ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేసే విధానంపై భారత వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని ఓ సెలక్షన్ అధికారి తనతో చెప్పినట్లు పేర్కొన్న జాక్సన్.. వయసును సాకుగా చూపి భారత సెలక్టర్లు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
30 ఏళ్లు పైబడిన వారిని టీమిండియాకు ఎంపిక చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఇలా ఏదైనా ఉంటే ఇటీవల ఓ 32 ఏళ్ల ఆటగాడిని భారత జట్టుకు ఎలా ఎంపిక చేశారని నిలదీశాడు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు భారత జట్టుకు ఆడాలన్నది ఓ కల అని, దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని అన్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు అందే వరకు తన ప్రయత్నాలను విరమించేదేలేదని చెప్పుకొచ్చాడు.
కాగా, 35 ఏళ్ల జాక్సన్ గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జాక్సన్.. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జాక్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50కి పైగా సగటుతో సత్తా చాటుతున్నాడు. 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సాయంతో 5634 పరుగులు చేశాడు.
చదవండి: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా బౌలర్
Comments
Please login to add a commentAdd a comment