sports players
-
హైటెక్స్‌లో బ్యాటిల్ గ్రౌండ్స్..
దేశంలోని ప్రముఖ ఈ–స్పోర్ట్స్ ఆటగాళ్లు, ఆన్లైన్ గేమింగ్ ఔత్సాహికులంతా నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా సందడి చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024’ (బీజీఐఎస్) ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద బ్యాటిల్ రాయల్ ఈ–స్పోర్ట్స్ ఈవెంట్లో ప్రావీణ్యులైన 16 ఈ–స్పోర్ట్స్ బృందాలు హోరాహోరీగా తలపడ్డాయి. 2 కోట్ల ప్రైజ్ మనీతో ప్రారంభించిన ఈ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 3 రోజుల పాటు కొనసాగనుంది. మొదటి రోజు ఎలక్ట్రిఫైయింగ్ ఫేస్–ఆఫ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు, అనుభవజు్ఞలైన ఆటగాళ్లు గ్రాండ్ ప్రైజ్ కోసం పోటీ పడ్డారు. పోటీలను వీక్షించడానికి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను తలపించేలా దాదాపు 2,500 మంది హాజరయ్యారు. మరో 4 వేల మంది వీక్షించడానికి పాస్‌లు కొనుగోలు చేశారని నిర్వాహకులు, క్రాఫ్టన్ ఇండియా ప్రతినిథి కరణ్ పథాక్ తెలిపారు. నగరంలో ఆన్లైన్ గేమర్ల సంఖ్య భారీగా పెరిగిందని, క్రాఫ్టన్ ఇండియా ఈస్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో ఇంగ్లిష్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, మిజో, మలయాళం తదితర భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేశామని, రెండున్నర లక్షల మంది వీక్షించారని పేర్కొన్నారు. పాస్‌ల ద్వారా వచి్చన ఆదాయాన్ని సాంప్రదాయ క్రీడలకు మద్దతుగా ‘అభినవ్ బింద్రా ఫౌండేషన్’కు అందించనుండటం విశేషం. అభిమానులకు ఎంతో ఇష్టమైన ఈస్పోర్ట్స్ వ్యాఖ్యాతలు ‘స్పెరో, అంకీ, మేజీ, జానీ తదితరుల థ్రిల్లింగ్ లైవ్ కామెంటరీకి అద్భుత స్పందన లభించింది.ఆర్ట్ గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్.. మాదాపూర్: స్థానిక చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొమెంట్ అకాడమీ నిర్వహించిన ఈ ప్రదర్శనలో 50 మంది ఫొటోగ్రాఫర్లు తీసిన 56 చిత్రాలను అందుబాటులో ఉంచారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అనురాధారెడ్డి, చంద్రశేఖర్సింగ్, కందుకూరి రమేశ్‌బాబు ప్రదర్శనను తిలకించి ఫొటోగ్రాఫర్లను అభినందించారు. -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్కులలో అండర్–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు. చివరిరోజు సోమవారం బాక్సర్ అంజనీకుమార్ (63.5–67 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో) రజత పతకంతో మెరిశాడు. ఫైనల్ పోరులో చండీగఢ్ క్రీడాకారుడు అచల్వీర్తో పోటీపడి 2–3తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున మొత్తం 161 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్‌లో 6 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులను పర్యాటక, సాంస్కృతిక, క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి అభినందించారు. విజేతలు వీరే.. వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఎస్.పల్లవి (స్వర్ణం), సీహెచ్.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్కే లాల్ భషీర్ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్ (రజతం), ఆర్.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్‌లో అంజనీకుమార్ (రజతం). -
క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీలో క్రీడాకారులకు 2% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోలో ఏయే క్రీడాకారులు అందుకు అర్హులో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పుడు అందుకు విరుద్ధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారిని మాత్రమే ప్రతిభావంత క్రీడాకారులుగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు గ్రూప్–1 పోస్టులను అంతర్జాతీయ, బహుళ జాతి క్రీడల్లో పాల్గొన్న వారికే పరిమితం చేసేలా ఉందని ఆక్షేపించింది. తోకను కుక్క ఆడిస్తుందే తప్ప, తోక కుక్కను ఆడించదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన లేదన్న కారణంతో ఓ క్రీడాకారుడిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవడానికి సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని తప్పు పట్టింది. ఆ అభ్యర్థిని క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకోవాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. అధికారులు నిబంధనలకు స్వీయ భాష్యం చెబుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న ఓ క్రీడాకారుడి స్వప్నాన్ని చిదిమేయలేరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కేసు పూర్వాపరాలివీ.. జాతీయస్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ తనను క్రీడల కోటా కింద పరిగణనలోకి తీసుకునేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిటీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ జె.వెంకట బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో కూడా అర్హత సాధించానని, అయితే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేదంటూ క్రీడల కోటా కింద తనను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును తప్పుబట్టారు. రాజ్యాంగంలోని అధికరణ 309 కింద రూపొందించిన రాష్ట్ర, సబార్డినేట్ రూల్స్‌లో ఎక్కడా కూడా ప్రతిభావంతుని నిర్వచన పరిధిని అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి మాత్రమే పరిమితం చేయలేదన్నారు. çకమిషన్ వాదనను ఆమోదిస్తే.. గ్రూప్–1 పోస్టులు కేవలం కొన్ని కేటగిరీల ప్రతిభావంత క్రీడాకారులకే పరిమితం అవుతాయన్నారు. పాఠశాల, వర్సిటీ, జాతీయ, స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా ప్రతిభావంతుల కిందకే వస్తారని తెలిపారు. -
విద్యార్థులే లక్ష్యంగా దాడులా...?
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దుండగుల వీరంగాన్ని భారత క్రీడాలోకం ఖండించింది. ఆదివారం రాత్రి ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్, అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ట్విట్టర్లో స్పందిస్తూ దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ‘వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హింస భారత దేశ సంస్కృతికి విరుద్ధమైంది. కారణాలేవైనా కావొచ్చు... కానీ విద్యార్థులే లక్ష్యంగా దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాల్సిందే’. –గౌతమ్ గంభీర్ ‘జేఎన్‌యూలో ఆదివారం జరిగిన ఘటన దారుణమైనది. ఏకంగా క్యాంపస్‌లోపలే ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడిచేయడం మన దేశ ప్రతిష్టను దిగజార్చుతుంది’. –ఇర్ఫాన్ పఠాన్ ‘యూనివర్సిటీ క్యాంపస్‌లో భయానక దాడి జరిగింది. ఇది సిగ్గుచేటు. ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలి’. – రోహన్ బోపన్న ‘ఇంత జరిగాక కూడా మౌనమేంటి? విద్యార్థుల్ని ఎలా చావబాధారో చూశాం. దుండగుల్ని ఉపేక్షించడం ఎంతమాత్రం తగదు. పట్టుకొని శిక్షించాల్సిందే’. –గుత్తా జ్వాల -
పైకా జాతీయ క్రీడలు ప్రారంభం
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా తొలిసారిగా అండర్-16 పైకా జాతీయ క్రీడలకు వేదిక అయింది. జిల్లా స్టేడియంలో మంగళవారం సాయంత్రం క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడలు ఈనెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో అథ్లెటిక్స్, వాలీబాల్, తైక్వాండో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీకి 18 రాష్ట్రాల నుంచి 1400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో బాల, బాలికలకు 100 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, 3వేల మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, 4ఁ100 మీటర్ల రిలే, 4ఁ400మీటర్ల రిలే పోటీలు నిర్వహిస్తారు. తైక్వాండోలో బాలురకు 48 కిలోల విభాగంతోపాటు, 51, 55, 59, 63, 68, 73, 73 కిలోలపైబడి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. బాలికలకు 44 కిలోలు, 47, 51, 55, 55కిలోలపైబడి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. -
అతిథులొస్తున్నారు..!
ప్రేమలూరే పాలమూరు ‘పైకా’ జాతీయ క్రీడలకు వేదిక కావడంతో వివిధ రాష్ట్రాలనుంచి జట్లు తరలి వస్తున్నాయి. ఈ నెల 7నుంచి ఆటలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలను, ముమ్మరం చేస్తుండడంతో దూర ప్రాంత రాష్ట్రాలకు చెందిన పిల్లలు పట్టణానికి చేరుకుంటున్నారు. ఇలా శనివారం నాడు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా ఇక్కడ కాలుమోపారు. పోటీలో తలపడేందుకు సిద్దపడుతున్నారు. వీరిని జిల్లా యంత్రాంగం రైల్వేస్టేషన్లో స్వాగతించి బస్సుల్లో వారి బసవద్దకు చేర్చారు. దీనితో మహబూబ్‌నగర్ అతిథులతో సందడిగా మారింది. క్రీడా పతాకాల రంగుల్లో మెరిసిపోతోంది. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద 6వ జాతీయ స్థాయి ‘పైకా’పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం శాయ్ (స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) బృందం పర్యవేక్షించింది. శాయ్ ఇన్చార్జి అధికారి నీలిమాపాండేతోపాటు జాతీయ క్రీడల పర్యవేక్షకుడు సంతోష్ బటీష్, ముక్తార్‌సింగ్, రాజేష్ అరోడా, ప్రదీప్‌శర్మ నూతన అథ్లెటిక్, ప్రేక్షకుల భారీకేడ్లు, వాలీబాల్ కోర్టులను పరిశీలించారు. ఏజేసీ రాజారాం వారికి క్రీడల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్డీఎ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి మైదానాన్ని పరిశీలించి, సిబ్బందికి సూచనలు అందజేశారు. జిల్లాకు చేరిన రెండు రాష్ట్రాల జట్లు క్రీడల్లో పాల్గొనేందుకు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ జట్లు జిల్లాకు చేరుకున్నాయి. స్థానిక రైల్వేస్టేషన్లో క్రీడల ఆహ్వాన కమిటీ ప్రతినిధులు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక వాహనంలో క్రీడాకారులను జిల్లా స్టేడియానికి తీసుకొచ్చారు. పంజాబ్‌కు చెందిన బాలురు 29, బాలికలు 29, ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు కోచ్‌లు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాలురు 19, బాలికలు 20, ముగ్గురు మేనేజర్లు, ఇద్దరు కోచ్‌లు వచ్చారు. బాలురకు జిల్లా స్టేడియంలో, బాలికలకు పాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేశారు. మార్చ్ఫాస్ట్ రిహార్సల్ ప్రారంభం జిల్లాస్టేడియంలో శనివారం మార్చ్ఫాస్ట్ రిహార్సల్‌ను ప్రారంభించారు. మార్చ్ఫాస్ట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బీఈడీ కళాశాల, ఆదర్శ, రాజాప్రతాప్ డీఈడీ కళాశాలలకు చెందిన 110 మంది విద్యార్థినులతో మార్చ్ఫాస్ట్ రిహార్సల్స్ నిర్వహించారు. ఎంపిక చేసిన విద్యార్థినులు ఆయా రాష్ట్రాల ప్లకార్డులతో మైదానంలో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. ఆదివారం కూడా ఈ రిహార్సల్స్ చేపడతామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.