ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్‌లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!
‘‘సైఫ్‌కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్‌ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.
For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL
— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025
సైఫ్‌కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్‌కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.
మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్‌పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.
‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment