ప్రేమలూరే పాలమూరు ‘పైకా’ జాతీయ క్రీడలకు వేదిక కావడంతో వివిధ రాష్ట్రాలనుంచి జట్లు తరలి వస్తున్నాయి. ఈ నెల 7నుంచి ఆటలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలను, ముమ్మరం చేస్తుండడంతో దూర ప్రాంత రాష్ట్రాలకు చెందిన పిల్లలు పట్టణానికి చేరుకుంటున్నారు. ఇలా శనివారం నాడు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా ఇక్కడ కాలుమోపారు. పోటీలో తలపడేందుకు సిద్దపడుతున్నారు. వీరిని జిల్లా యంత్రాంగం రైల్వేస్టేషన్‌లో స్వాగతించి బస్సుల్లో వారి బసవద్దకు చేర్చారు. దీనితో మహబూబ్‌నగర్ అతిథులతో సందడిగా మారింది. క్రీడా పతాకాల రంగుల్లో మెరిసిపోతోంది.
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద 6వ జాతీయ స్థాయి ‘పైకా’పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం శాయ్ (స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) బృందం పర్యవేక్షించింది. శాయ్ ఇన్‌చార్జి అధికారి నీలిమాపాండేతోపాటు జాతీయ క్రీడల పర్యవేక్షకుడు సంతోష్ బటీష్, ముక్తార్‌సింగ్, రాజేష్ అరోడా, ప్రదీప్‌శర్మ నూతన అథ్లెటిక్, ప్రేక్షకుల భారీకేడ్లు, వాలీబాల్ కోర్టులను పరిశీలించారు. ఏజేసీ రాజారాం వారికి క్రీడల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి మైదానాన్ని పరిశీలించి, సిబ్బందికి సూచనలు అందజేశారు.
జిల్లాకు చేరిన రెండు రాష్ట్రాల జట్లు
క్రీడల్లో పాల్గొనేందుకు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ జట్లు జిల్లాకు చేరుకున్నాయి. స్థానిక రైల్వేస్టేషన్‌లో క్రీడల ఆహ్వాన కమిటీ ప్రతినిధులు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక వాహనంలో క్రీడాకారులను జిల్లా స్టేడియానికి తీసుకొచ్చారు. పంజాబ్‌కు చెందిన బాలురు 29, బాలికలు 29, ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు కోచ్‌లు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాలురు 19, బాలికలు 20, ముగ్గురు మేనేజర్లు, ఇద్దరు కోచ్‌లు వచ్చారు. బాలురకు జిల్లా స్టేడియంలో, బాలికలకు పాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేశారు.
మార్చ్‌ఫాస్ట్ రిహార్సల్ ప్రారంభం
జిల్లాస్టేడియంలో శనివారం మార్చ్‌ఫాస్ట్ రిహార్సల్‌ను ప్రారంభించారు. మార్చ్‌ఫాస్ట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బీఈడీ కళాశాల, ఆదర్శ, రాజాప్రతాప్ డీఈడీ కళాశాలలకు చెందిన 110 మంది విద్యార్థినులతో మార్చ్‌ఫాస్ట్ రిహార్సల్స్ నిర్వహించారు. ఎంపిక చేసిన విద్యార్థినులు ఆయా రాష్ట్రాల ప్లకార్డులతో మైదానంలో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. ఆదివారం కూడా ఈ రిహార్సల్స్ చేపడతామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
అతిథులొస్తున్నారు..!
Published Sun, Jan 5 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement