
నినాదాల టీ షర్టులు ధరించి నిరసన తెలుపుతున్న తమిళనాడు ఎంపీలు
నియోజకవర్గాల పునర్విభజనపై విపక్ష ఎంపీల నిరసన
నినాదాలు రాసిన టీ–షర్టులు ధరించిన డీఎంకే ఎంపీలు
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్ష సభ్యులు గొంతెత్తారు. గురువారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన డీఎంకే సభ్యులు సభలో టీ–షర్టులు ధరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.
నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరగా, స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ప్రస్తుతానికి ఆ అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని, దానిపై ఇప్పుడు చర్చ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నినాదాలు రాసి ఉన్న టీ–షర్టులు ధరించి సభకు వచ్చిన డీఎంకే ఎంపీలపై ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు అతిక్రమించడం ఏమిటని మండిపడ్డారు. ఎవరైనా సరే సభా సంప్రదాయాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. సభ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.
బయటకు వెళ్లి దుస్తులు మార్చుకొని రావాలని డీఎంకే సభ్యులకు సూచించారు. ఎంపీలకు గౌరవప్రదమైన వేషధారణ అవసరమని హితవు పలికారు. మధ్యా హ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సజా వుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణ ప్రసాద్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభను శుక్రవారానికి కృష్ణ ప్రసాద్ వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ అదే తీరు
పార్లమెంట్ ఎగువ సభలోనూ టీ–షర్టుల రభస చోటుచేసుకుంది. డీఎంకే ఎంపీలు నినాదాలు రాసిన టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ‘‘పునర్విభజన–తమిళనాడు పోరాటం సాగిస్తుంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని ఆ టీ–షర్టులపై రాసి ఉంది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీలు తప్పుపట్టారు. తమ టీ–షర్టులపై ‘అన్‌సివిలైజ్డ్’ అని రాసుకున్నారు. నినాదాలు ఆపేసి సభా కార్యకలాపాలకు సహకరించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పలుమార్లు కోరినా, డీఎంకే ఎంపీలు వెనక్కి తగ్గలేదు.
దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం పునఃప్రారంభమైన తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మరుసటి రోజుకి వాయిదా వేశారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో సభ నిష్ప్రయోజనంగా మారడం ఇదే మొదటిసారి. అంతకుముందు వివిధ పార్టీల సభా నాయకులతో చైర్మన్ ధన్‌ఖడ్ తన చాంబర్‌లో భేటీ అయ్యారు.
సభలో టీ–షర్టులు ధరించకూడదని డీఎంకే సభ్యులకు సూచించారు. అలాంటి దుస్తులతో పార్లమెంట్‌కు రావడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. అయితే, సభలో టీ–షర్టులు కచ్చితంగా ధరిస్తామని, నిరసన తెలియజేస్తామని డీఎంకే ఎంపీలు బదులిచ్చారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment