కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్.. పోర్టులో కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్న మాట వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆయన హార్డ్‌కోర్ అభిమానులకు ఆ డైలాగ్ నిద్రలేకుండా చేసింది. తమ అభిమాన నటుడు.. ప్రియతమ నేత రంగంలోకి దిగి మరీ అధికారులపై శివాలెత్తిపోయి ఆదేశాలివ్వడంతో మురిసిపోయారంతా. ఆ వెంటనే సోషల్ మీడియాలో వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లు.. ఎక్స్‌లో #Seizetheship హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం.. మాములుగా సాగలేదా హడావిడి. అయితే ఆ వ్యవహారంలో తాజా పరిణామం.. ఆయన అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నౌక ‘స్టెల్లా ఎల్- పనామా- ఐఎంవో 9500687’. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ షిప్‌ను అయితే సీజ్ చేయమని చెప్పారో.. ఆ షిప్ త్వరలో ఇంటి ముఖం పట్టబోతోంది. ఈ నెల 5 లేదంటే 6వ తేదీల్లో స్లెల్లా నౌక కాకినాడ నుంచి బయల్దేరనుందని సమాచారం. ఆపై అది వెస్ట్ ఆఫ్రికా కోటోనౌ పోర్టు(Port of Cotonou)కు చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ ఈపాటికే లభించినట్లు సమాచారం.
పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్(Benin) దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు.. కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం నిల్వలు దీని ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇందుకోసం హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11న ‘స్టెల్లా’ నౌక వచ్చింది.ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నులు లోడ్ చేశారు. అయితే నవంబర్ 27న కలెక్టర్ తనిఖీలు చేసి 640 టన్నుల పేదల బియ్యం గుర్తించి నౌకను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. రెండ్రోజుల తర్వాత కాకినాడ తీరంలో పర్యటించారు. స్వయంగా బోటులో షిప్ దగ్గరకు వెళ్లి మరీ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు ఎస్పీ, సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు.
అయితే.. విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనబర్జన పడింది. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం.. దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడం కారణాలు. అందుకే స్టెల్లా షిప్ సీజ్ చేయడం అంత సులువు కాదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తేల్చేశారు. కావాలంటే నౌకలోని రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాక ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇష్యూ నుండి బయట పడేందుకు మల్టీ డిసిప్లెయినరీ కమీటీ కూడా ఏర్పాటు చేశారు. ఆపై వాస్తవ పరిస్థితిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్‌కు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు.
ఈలోపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాలతో రేషన్ బియ్యాన్ని దించడం కాస్త ఆలస్యమైంది. చివరకు.. తాజాగా నౌకలో గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆన్ లోడ్ చేసి పోర్ట్ గోడౌన్‌లకు అధికారులు తరలించారు. ఆ వెంటనే షిప్ వెళ్లిపోయేందుకు క్లియరెన్స్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. పవన్ సీజ్ ద షిప్ వ్యవహారం సోషల్ మీడియా రీల్స్ కే పరిమితమైందన్నమాట!.ప్చ్..
కొసమెరుపు..
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా తరలించే వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిని కూటమి అనుకూల మీడియా ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులోనూ వైఎస్సార్‌సీపీ ప్రస్తావన తెచ్చి బద్నాం చేయజూసింది. అయితే.. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఆ సిట్ అధికారులు ఇప్పటిదాకా కాకినాడ ముఖం చూడలేదు. అదే సమయంలో పట్టుబడిన రేషన్ బియ్యం తాలుకా 6ఏ కేసులు నమోదు అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: పవన్‌కు చంద్రబాబుతోనే పోటీ!
Comments
Please login to add a commentAdd a comment