
ఢిల్లీ తొక్కిసలాటకు అదే కారణం
అనౌన్స్‌మెంట్ వినగానే కుంభమేళా ప్రయాణికుల్లో హైరానా
తమ రైలే అనుకుని ప్లాట్‌ఫాం మారేందుకు పరుగులు
ఇరుకు మెట్లు, ఓవర్‌బ్రిడ్జిపై ఒకరి మీద ఒకరు పడి దుర్ఘటన
18కి పెరిగిన మృతులు, 30 మందికి గాయాలు
మృతుల్లో 16 మంది మహిళలు, చిన్నారులే
న్యూఢిల్లీ: రెండు రైళ్లకు ఒకేలాంటి పేరు. ఇరుకైన ఓవర్ బ్రిడ్జి. సమాచార లోపం. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఇవే ప్రధాన కారణాలని తేలింది. మహా కుంభమేళాకు బయల్దేరిన ప్రయాణికుల్లో చాలామంది 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ‘ప్రయాగ్‌రాజ్ స్పెషల్’ రైలు 12వ ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు ప్రకటన రావడంతో తమ రైలే ఫ్లాట్‌ఫాం మారిందని భావించారు. భారీ జనసందోహం నడుమ ఏమాత్రం ఆలస్యమైనా రైలు అందదేమోనని భయపడ్డారు.
12వ ప్లాట్‌ఫాంకు చేరేందుకు ఉన్నపళంగా పరుగులు తీశారు. ఓవర్ బ్రిడ్జిపైకి దారితీసే మెట్ల మార్గంపైకి వేలాదిగా ఎగబడ్డారు. దానికి తోడు ఓవర్ బ్రిడ్జి కూడా సన్నగా ఉంది. వాటిపై ప్రయాణికులు పరస్పరం నెట్టేసుకుంటూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలామంది ఊపిరాడక కన్నుమూశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా అరుపులు కేకలతో ఏమీ విన్పించలేదు. ఈ దారుణంలో మృతుల సంఖ్య ఆదివారం 18కి పెరిగింది. వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 30 మంది గాయపడ్డారు.
తొక్కిసలాట తర్వాత మెట్ల మార్గం, ఓవర్ బ్రిడ్జిపై ఎక్కడ చూసినా చెప్పులు, చిరిగిన బ్యాగులే కనిపించాయి. రెండు రైళ్లకు ప్రయాగ్‌రాజ్ పేరుండడం అయోమయానికి దారి తీసిందని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది. వాస్తవానికి న్యూఢిల్లీ స్టేషన్ నుంచి శనివారం నాలుగు రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరాల్సి ఉంది. వాటిలో మూడు ఆలస్యమయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యమయ్యాయి. దాంతో ఆ ఐదు రైళ్లలో వెళ్లాల్సిన వారంతా ప్లాట్‌ఫాంలపైనే ఉండిపోవడంతో స్టేషన్ కిక్కిరిసిపోయింది.
ఆదివారమూ అదే రద్దీ
దుర్ఘటన జరిగినా న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆదివారం కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి వేలాది మంది తరలివచ్చారు. రైళ్లు ఎక్కడానికి పడరాని పాట్లు పడ్డారు. అధికారులు సైతం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.సమాచార లోపానికి తోడు ప్రయాణికులు గందరగోళానికి గురికావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
విచారణకు కమిటీ
తొక్కిసలాటపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రిన్సిపల్ స్టేషన్‌లోని వీడియో ఫుటేజీ అందజేయాలని అధికారులను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.
వైష్ణవ్ రాజీనామా చేయాలి
తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఆదివారం డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే ఆయన్ను తొలగించాలన్నారు. రైల్వేస్టేషన్‌కు వేలాది మంది జనం తరలివచ్చినా భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘‘దేశంలో ఇప్పుడు రెండు హిందూస్తాన్‌లు ఉన్నాయి. ఒక హిందూస్తాన్‌లో పాలకులు తమ మిత్రులకు స్వయంగా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. మరో హిందూస్తాన్‌లో సామాన్యులు ఇలా రైల్వేస్టేషన్లలో బలైపోతున్నారు. కుంభమేళాలో వీఐపీ సంస్కృతి నడుస్తోంది’’ అని ఆక్షేపించారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనపై పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment