
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది.. ఎక్కడా ప్లాట్లు.. సైట్ల అమ్మకాలు లేవు.. కొందామంటే కొరివి. అమ్ముదాము అంటే అడవిలా ఉంది పరిస్థితి.. రియల్ వ్యాపారాలు రేట్లు పెంచడం మాట అటుంచి వైఎస్ జగన్ అధికారంలోంచి దిగిపోయాక ఖజానాకు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ఖజానాకు ప్రతినెలా బోలెడు లోటు కనిపిస్తోంది దాన్ని నింపుకోవడానికి ప్రజలపై భారం వేయడం.. కుదిరినన్నిచోట్ల నుంచి పన్నులు పిండుకోవడమే మార్గంగా భావించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేసారు. భూముల ధరలు పెంచేశారు.. దీంతో పదివేలున్న గజం భూమి ఒకేసారి పదిహేను వేలు అయింది.. దానిమీద జరిగే క్రయవిక్రయాలమీద ప్రభుత్వానికి పన్ను ఆదాయం సమకూరుతుంది. బాబు ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు పెరిగిన ఈ ధరలు చూసి జాగాలు కొనేందుకు జనం భయపడుతున్నారు. భూమి కొనడం మాట అటుంచి ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు.. ఆఫీసు మామూళ్లు చూసి జనం భీతిల్లుతున్నారు.
ఇసుక ధరలు.. గుండెలు గుభేల్
ఇదిలా ఉండగా ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక ప్రజలకళ్ళలో ఇసుక పోసింది. మారాజా అంటే మరి రెండు తన్నండి అన్నట్లుగా.. వైఎస్ జగన్ హయాంలో ఇసుక ధరలు ఎక్కువ ఉన్నాయ్.. మేమొస్తే ఫ్రీ ఇసుక అని నమ్మించి గెలిచాక కూటమి నేతలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని ధరకు ఇసుక అమ్ముతున్నారు. ఒక లారీ ఇసుక తెచ్చుకోవడం అంటే శేషాచలం కొండలనుంచి ఎర్రచందనం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ప్రయాస ఐంది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా తరలిస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఇదంతా కలిసి ప్రజలకు ఇసుక అనేది మహాప్రసాదం ఐంది. దీంతో ఇసుక సంపాదించి ఇల్లు కట్టి.. వ్యాపారం చేయడం గగనం అయిపోతోంది.
వెంచర్లమీద వాలుతున్న పచ్చ రాబందులు
రాష్ట్రంలో వ్యాపారం చేసేందుకు వాతావరణం సరిగా లేదు. మొన్నటికిమొన్న మద్యం వ్యాపారం మోసం లక్షల్లో అప్పులుచేసి లైసెన్సులు తీసుకుని షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు వాలిపోయారు.. మాకు పావలా వాటా ఇస్తావా.. షాప్ మూసుకుని వెళ్ళిపోతావా అని బెదిరించారు. అనంతపురం.. తాడిపత్రి ప్రాంతాల్లో జెసి బ్రదర్స్ అయితే లైసెన్స్ దారులమీద చేసిన రుబాబు రాష్ట్రంమొత్తం చూసింది. ఇప్పుడు ఇదే సంస్కృతి రియల్ ఎస్టేట్ లోకి కూడా పాకింది. ఎక్కడ ఎవరు ప్లాట్లు అమ్మడానికి.. అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలు టిడిపి నేతలు వాలిపోతున్నారు.
మాకు రౌడీ మామూలు కడితే సరేసరి.. లేదంటే ఆ భూములు వివాదాస్పదం అంటూ రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తూ ఆ భూములు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో కోట్లు పెట్టి వ్యాపారం చేసేది తెలుగుదేశం వాళ్లకు సమర్పించుకోవడానికా అని రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ తొమ్మిదినెలలుగా ఇంటి స్థలాలు.. అపార్టుమెంట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. దీంతో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వడ్డీలు కట్టలేక.. వ్యాపారం సాగక సతమతమైపోతున్నారు. ఇదేకాదు చిన్నాచితకా పరిశ్రమలు నడిపేవారిపైనా తెలుగుదేశం నేతలు రుబాబు చేస్తున్నారు. దీంతో డబ్బున్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడం కన్నా బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటుందని ఊరుకుంటున్నారు - సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment