![Delhi Railway Station stampede 15 people dead with Huge Rush](/styles/webp/s3/article_images/2025/02/16/stampede.jpg.webp?itok=qHJaoRgu)
శనివారం రాత్రి ప్రయాణికులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. (ఇన్‌సెట్‌లో) రైలు ఎక్కేందుకు ప్రయాణికుల పాట్లు
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట..15 మంది దుర్మరణం
మహాకుంభ్‌మేళా భక్తులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలొచ్చాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి.
భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకుని పరుగెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచిఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
దాదాపు 12 మందిని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగి్నమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. ఘటనపై రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ట్లాడారు. ‘‘14వ నంబర్ ప్లాట్‌ఫామ్ ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్‌ఫామ్‌లపై జనం ఊహించనంతగా పెరిగిపోయి చివరకు 14వ నంబర్ ప్లాట్‌ఫామ్, 16వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్పెక్టర్(సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1,500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారు.
అందుకే పరిస్థితి అదుపు తప్పింది’’ అని డీసీపీ మల్హోత్రా చెప్పారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. ఘటనాస్థలికి వెంటనే రైల్వే పోలీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలు వెంటనే చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment