
ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
1,392 స్టేషన్లు ఉంటే, 1,001 స్టేషన్‌లలోనే సీసీ కెమెరాలా?
మిగిలిన స్టేషన్‌లలో ఎందుకు పెట్టలేదు?
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీలు పెట్టారా?
స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపించేలా సీసీ టీవీలు ఏర్పాటు చేశారా?
డీఎస్పీలు అందరి నుంచి నివేదికలు తెప్పించి మా ముందుంచండి
జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు సంగతి కూడా చెప్పండి
సీసీ టీవీ ఫుటేజీ స్టోరేజీ వివరాలు సమర్పించాలని ఆదేశం
సాక్షి, అమరావతి: వ్యక్తులను అక్రమంగా నిర్బంధించిన సమయాల్లో తమ పోలీస్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ పోలీసులు తరచూ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా, 1,001 స్టేషన్‌లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మిగిలిన స్టేషన్‌లలో ఏర్పాటు చేయకపోవడానికి కారణాలేమిటి? వాటిని ఏర్పాటు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది.
సీసీ కెమెరాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారా? స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపిస్తుందా అనే ప్రధాన విషయాలతో రాష్ట్రస్థాయిలో ఐటీ విభాగాన్ని పర్యవేక్షించే అధికారికి నివేదికలివ్వాలని అందరు డీఎస్పీలను ఆదేశించింది. ఆ నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అంతేకాక పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు, సీసీ టీవీ ఫుటేజీ నిల్వ సామర్థ్యం తదితర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న 1,226 సీసీ కెమెరాల్లో 785 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన వాటి మరమ్మతులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని 12 నెలలు స్టోర్ చేయాలని, ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లలో ఎన్ని నెలల ఫుటేజ్‌ని స్టోర్ చేయవచ్చో స్పష్టతనివ్వాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్‌లలో రికార్డయిన ఫుటేజీని ఎక్కడ స్టోర్ చేస్తున్నారని, దాని బ్యాకప్ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏదైనా వ్యవస్థ ఉందా వంటి వివరాలను కూడా తమకు సమర్పించే నివేదికలో పొందుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు
2015లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ 2019లో ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని, తద్వారా అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ యోగేష్ 2022లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. ఇంకా 391 స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సీసీ టీవీల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఫుటేజీని ఎక్కడ భద్రపరుస్తున్నారు వంటి వివరాలను ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు ఇచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment