‘మార్గదర్శి’ మోసాల కేసు మూత | CID suddenly deviates In Margadarsi Chit Funds Case Uncer Chandrababu direction | Sakshi
Sakshi News home page

‘మార్గదర్శి’ మోసాల కేసు మూత

Published Fri, Feb 21 2025 3:52 AM | Last Updated on Fri, Feb 21 2025 7:22 AM

CID suddenly deviates In Margadarsi Chit Funds Case Uncer Chandrababu direction

బాబు డైరెక్షన్‌లో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన సీఐడీ

రూ.1,050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీళ్లు ఉపసంహరణ

ఆ చిట్‌ఫండ్‌ కంపెనీపై కేసు పెట్టడం ‘పొరపాటు..’ 

దానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవ్‌ 

ఇప్పటివరకు సేకరించినవన్నీ నేరాన్ని నిరూపించడం లేదు 

అందువల్ల ఇక కేసును మూసేయవచ్చు.. 

మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు 

దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాం 

ఆ నివేదిక దాఖలుకు అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంది.. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ 

సీఐడీ తుది నివేదికను సంబంధిత కోర్టు అనుమతిస్తే అంతే సంగతులు 

మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్రమాలు శాశ్వతంగా సమాధి అయినట్లే.. 

అదే కోరుకుంటున్న చంద్రబాబు సర్కార్‌.. రాజగురువుపై బాబు రాజభక్తి 

అటు అక్రమ డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టులో వైఖరి.. ఇటు మార్గదర్శి చిట్‌ఫండ్‌కు అనుకూలంగా ఏపీ హైకోర్టులో సీఐడీ ద్వారా అఫిడవిట్‌

ఆర్బీఐ సెక్షన్‌ 45 (ఎస్‌)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీ, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలపై దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించి మార్గదర్శి చిట్‌ఫండ్‌పై అసలు కేసు నమోదు చేయడమే ‘పొరపాటు..’ అంటూ దర్యాప్తు సంస్థతో చెప్పించింది.

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని గతంలో బల్లగుద్ది గట్టిగా వాదించిన సీఐడీ.. చంద్ర­బాబు ప్రభుత్వం ఒత్తిడితో ఒక్కసారిగా ప్లేటు ఫిరా­యించింది. తాము సేకరించిన మౌఖిక, రాత­పూ­ర్వక ఆధారాలేవీ మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్ర­మాలను రుజువు చేసేవి కావంటూ నిస్సహాయంగా చేతులె­త్తేసింది. ఈమేరకు మార్గదర్శి చిట్‌ఫండ్‌ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్‌ రిపోర్ట్‌ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ హైకోర్టుకు నివేదించింది. 

మార్గదర్శి అక్రమాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నా­యని గతంలో తేల్చి చెప్పిన సీఐడీ హఠాత్తుగా స్వరం మార్చడం వెనుక సీఎం చంద్రబాబు ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు డైరెక్షన్‌లో.. ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ నడుచుకుంటున్నట్లు స్పష్ట­మ­వుతోంది. రాజగురువు రామోజీ లేనప్పటికీ ఆయన కుటుంబం పట్ల చంద్రబాబు సర్కారు రాజభక్తిని చాటుకుంటూనే ఉంది! 

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా... ఆర్బీఐ సెక్షన్‌ 45 (ఎస్‌) తమకు వర్తించదంటూ మార­్గదర్శి ఫైనాన్షియర్స్‌ చట్ట విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీ­రావు, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. 

మార్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల విషయంలో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పు­డు మరింత బరి తెగించింది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసు నమోదే ‘పొరపాటు..’ అంటూ సీఐడీ చేత చెప్పించింది. అంతేకాక ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూ­ర్వక ఆధారాలు ఏవీ కూడా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సీఐడీతో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖ­లు చేయించింది. 

మార్గదర్శి చిట్‌పై కేసు నమోదు ‘పొరపాటు..’ (మిస్టేట్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌) అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్‌ రిపోర్ట్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేయించింది. ఇక ఫైనల్‌ రిపోర్ట్‌ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అనుమతి మంజూరు చేయ­డమే తరువాయి. తద్వా­రా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలు ఎప్పటికీ బహి­ర్గతం కాకుండా శాశ్వతంగా సమాధి కట్టాలని బాబు సర్కారు నిర్ణయించింది. 

ఒకవైపు తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనా­­న్షియర్స్‌ అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ­రావు చట్ట­వి­రుద్ధంగా వ్యవహరించారని ఆర్‌బీఐ బహిర్గతం చేయగా.. మరోవైపు చంద్ర­బాబు ప్రభుత్వం మార్గ­దర్శి చిట్‌­ఫండ్స్‌ అక్ర­మా­లకు ఆధారాల్లేవని ఏపీ హైకోర్టులో సీఐడీ చేత చెప్పించడం గమనార్హం. మరో కీలక విష­యం ఏమిటంటే.. తెలంగాణ హైకో­ర్టు­లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాల కేసు విచా­రణకు వచ్చిన రోజే.. ఏపీ హైకోర్టులో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు అను­కూలంగా సీఐడీ కౌంటర్‌ దాఖలు చేయడం. 



చట్ట ఉల్లంఘనలకు పాల్పడి­నందుకు మార్గదర్శి చిట్‌­ఫండ్స్‌కి చెందిన రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల­ను జప్తు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అప్పీ­ళ్లను ఆ సంస్థ చేత చంద్రబాబు ప్రభు­త్వం అధికారంలోకి రాగానే ఉపసంహరింప చేసిన విషయం తెలి­సిందే. ఇప్పుడు ఏకంగా మార్గదర్శిపై కేసు నమోదు చేయడం ‘పొరపాటు’ అంటూ సీఐడీ దాఖలు చేసే తుది నివేదికను సంబంధిత కోర్టు ఆమో­దిస్తే చంద్ర­బాబు ప్రభుత్వం విజయం సాధించి­నట్లే! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కేసు క్లోజ్‌ అయినట్లే!!


చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ...
మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 2023 మార్చి 10న సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా అదే రోజు రామోజీరావు, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్స్‌ ఆడిటర్‌ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. 

అనంతరం మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డ్‌ చేసింది. గడువు ముగిసి ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్‌ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. 

సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్‌ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం లాంటి ఉల్లంఘనలకు మార్గదర్శి చిట్స్‌ పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ సంస్థ ఆడిటర్‌ కుదరవల్లి శ్రవణ్‌ను 2023 మార్చి 29న అరెస్ట్‌ చేసింది. అనంతరం సంబంధిత కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది.

అప్పట్లో మార్గదర్శికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన సీఐడీ
శ్రవణ్‌ కుమార్‌ అరెస్ట్‌ను, రిమాండ్‌ను ప్రశ్నిస్తూ ఆయన భార్య నర్మదతో పాటు శ్రవణ్‌ కుమార్‌ కూడా ఆశ్చర్యకరంగా ‘హెబియస్‌ కార్పస్‌’ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కీలక స్థానాల్లో ‘అనుకూల’ వ్యక్తులు ఉండటంతోనే అసాధారణ రీతిలో వీరు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఈ పిటిషన్‌ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీ చాలా గట్టిగా వాదనలు వినిపించింది.

ఆధారాల్లేవంటూ తాజాగా కౌంటర్‌
మార్గదర్శి చిట్‌ఫండ్‌ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అని సంబంధిత కోర్టులో ఫైనల్‌ రిపోర్ట్‌ దాఖలు చేయనున్నామంటూ హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్‌లో నివేదించింది. సంబంధిత కోర్టులో ఫైనల్‌ రిపోర్ట్‌ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీని అనుమతి కోరినట్లు సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ డి.ప్రసాద్‌ తన కౌంటర్‌లో హైకోర్టుకు తెలిపారు. 

ఆధారాలు చాలకపోవడంతో మార్గదర్శిపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అనుమతి కోరుతూ అప్పటి దర్యాప్తు అధికారి రాజశేఖరరావు సీఐడీ అదనపు డీజీకి గత ఏడాది ఆగస్టు 12న లేఖ రాశారని, ఆ లేఖను పరిశీలించిన అదనపు డీజీ మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసు మూసివేతకు ఆగస్టు 16న అనుమతినిచ్చారని పేర్కొన్నారు. దీంతో తుది నివేదిక సిద్ధం చేసి కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని అదనపు డీజీని కోరామన్నారు.

నాడు కీలక ఆధారాలు ఉన్నాయన్న సీఐడీ..
వాస్తవానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అవకతవకలపై దర్యాప్తు జరిపిన సీఐడీ పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించింది. ఇదే విషయాన్ని గతంలోనే హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్రమాల కేసులో సంస్థ యజమాని శైలజా కిరణ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వినిపించిన వాదనల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. 

మార్గదర్శి చిట్‌ఫండ్‌కు వ్యతిరేకంగా కీలక ఆధారాలున్నాయని, అందువల్ల బెయిల్‌ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది. సీఐడీ సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. 

మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్రమాలు, అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని అప్పుడు తేల్చి చెప్పిన సీఐడీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ కూడా మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్రమాలను రుజువు చేసేవిగా లేవంటూ నిస్సిగ్గుగా, నిస్సహాయంగా చేతులెత్తేసింది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల్లో మచ్చుకు..
సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం.. చెల్లించాల్సిన ప్రైజ్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం.. తక్కువ వడ్డీ చెల్లించడం.. చెల్లింపులు ఎగవేయడం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల్లో మచ్చుకు కొన్ని! చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే... చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. 

తన వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టి పెట్టుకున్న మొత్తాలను మార్గదర్శి రొటేషన్‌ చేస్తూ వస్తోంది. చట్ట ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. కానీ మార్గదర్శిలో అలా ఉంచకుండా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement