ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుదిజట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్‌కే పరిమితం కావడం అతడి పరిణతికి నిదర్శమని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్‌పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ(ODI Captaincy) నుంచి వైదొలగనున్నాడనే వదంతులు వస్తున్నాయి.
చివరగా లంక పర్యటనలో.. పరాభవంతో ఇంటికి
కాగా గతేడాది టీమిండియా ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడి.. 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు.. 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది రోహిత్ సేన.
రోహిత్‌పై వేటు.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి కొత్త సారథి
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) మొదలుకానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగనున్నాయి. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంతపు రిటైర్మెంట్‌కు చేరువైన రోహిత్.. ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
రేసులో ముందుంది అతడే
శ్రీలంక పర్యటన తాలూకూ చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, పాండ్యా వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైఖేల్ సైట్ పేర్కొంది.
‘‘గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతడు నాయకుడిగా ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు.. ఈ టీ20 కెప్టెన్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.
వరుస వైఫల్యాలతో సతమతం
కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కాగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరుస్తోంది. పెర్త్‌లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు.. రెండో టెస్టు నుంచి రోహిత్ కెప్టెన్సీలో విఫలమైంది.
అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కింది. మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకొన్నాడు.
చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment