంటి నిత్యావసరాలు.. చెప్పులు.. వాచీలు.. ఇలా రకరకాల వస్తువుల కొనుగోళ్లు భారీగా జరిగేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
వీధి వ్యాపారులు.. చిరు వ్యాపారాలు కుదేలు..
పండగ పూట పల్లెల్లో చిన్నచిన్న సామాన్లు.. బట్టలు.. దుప్పట్లు.. గాజులు.. పూసలు.. గౌన్లు .. కొత్త గిన్నెలు.. అమ్మేవారు కోకొల్లలుగా తిరిగేవారు. అంతేకాకుండా పట్టణాల్లోనూ అలంటి చిరువ్యాపారులు సరుకులను వీధుల్లో పోసి అమ్మేవారు. కానీ ఇప్పుడు ప్రజల చేతుల్లో పైసల్లేకపోవడంతో ఆ వ్యాపారులు సైతం అమ్మకాలు మానేశారు. భారీగా పెట్టుబడులు పెట్టి.. అప్పు చేసి మోపెడ్ మీద రోజంతా తిరిగినా జనాలు కొనడం లేదని అంటున్నారు.
భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు..
వాస్తవానికి మధ్యతరగతి, పేదల వద్దకు చేరిన డబ్బు వెనువెంటనే మార్కెట్లోకి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో దానిమీద కనీసం 18 శాతం వరకు జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి వస్తుంది. అందులో సగమైనా రాష్ట్రప్రభుత్వం వాటా ఉంటుంది. అంటే పదివేలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రమారమి వెయ్యి ఆదాయం వస్తుంది. ఆయా పదివేలు ఇంకో చెయ్యి మారితే అందులోనూ మళ్ళీ జీఎస్టీ వాటా.. ఇంకో లావాదేవీ జరిగితే మళ్ళీ జీఎస్టీ.. అంటే ప్రజలనుంచి డబ్బు ఎన్ని చేతులు మారితే అన్నిసార్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నమాట. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రస్తావనే లేదు. దీంతో అంతిమంగా చిన్న వ్యాపారాలు తగ్గిపోయాయి. బట్టలు.. ఇతర మామూలు సరుకులు అమ్మే వ్యాపారాలు దివాళా తీశాయి. ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీఎస్టీ వసూళ్లు బ్రహ్మాండంగా ఉండేవి.
కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పడుతూ ఏకంగా మైనస్ లోకి వెళ్ళిపోయింది. నవంబర్ నెలకు సంబంధించి ఏపీ రాష్ట్రం దేశ సగటు జీఎస్టీ వసూళ్లలో -10% (మైనస్ పదిశాతం) నమోదు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్టోబర్ మినహా ఎప్పుడు వృద్ది నమోదు కాలేదు. మొత్తం మీద చూసుకుంటే జనం కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టింది అని ఈ జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి
ఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం వివరాలు ఇలా..
2024 ఏప్రిల్.. +12%
మే +15%
జూన్ వివరాలు జీఎస్టీ వెబ్ సైట్‌లో అందుబాటు లో కనిపించలేదు.
జూలై -7%
ఆగష్టు -5%
సెప్టెంబర్ -4%
నవంబర్ -10%
డిసెంబర్ - 6%.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment