సాక్షి, విశాఖపట్నం: పార్టీ మారుతున్నట్టు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు. దళితుడిని కాబట్టే తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు.
కాగా, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. ఈ ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. నాపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంపై చాలా బాధేస్తోంది. వైఎస్ కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. దివంగత మహానేత వైఎస్సార్ నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే.. వైఎస్ జగన్ నన్ను రాజ్యసభకు పంపించారు.
వైఎస్ జగన్ పట్ల నేను ఎంతో నిబద్ధతతో ఉంటాను. వైఎస్సార్ మరణించిన సమయంలో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. నీతి, నిజాయితీగా బతికిన వ్యక్తిని నేను. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తాను’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment