సాక్షి, విశాఖపట్నం: ఒక తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మరో తప్పు చేయాలి అంటారు. ఇప్పుడు సృష్టి ఆసుపత్రి అక్రమ వ్యవహారాల్లో అదే అంశం కనిపిస్తుంది. పేదరికం ఇతర వ్యవహారాల వల్ల పుట్టిన బిడ్డను పెంచుకోలేని మహిళలను టార్గెట్‌గా చేసుకుని విక్రయాలకు పాల్పడిన ‘సృష్టి’ యాజమాన్యం ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు క్రమంలో మరి కొన్ని తప్పులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. (డాక్టర్ నమ్రత మరో అక్రమ ‘కోణం’)
ముఖ్యంగా సరోగసి పేరిట బిడ్డలను పుట్టిస్తానని కొందరు దంపతులు వద్ద భారీ మొత్తాన్ని తీసుకుని పేదరికంలో ఉన్న గర్భవతులకు పుట్టిన బిడ్డలను అప్పగించినట్టు తేలింది. అదే సమయంలో పుట్టిన బిడ్డను తిరిగి ఇవ్వాలని మహిళలు ఒత్తిడి తెస్తే మరో మహిళ బిడ్డను కూడా అప్పగించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కౌన్సిలర్‌తో పాటు నర్సులు, ఇతర సహాయకులు సృష్టి అక్రమాల్లో సహకరించినట్లు పోలీసుల విచారణలో బయట పడింది.
లావణ్య అనే మహిళకు పుట్టిన బిడ్డని వేరొకరికి విక్రయించినట్టు గుర్తించామని విశాఖ డీసీపీ ఐశ్వర రస్తోగి తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏజెంట్ ఝాన్సీ, కౌన్సిలర్ బిందు, నర్సు కల్యాణితో పాటు ఆసుపత్రి సిబ్బంది వసంత, చంద్రమోహన్, సుజాత, వెంకటరమణలపై తాజాగా మరో కేసు నమోదు చేశామన్నారు. ఆడబిడ్డ పుడితే లక్షన్నర .. మగ బిడ్డ పుడితే రెండున్నర లక్షలు ఇస్తామని లావణ్యకు సృష్టి సిబ్బంది ఎర వేశారని, పుట్టిన బిడ్డని కోల్‌కత్తాలో దంపతులకు విక్రయించారని పేర్కొన్నారు.
లావణ్య.. బిడ్డ గురించి ఒత్తిడి తేవడంతో బొబ్బిలిలోని ఓ మహిళకు పుట్టిన బిడ్డను ‘సృష్టి’ సిబ్బంది నాలుగు రోజుల పాటు ఇచ్చారని డీసీపీ తెలిపారు. మహిళల డెలివరీలో పనిచేసిన ఎనస్థిషియన్ డాక్టర్ల పాత్రపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఇద్దరు బిడ్డల డీఎన్ఏ పరీక్షల కోసం కోర్టు అనుమతిని పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment