గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్కడి పర్యాటకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గోవాలో పరిస్థితులు మునుపటిలా లేవని.. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందన్న గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుగా వ్యవహరించొద్దంటూ ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ గోవాలో ఏం జరుగుతోందంటే..
ఈసారి ఇయర్ ఎండ్‌లో గోవాకు సందర్శకుల తాకిడే లేకుండా పోయిందని.. హోటల్స్, బీచ్‌లు బోసిపోయాయని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుళ్ల చేస్తున్న మాఫియా ముఠాలే అందుకు కారణమని విశ్లేషించాయి కూడా. అయితే..
ఈ కథనాలకు మూలం.. కొందరు సోషల్ మీడియా(Social Media) ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసిన పనేనని తేలింది. అయినప్పటికీ అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలతో సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.
‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈసారి ఇయర్ ఎండ్ వేడుకులకు గోవాకు పెద్దగా పర్యాటకులెవరూ రాలేదని.. వేరే ప్రాంతాలకు వెళ్లారని పోస్టులు చేశారు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పు. గోవా గురించి తప్పుడు సందేశాలు పంపారు వాళ్లు. వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి తీర ప్రాంతాన్ని ఆస్వాదించండి’’ అని సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు ఇచ్చారు.
అదే సమయంలో గోవా(Goa)లో జరిగే పలు మాఫియాల మీద ఆయన స్పందించారు. గోవాకు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రాంతాలను ఆస్వాదించాలి. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలి అనుకోవాలి. అంతేగానీ.. చేదు అనుభవాలతో తిరిగి వెళ్లకూడదు. పర్యాటకులతో సవ్యంగా మసులుకోకుంటే.. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. అలాగే.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించేలా చూస్తామని ప్రకటించారాయన.
‘‘యావత్ దేశం నలుమూలల నుంచి గోవాకు ఇదే మా ఆహ్వానం. నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు గోవాకు ఎంతో కీలకం. రకరకాల పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే గోవాలో అన్ని హోటల్స్ నిండుగా ఉన్నాయి. విమానాలు కూడా నిండుగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో.. కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని పేర్కొన్నారాయన.
నిజంగానే పడిపోయిందా?
చిన్నరాష్ట్రమైన గోవా జనాభా సుమారు 16 లక్షలు. పర్యాటకుల సంఖ్య మాత్రం ఏయేడు కాయేడూ పెరుగుతూనే వస్తోంది. అయితే తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి.
2015లో గోవాను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఐదు లక్షల 20 వేలు
2023లో సుమారు 8 లక్షల 50 వేల మంది పర్యటించారు
2019లో ఏకంగా 9 లక్షల 40 వేల మంది పర్యటించి రికార్డు క్రియేట్ చేశారు
2024 నవంబర్‌నాటికి ఆ సంఖ్య సుమారు 4 లక్షలుగా ఉంది.
*ఓహెర్లాడో గణాంకాల ప్రకారం
ఒక్కడితో మొదలై..
గోవా టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సోషల్‌మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. గోవా మునుపటి ఫ్రెండ్లీ స్పాట్‌లా లేదని.. పర్యాటకానికి ప్రతికూలంగా మారిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పర్యాటక ప్రాంతాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే టైంలో.. గోవాలో మోసాలు ఎక్కువగా జరుగుతాయనే భావన పర్యాటకుల్లో విపరీతంగా పేరుకుపోయిందని చెబుతూ రామానుజ్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.
తప్పుడు గణాంకాలతో అతను పోస్ట్ చేశాడంటూ గోవా పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఈసారి ఏకంగా సీఎం ప్రమోద్ సావంత్‌కే ఓ లేఖ రాశారు. విదేశీ పర్యాటకులు గోవాను ఏమాత్రం సురక్షిత ప్రాంతంలా భావించడం లేదని, ట్యాక్సీ సర్వీసుల మొదలు.. లిక్కర్, హోటల్, ఫుడ్, చివరికి చిరువ్యాపారులు సైతం తమను దోపిడీ చేస్తున్నారనుకుంటున్నారని, ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో గోవా పర్యాటకానికి గడ్డు పరిస్థితులు తప్పవని సీఎంకు సూచించాడాతను. అటుపై.. అతనికి మద్ధతుగా ఖాళీ బీచ్‌లు, హోటల్స్, సెలబ్రేషన్స్ ఫొటోలు పెడుతూ వస్తున్నారు.
చదవండి👉🏾: రెస్టారెంట్ సిబ్బందితో గొడవ.. గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment