నిందితులు కోడి వెంకట లక్ష్మి, బొట్ట అన్నపూర్ణ, రామకృష్ణ, డాక్టర్ తిరుమల, చంద్రమోహన్
సాక్షి, విశాఖపట్నం: వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన ముప్ఫై నాలుగేళ్ల వయసు గల మహిళ భర్త చనిపోయాడు. మరొకరితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఈ వ్యవహారం ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణకు తెలిసింది. ఇంకే ముంది వారు ఏజెంట్ అర్జిరామకృష్ణకు సమాచారం ఇచ్చారు. తర్వాత వీరు ముగ్గురూ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని నమ్మించారు. దీనికి సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆస్పత్రిలో సుందరమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారికి విక్రయించారు.
చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో అంగన్‌వాడీ నుంచి పౌష్టికాహారం పొందేది.
అక్కడ అంగన్‌వాడీ టీచర్ గుంటు సరోజిని ఆ మహిళ డెలివరీ విషయాన్ని తెలుసుకొని బిడ్డ విషయాన్ని అడిగింది.
అందుకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అంగన్‌వాడీ టీచర్‌కు అనుమానం వచ్చి ఈ ఏడాది మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించింది.
దీనిపై చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకువచ్చారు.
చైల్డ్‌లైన్ సిబ్బంది బేబీని శిశుగృహలో చేర్పించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు జరిగిన విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ప్రస్తుత కేసుతో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆస్పత్రి ముసుగులో పసిపిల్లల విక్రయాలు : సీపీ ఆర్కే మీనా
చైల్డ్‌లైన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడితే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని సీపీ ఆర్కే మీనా చెప్పారు. ఆదివారం మీడియా సమావేశంలో సీపీ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. పిల్లలను విక్రయిస్తున్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రతతో పాటు ఓ డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లను, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను, పసిబిడ్డను కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిపి 8 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతతో పాటు ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ ఏ2, ఏ3లుగా, ఏజెంట్‌గా వ్యవహరించిన అర్జి రామకృష్ణను ఏ4గా, ఆస్పత్రి ఎండీ దగ్గర పనిచేస్తున్న వైద్యురాలు తిరుమలను ఏ5గా, ఎండీ దగ్గర పనిచేస్తున్న లోపింటి చంద్రమోహన్‌ను ఏ6గా, పసికందును కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరిని ఏ7, ఏ8గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఆస్పత్రి ఎండీపై ఇప్పటికే రెండు కేసులు
డాక్టర్ పచ్చిపాల నమ్రత జిల్లా పరిషత్ ప్రాంతంలో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. పసిపిల్లలను విక్రయించడం, ఇతరత్రా విషయాలపై ఆమెపై 2018లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో నాలుగు బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా కలిగే గర్భవతుల వివరాలను తెలుసుకునే వారు.
ఆశా వర్కర్లనే ఆ బాలింతల దగ్గరకు వెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, ఆ బిడ్డలను ఆస్పత్రికి ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రత తన నెట్‌వర్క్‌ను విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలింతలకు డెలివరీ చేసి ఆ పసికందులను డబ్బున్న వారికి విక్రయించడాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసిన వారు తల్లిదండ్రులుగా, తమ ఆస్పత్రిలోనే డెలివరీ అయిన విధంగా ఆ పసికందుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను సైతం ఇప్పిస్తూ వస్తున్నారు. ఇదే విధంగా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన మహిళను కూడా నమ్మించి మార్చి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు ఆమె మగబిడ్డను జన్మనివ్వడంతో ఆ పసికందును పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులకు విక్రయించారు. ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ పర్యవేక్షణలో మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, గాజువాక క్రైం సీఐ పి.సూర్యనారాయణ, హార్బర్ సీఐ ఎం.అవతారం, మహారాణిపేట ఎస్‌ఐ పి.రమేష్ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment