అందితే జుట్టకు.. అందకుంటే కాళ్లు అని సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విద్య వెన్నతో పెట్టిందేనని చాలాకాలంగా అందరికీ తెలుసు. అయితే ఈమధ్యకాలంలో ఆయనకు పవన్‌కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమే కాదు.. రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమెలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి! అల్లూ అర్జున్ అరెస్ట్ విషయంలో పవన్ వ్యాఖ్యలు, వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తోంది. గతంలో సినిమా టిక్కెట్ల నియంత్రణకు జగన్ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తున ఎగిరిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్! జగన్ సినిమా వాళ్లను అగౌరవ పరిచారని, టిక్కెట్ ధరలకూ.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలుపెట్టారు. అసత్య ప్రచారం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్ ఆయన చాలా గొప్ప అని పొగిడేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని పవన్ పంచెలూడదీసి కొడతానని బహిరంగంగా ప్రకటించడం!!!
పవన్ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లూ అర్జున్ అరెస్ట్‌ను కూడా తప్పు పట్టలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుద్దులు కూడా వల్లెవేశారు. చట్టంపై అంత గౌరవమున్న మనిషే అయితే.. గతంలో చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదేం? పైగా ఎందుకు రోడ్లపై పడి దొర్లారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారం యావకు 29 మంది నిండు ప్రాణాలు బలైతే.. నోరెత్తని పవన్ అల్లూ అర్జున్ విషయంలో మాత్రం ముందు వరుసలోకి వచ్చారే? ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం. మానవత్వం. ఒకసారి ఒకలా.. ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటల వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టిన రోజుకో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్‌కు అభిమానులు మరణించిన ఘటనలున్నాయి. మానవత్వం ఉన్న వారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసుండేవారు.
బిజెపి మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ పొగడడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లుగానే ఉంది. బీజేపీ నేతలు ఒకపక్క అల్లు అర్జున్‌ను సమర్థిస్తూంటే పవన్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకోవడం వారికి అసంతృప్తి కలిగించింది. అందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ ఎందులో గొప్పవాడిగా కనిపించారని అడిగారు. రేవంత్ సినిమా వారి పట్ల కర్కశంగా వ్యవహరించినా, వారికి బెనిఫిట్ షో లు ఇచ్చే ప్రసక్తి లేదని, రేట్లు పెంచబోమని ప్రకటించినా పవన్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు. ఏపీలో గతంలో వేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఎద్దేవ చేస్తున్నారు.
తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. ‘‘నువ్వూ రెడ్డివే..జగన్ రెడ్డే.. మీరు, మీరు మాట్లాడండి’’ అని పెద్ద గొంతుకతో చెప్పారు. కాని ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ ను పొగిడేసి తెల్ల జెండా ఎత్తేశారన్నమాట. అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాతో పాటు తన సినిమాలు, బాలకృష్ణ వంటివారు నటించిన సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ చేయలేకపోయారు. ఎలాగొలా రేవంత్ ను ప్రసన్నం చేసుకుని మళ్లీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల విషయాలలో సానుకూల నిర్ణయం కోసం ఈ పాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది.
సినిమా నటుడుగా ఉన్న ఆయన జనసేన పార్టీ పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి బాగానే లబ్ది పొందారని చెప్పాలి. కేంద్రస్థాయిలో బీజేపీతో జత కట్టడం, ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పినా, తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను అవినీతిపరులుగా ఆరోపించి, ఆ తర్వాత మళ్లీ వారితోనే స్నేహం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, వామపక్షాలతో కలిసి పోటీచేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదలివేశారు. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్ ఘనాపాటినే అనిపించుకున్నారు. చెగువేరా అభిమానిని ప్రచారం చేసుకుని, అనంతర దశలో మోడీ అంటే చాలా అభిమానం అని చెప్పుకున్నారు.
వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందూవాదినని పోజు పెట్టగలిగారు. ఒకసారి ఓటమి పాలైనా, సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని, ఒక సామాజికవర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసినా రేవంత్ ను అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సినీ ప్రముఖుల మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్ లోనే ఆస్తిపాస్తులు ఉండడం వల్లే భయపడ్డారన్న వాదన ఉంది. గతంలో కెసిఆర్ ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెబుతారు.
ఇలా రాజకీయాలను ,సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పాలి. ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు. విలువలు లేని రాజకీయం కావచ్చు..ఏమైతేనేం .. అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి. ఇటు సినిమాలలో వ్యాపారం పండాలి..ఈ వైఖరి తోనే పవన్ నడక సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడాన్ని సమర్దించుకున్న తీరు విడ్డూరమే .గతంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని,తన ఇంటిలోని వారికెవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు స్వరం మార్చారు. నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెబుతున్నారు.నాగబాబు మాదిరికాని, మంత్రి నాదెండ్ల మనోహర్ లాగా కాని బిసి,ఎస్సి,ఎస్టి నేతలెవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట.
అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా, వారు శ్రమపడలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. అన్నిటికి మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలరో చెప్పకనే చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాలలో దిట్ట అని, అబద్దాలు ఆడడంలో బహు నేర్పరి అని అంతా అంటుంటారు. ఇప్పుడు పవన్ ఆయనను దాటి పోతున్నట్లుగా ఉంది.ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలోకాని, రాజకీయాలలో కాని, సినిమాలలో కాని విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.ఎవరితో అంటకాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపార పరంగా లాభమో ఆలోచించాలి. ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ చేసినట్లే అనుకోవచ్చేమో!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment