
తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారికి అప్పగించిన టార్గెట్స్ రీచ్ కాకపోవడంతో వారికి వేధింపులకు గురిచేశారు. శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. కేరళలో కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ సంస్థకు రాష్ట్రంలో పలుచోట్ల బ్రాంచ్ ఉన్నాయి. ఈ ఘటన మాత్రం పెరుంబవూర్ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సదరు మార్కెటింగ్ కంపెనీల్లో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, సంస్థలో ఉద్యోగులకు యాజమాన్యం టార్గెట్స్ నిర్ధేశించింది. కచ్చితంగా టార్గెట్స్ రీచ్ కావాలనే నియమం విధించారు. దీంతో, టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగులను సదరు సంస్థ వేధింపులకు గురిచేసింది.
ఉద్యోగులను శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా.. అతడిని మరో వ్యక్తి మోకాళ్లపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ.. నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తిచేయని ఉద్యోగులపై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
100% literate State Kerala: Shocking video claiming to be of Employees of a company getting punished for missing Sales Targets goes viral....allegedly they were forced to Crawl, Lick spit & Bark like dogs. pic.twitter.com/0nnHje5oNO
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 5, 2025
ఇక, దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ అమానవీయ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని కార్మికశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే, యజమాని మాత్రం ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది. దీనిపై ఉద్యోగులు ఇప్పటివరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.