‘ఇది పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయం’ | YSRCP Araku Mp Tanuja Rani Blames TDP MPs | Sakshi
Sakshi News home page

‘ఇది పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయం’

Published Tue, Mar 25 2025 6:37 PM | Last Updated on Wed, Mar 26 2025 10:53 AM

YSRCP Araku Mp Tanuja Rani Blames TDP MPs

ఢిల్లీ  పార్లమెంట్‌లో అరకు కాఫీస్టాల్‌ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్‌ సభ్యురాలిగా తనపట్ల వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొల్ల బాబూరావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లోనే అణగారిన, వెనుకబడినవర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. గిరిజన ఎంపీనైనందుకే అవమనించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్‌ను పార్లమెంట్‌లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను. అలాగే కనీసం కాఫీగింజలను పండించే పదిమంది గిరిజన రైతులను ఈ కార్యక్రమానికి పిలిస్తే, అద్భుతమైన ఈ కాఫీ రుచుల వెనుక వారి శ్రమ ప్రపంచానికి తెలిసేది. అరకుకే ప్రత్యేకమైన గిరిజన థింసా నృత్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించి వుంటే జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతికి ఒక పరిచయ వేదికగా మారేది. 

అరకు అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు సహజసిద్దమైన ఔషదగుణాలు ఉన్న పసుపు, అరుదైన సుగంధద్రవ్యాలు కూడా. ఇవ్వన్నీ పార్లమెంటేరియన్‌లకు పరిచయం చేసే సందర్భంగా ఆ కాఫీస్టాల్ ప్రారంభోత్సవం ఉండేది. కానీ దీనికి భిన్నంగా కేవలం ఎంపిక చేసుకున్న వారితోనే ఈ స్టాల్‌ను ప్రారంభించారు. కావాలనే స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం లేకుండా చేశారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నాము. అలాగే ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాము. ఈ వివక్షపై పార్లమెంట్ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను.

రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ..

పార్లమెంట్‌లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవంకు ఏపీ నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఏపీకి చెందిన కొందరు ఎంపీలను ఆహ్వానించారు. స్టాల్ ప్రారంభించిన తరువాత స్పీకర్ సహా ఎంపీలు కాఫీని సేవించి, దాని రుచిని గురించి ప్రశంసించారు. ఈ సందర్బంలో స్థానిక అరకు ఎంపీని ఎందుకు ఆహ్వానించలేదని ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణం. గిరిజన మహిళ కావడం వల్లే ఆమెను అవమానించేందుకు ఆహ్వానించలేదా? వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలవడం వల్లే పిలవలేదా? పార్లమెంట్‌లోనే ఇటువంటి పరిణామాలు బాధాకరం’ అని అన్నారు గొల్ల బాబూరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement