
బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్‌పూర్ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలే అందుకు కారణం.
విద్యుత్ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్‌ఫోన్లు పేలిపోయాయి. కరెంట్ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.
సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.
Shocking, terrible video!!
A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.
Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025