సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీలో క్రీడాకారులకు 2% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోలో ఏయే క్రీడాకారులు అందుకు అర్హులో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పుడు అందుకు విరుద్ధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారిని మాత్రమే ప్రతిభావంత క్రీడాకారులుగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొంది.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు గ్రూప్–1 పోస్టులను అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారికే పరిమితం చేసేలా ఉందని ఆక్షేపించింది. తోకను కుక్క ఆడిస్తుందే తప్ప, తోక కుక్కను ఆడించదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన లేదన్న కారణంతో ఓ క్రీడాకారుడిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవడానికి సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని తప్పు పట్టింది. ఆ అభ్యర్థిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. అధికారులు నిబంధనలకు స్వీయ భాష్యం చెబుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న ఓ క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
కేసు పూర్వాపరాలివీ..
జాతీయస్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొన్నప్పటికీ తనను క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకునేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ జె.వెంకట బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో కూడా అర్హత సాధించానని, అయితే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేదంటూ క్రీడల కోటా కింద తనను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును తప్పుబట్టారు.
రాజ్యాంగంలోని అధికరణ 309 కింద రూపొందించిన రాష్ట్ర, సబార్డినేట్ రూల్స్‌లో ఎక్కడా కూడా ప్రతిభావంతుని నిర్వచన పరిధిని అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి మాత్రమే పరిమితం చేయలేదన్నారు. çకమిషన్ వాదనను ఆమోదిస్తే.. గ్రూప్–1 పోస్టులు కేవలం కొన్ని కేటగిరీల ప్రతిభావంత క్రీడాకారులకే పరిమితం అవుతాయన్నారు. పాఠశాల, వర్సిటీ, జాతీయ, స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా ప్రతిభావంతుల కిందకే వస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment