రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బ్యాటర్‌ | Sheldon Jackson Announces His Retirement From India's White Ball Cricket, More Details Inside | Sakshi
Sakshi News home page

Sheldon Jackson Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బ్యాటర్‌

Jan 3 2025 4:26 PM | Updated on Jan 3 2025 5:04 PM

Sheldon Jackson Retires From White Ball Cricket

సౌరాష్ట్ర స్టార్‌ బ్యాటర్‌ షెల్డన్‌ జాక్సన్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. షెల్డన్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఇవాళ (జనవరి 3) ప్రకటించాడు. సౌరాష్ట్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అయిన జాక్సన్‌ మూడు ఫార్మాట్లలో (ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఏ,టీ20) ‍కలిపి 11,791 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. 

38 ఏళ్ల జాక్సన్‌ ప్రస్తుత విజయ్‌ హజారే ట్రోఫీలో తన చివరి మ్యాచ్‌ ఆడాడు. జాక్సన్‌ తన చివరి మ్యాచ్‌లో (పంజాబ్‌) 10 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. జాక్సన్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.

జాక్సన్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (50 ఓవర్ల ఫార్మాట్‌) 84 ఇన్నింగ్స్‌ల్లో 36.25 సగటున 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్‌కు టీ20 ఫార్మాట్‌లో కూడా మంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్‌లో జాక్సన్‌ 80 మ్యాచ్‌లు ఆడి 1812 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

జాక్సన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కూడా ఆడాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో జాక్సన్‌ ఆర్సీబీ, కేకేఆర్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. జాక్సన్‌కు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం రానప్పటికీ 2017-2022 మధ్యలో కేకేఆర్‌కు తొమ్మిది మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 

2022 విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్లో మహారాష్ట్రపై చేసిన సెంచరీ (136 బంతుల్లో 133 పరుగులు) జాక్సన్‌ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర విజేతగా నిలిచి విజయ్‌ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది.

జాక్సన్‌కు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో జాక్సన్‌ ఇటీవలే వందో మ్యాచ్‌ ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో జాక్సన్‌ 103 మ్యాచ్‌లు ఆడి 46.36 సగటున 7187 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్‌ వికెట్‌కీపింగ్‌లో 75 క్యాచ్‌లు పట్టి, రెండు స్టంపౌట్లు చేశాడు. జాక్సన్‌కు టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement